వినోదం వేదాంతం కలిసిన సినిమా - Nostalgia

By iDream Post Mar. 14, 2021, 06:23 pm IST
వినోదం వేదాంతం కలిసిన సినిమా - Nostalgia

సూపర్ స్టార్ రజనీకాంత్ పేరుకున్న ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సింది ఏమి లేదు. స్టైల్ మ్యానరిజంలో ఆయన చూపించిన ప్రభావం ఇంకెవరు రిపీట్ చేయలేకపోయారన్నది వాస్తవం. డాన్సులు తదితర విషయాల్లో కొన్ని బలహీనతలు ఉన్నా స్క్రీన్ ప్రెజెన్స్ కు వచ్చేటప్పటికీ తనను అందుకోవడం మాత్రం అతి కొద్దిహీరోలకే సాధ్యమయ్యింది. తెలుగులో రజినికి మొదటి నుంచి డబ్బింగ్ సినిమాల రూపంలో ప్రేక్షకులతో పరిచయం ఉన్నా ఇక్కడంటూ ప్రత్యేకమైన మార్కెట్ ఏర్పడింది మాత్రం బాషాతోనే. అది సాధించిన ఘన విజయం ఇక్కడ సుస్థిర స్థానాన్ని ఇచ్చింది. ఒకరకంగా అప్పటి నుంచి ఓ ఐదేళ్లు మహర్దశ అని చెప్పాలి.

1995 సంవత్సరం. బాషా బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత రజని చేసిన చిత్రాలు రెండు. ఒకటి 'పెదరాయుడు' రెండు హిందీలో 'ఆటంక్ హీ ఆటంక్'. మొదటిది రికార్డులు సృష్టించగా రెండోది అమీర్ ఖాన్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నా సోసోగానే ఆడింది. అప్పుడు చేసిందే ముత్తు. దర్శకుడు కె ఎస్ రవికుమార్ కు అప్పటికే పల్లెటూరి నేపథ్యంలో అద్భుతమైన సినిమాలు తీస్తారనే పేరు వచ్చేసింది. 1994లో మలయాళంలో వచ్చిన 'తెన్మావిన్ కొంబత్' ఆధారంగా ఓ కొత్త సబ్జెక్టు తయారు చేయమని ఆయనకు పురమాయించారు రజిని. యజమాని పనివాడు ఒకే అమ్మాయిని ప్రేమించే కాన్సెప్ట్ తో రూపొందిన ఒరిజినల్ వెర్షన్ లో రజిని ఇమేజ్ కు తగ్గట్టు కమర్షియల్ మాసాలాలు లేవు.

దాంతో రవికుమార్ ఇదంతా దృష్టిలో పెట్టుకుని అందులో లేని సన్నివేశాలు, కీలకమైన ఫ్లాష్ బ్యాక్ తదితరాలు అన్నీ జోడించారు. అప్పటిదాకా ఇళయరాజా, దేవాలను తప్ప సంగీత దర్శకుడిగా ఇంకెవరిని ఇష్టపడని రజని మొదటిసారి ఆ బాధ్యతను ఏఆర్ రెహమాన్ కు అప్పగించారు. మీనా హీరోయిన్ గా మరో కీలక పాత్రలో శరత్ బాబుని తీసుకుని మైసూర్, చెన్నై, కేరళ తదితర ప్రాంతాల్లో షూటింగ్ చేశారు. క్లైమాక్స్ కోసం 5000 జూనియర్ ఆర్టిస్టులను సమీకరించడం అప్పట్లో రికార్డు. ఫ్లాష్ బ్యాక్ లో ముత్తు తండ్రి పాత్రనూ రజనినే పోషించాడు. వేదాంతం బోధించే బిచ్చగాడిగా తన అద్భుత నటన ప్రేక్షకులను కట్టిపడేసింది. ఫలితంగా ముత్తు బాక్సాఫీస్ వద్ద గొప్ప విజయాన్ని సొంతం చేసుకుంది. ఒకడే ఒక్కడు మొనగాడు, తిల్లానా తిల్లానా పాటలు ఇప్పటికీ మ్యూజిక్ లవర్స్ హాట్ ఫెవరెట్

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp