రెండు ప్రేమల విక్టరీ ప్రియుడు - Nostalgia

By iDream Post Mar. 01, 2021, 08:29 pm IST
రెండు ప్రేమల విక్టరీ ప్రియుడు - Nostalgia

90వ దశకంలో టైటిల్స్ లో ఎక్కువగా వినిపించిన పదాలు ప్రియుడు, మొగుడు, అల్లుడు. స్టార్ల నుంచి చిన్న హీరోల దాకా అందరూ అటు ఇటు తిప్పి వీటినే వాడుకుంటూ ఒకరకంగా హిట్ సెంటిమెంట్ గా మార్చేశారు. ముఖ్యంగా రాఘవేంద్రరావు గారికి 'అల్లుడుగారు' తర్వాత అల్లరి మొగుడు, రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు ఇలా వరసగా హిట్లు వచ్చి పడటంతో ఆయన దాన్ని అలాగే కొనసాగిస్తూ వచ్చారు. యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ తో చేసిన 'అల్లరి ప్రియుడు' సైతం బ్లాక్ బస్టర్ కావడంతో అంత త్వరగా దీన్ని వదల్లేకపోయారు. జగపతిబాబుతో తీసిన 'అల్లరి ప్రేమికుడు' ఝలక్ ఇచ్చే దాకా ఇది కంటిన్యూ అయ్యింది. ఆ టైంలో వచ్చిన మరో చిత్రమే 'ముద్దుల ప్రియుడు'.

1994వ సంవత్సరం. వెంకటేష్ అటు గ్రామీణ నేపధ్యంలో ఇటు సిటీ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు చేస్తూ మంచి ఫామ్ లో ఉన్నారు. చంటి, అబ్బాయిగారు లాంటి చిత్రాలు పల్లెటూరిని హై లైట్ అయ్యేలా రూపొందిన సూపర్ హిట్స్. దర్శకేంద్రుడితో చేసిన సుందరకాండ అర్బన్ స్టైల్ కాలేజీలో సాగుతూ బ్లాక్ బస్టర్ కొట్టింది.అయితే ఇవన్నీ రీమేకులు. అందుకే అలా కాకుండా గ్రామం, నగరం రెండు మిక్స్ చేసి రెండు లవ్ స్టోరీస్ ని లింక్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనకు శ్రీకారమే ముద్దుల ప్రియుడు. సత్యానంద్ రచనలో ఎంఎం కీరవాణి సంగీత దర్శకత్వంలో రంభ రమ్యకృష్ణలను హీరోయిన్లుగా తీసుకుని రాఘవేంద్రరావు పెద్ద బడ్జెట్ లోనే సినిమాను పూర్తి చేశారు. మ్యూజికల్ గా ఎప్పటికీ నిలిచిపోయేలా స్థాయిలో కీరవాణి మరోసారి గొప్ప ట్యూన్లు ఇచ్చారు.

ఒక కథ పల్లెటూరిలో రంభతో ప్రేమకథగా సాగితే రెండో కథలో రమ్యకృష్ణతో లవ్ స్టోరీగా ఉంటుంది. దీనికి అల్లరి చేసే పిల్లల ట్రాక్ బోనస్. మధ్యలో గతాన్ని మర్చిపోవడమనే చిన్న గజినీ స్టైల్ ట్విస్ట్ పెట్టి కొత్తగా చెప్పాలనుకున్నారు. అయితే ప్రొడక్షన్ వాల్యూస్ ఎంత రిచ్ గా ఉన్నా సంబంధం లేని రెండు వైరుధ్య కథలను లింక్ చేసి చెప్పిన విధానం ప్రేక్షకులను పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయింది. పాటలు అద్భుతంగా కుదిరినా డ్రామా కొంత ఎక్కువయ్యింది. అందులోనూ రమ్యకృష్ణ పాత్రకి విధవ అనే ట్విస్ట్ పెట్టడం జనానికి అస్సలు నచ్చలేదు. కీరవాణి ఆడియో చాలా మటుకు కాపాడింది. ఫస్ట్ వీక్ రిలీజైనప్పుడు టాక్ తేడాగా రావడంతో కథాక్రమం మారేలా ఎడిటింగ్ చేసి కొత్త వెర్షన్ ని కంటిన్యూ చేశారు. అయినా కూడా లాభం లేకపోయింది. ఎబోవ్ యావరేజ్ తో సంతృప్తి పడాల్సి వచ్చింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp