నారా లోకేష్ హీరోగా సినిమా మిస్ - Nostalgia

By iDream Post Sep. 13, 2020, 06:42 pm IST
నారా లోకేష్ హీరోగా సినిమా మిస్ - Nostalgia

అనుకుంటాం కానీ సినిమా హీరోల వారసులు తెరమీదికొచ్చినంత సులభంగా రాజకీయ నాయకుల కొడుకులు హీరోలు కాలేరు. కొందరు ప్రయత్నించి ఫెయిల్ అవ్వొచ్చు. మరికొందరు అసలుకే మోసం వస్తుందని మొదట్లోనే ఆగిపోవచ్చు. పక్కన కర్ణాటక రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కొడుకు నిఖిల్ గౌడ హీరోగా కొనసాగడం చూస్తున్నాంగా. అతని మొదటి సినిమా జాగ్వార్ ఇప్పుడు నిర్మాణంలో ఉన్న రైడర్ తీస్తున్నది తెలుగువాళ్ళే. అయితే చాలా ఏళ్ళ క్రితం టిడిపి అధ్యక్షులు మాజీ సిఎం నారా చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి లోకేష్ ని నటనా రంగంలో తీసుకొచ్చే ట్రయల్స్ జరిగాయంటే నమ్మగలరా. కానీ ఇది అక్షరాలా నిజం.

2002లో లోకేష్ ని హీరోగా పెట్టి ఓ సినిమా తీయాలనే ప్లాన్స్ జరిగాయి. దర్శకుడిగా తేజను కూడా అనుకున్నారు. అప్పుడు తను మంచి ఫామ్ లో ఉన్నాడు. జయం బ్లాక్ బస్టర్ సక్సెస్ అప్పటికే ఇండస్ట్రీనే ఊపేస్తోంది. కమర్షియల్ అంశాలు మిస్ కాకుండా ప్రేమకథలను తీస్తాడని నిర్మాతలు వెంటపడుతున్నారు. నితిన్ తరహాలో లోకేష్ ను కూడా లవ్ స్టోరీని చూపిస్తే ఎలా ఉంటుందనుకున్నారో మరి. అప్పుడు చంద్రబాబు నాయుడు సిఎంగా ఉన్నారు. కొడుకు కనక ఇండస్ట్రీలో స్టార్ గా ఎదిగితే బహుశా భవిష్యత్తులో తన వారసత్వానికి పొలిటికల్ మైలేజ్ వస్తుదేనని భావించారో ఏమో. కానీ ఇది కార్యరూపం దాల్చలేదు. లోకేష్ హీరో కాలేదు. ఒకవేళ అయ్యుంటే ఎలా ఉండేదో మీ ఊహకే వదిలేస్తున్నాం

కానీ తెలుగు ఇప్పటికీ పూర్తి స్థాయిలో స్పష్టంగా పలకలేని లోకేష్ డైరెక్టర్లను ఎన్ని ఇబ్బందులు పెట్టేవారో మరి. ఇది ఆ సమయంలో వచ్చిన సంతోషం సినిమా పత్రిక ప్రారంభ సంచికలో వచ్చిన వార్త. దీన్నే కవర్ పేజీ మీద హెడ్డింగ్ గా కూడా పెట్టారు. ఇక్కడ గమనించాల్సిన అంశం మరొకటుంది. 2001లో జూనియర్ ఎన్టీఆర్ నిన్ను చూడాలని సినిమాతో వచ్చేశాడు. సరిగ్గా ఏడాది గ్యాప్ లోనే లోకేష్ ని ఇండస్ట్రీలోకి తేవాలని ఆలోచించడం చూస్తే ఆ టైంలోనే తారక్ కు చెక్ పెట్టే స్ట్రాటజీగా కనిపిస్తోంది. లోకేష్ హీరో అయ్యుంటే ఏం జరిగేదో కానీ ఇప్పుడీ టాపిక్ ఆ మ్యాగజైన్ కవర్ పేజీ సోషల్ మీడియాలో రావడం వల్ల బాగా వైరల్ అయ్యింది. ఒక స్టార్ ని మిస్ అయ్యాం అని సెటైర్లు కూడా వేస్తున్నారు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp