అన్నల కోసం ప్రేమ త్యాగం - Nostalgia

By iDream Post Mar. 12, 2021, 08:30 pm IST
అన్నల కోసం ప్రేమ త్యాగం - Nostalgia

ప్రేమను తెరమీద ఎన్నిసార్లు చూపించినా తీసే విధానం కొత్తగా ఆకట్టుకునేలా ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారని ఏఎన్ఆర్ లైలా మజ్నులతో మొదలుపెట్టి మొన్న వచ్చిన ఉప్పెన దాకా కొన్ని వందల సినిమాలు ఋజువు చేసి ఆణిముత్యాలుగా మిగిలిపోయాయి. అయితే అన్నింటి కన్నా సున్నితమైనవి కులమతాల వైరుధ్యాలను ఆధారంగా చేసుకుని వచ్చేవి. మణిరత్నం బొంబాయి ఈ విషయంలో ఎవర్ గ్రీన్ క్లాసిక్ గా చెప్పుకోవచ్చు. అయితే ఫలితంతో సంబంధం లేకుండా కొన్ని లవ్ స్టోరీస్ ఆడియన్స్ ని మెప్పించినవి లేకపోలేదు. అందులోనూ ఒక బాష నుంచి మరోభాషకు రీమేక్ అవుతున్నప్పుడు వాటి మీద ప్రత్యేకమైన ఫోకస్ ఉంటుంది. ఓ ఉదాహరణ చూద్దాం

1997లో మలయాళంలో 'అనియాతిప్రావు' సినిమా వచ్చింది. ఫాజిల్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయ్యింది. ముగ్గురు అన్నయ్యల ముద్దుల చెల్లెలు మతం కానీ వాడిని ప్రేమిస్తే వాళ్ళు తట్టుకోలేకపోతారు. అలా అని ఈ జంట ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుని విడిపోయేందుకు సిద్ధంగా ఉండరు. కాని ఉండబట్టలేక లేచిపోయి హీరో ఇంట్లో తలదాచుకుంటారు. పెళ్లి చేసుకుందాం అనుకుంటున్న సమయంలో పెద్దవాళ్ళను మిస్ చేసుకుని ఎంత తప్పు చేస్తున్నామో అర్థం చేసుకుంటారు. వేడుకను రద్దు చేసుంటారు. ఆ తర్వాత రెండు కుటుంబాల పెద్దలను ఒప్పించి వీళ్ళు ఎలా గెలిచారు అనేదే కథ.

కుంచకో బోబన్, షాలిని జంటగా ఒరిజినల్ వెర్షన్ రూపొందగా అదే ఫాజిల్ తమిళంలో విజయ్ తో రీప్లేస్ చేసి హీరోయిన్ ని మార్చకుండా రీమేక్ చేశారు. 'కాధలిక్కు మరియాదై' పేరుతో రూపొందిన ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఆ టైంలో గ్రాఫ్ కాస్త డౌన్ అవుతున్న టైంలో ఇళయరాజా మరోసారి ఈ సినిమా ఆల్బమ్ తో విశ్వరూపం చూపించారు. ఇదే లైన్ తీసుకుని కొన్ని మార్పులతో 1998లో జెడి చక్రవర్తి, రచన జంటగా ఈవివి సత్యనారాయణ 'నేను ప్రేమిస్తున్నాను'గా శిర్పి సంగీతంతో రీమేక్ చేశారు. క్యాస్టింగ్ భారీగా తీసుకుని మంచి బడ్జెట్ లో తీసినప్పటికీ ఈ సినిమా ఒరిజినల్ స్థాయిలో మెప్పించలేకపోయినా యావరేజ్ ఫలితంతో మ్యూజికల్ గా హిట్టు కొట్టింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp