సింహాల వేటలో సినిమా చిత్తు - Nostalgia

By iDream Post Mar. 18, 2021, 08:30 pm IST
సింహాల వేటలో సినిమా చిత్తు - Nostalgia

హాలీవుడ్ సినిమాల నుంచి మనవాళ్ళు స్ఫూర్తి తీసుకోవడమో లేదా గుట్టుచప్పుడు కాకుండా రీమేక్ చేసుకోవడమో ఎప్పటినుంచో ఉన్నదే. ఇప్పుడంటే సోషల్ మీడియా పుణ్యమాని అందరూ దొరికిపోతున్నారు కానీ ఒకప్పుడు ఇంగ్లీష్ మూవీస్ తక్కువగా అందుబాటులో ఉండే కాలంలో ప్రముఖ విశ్లేషకులకు తప్ప మాములు జనానికి ఈ కాపీ వ్యవహారాలు అంతుచిక్కేవి కావు. అయితే ఇలా చేయడం తప్పా ఒప్పా అనేది పక్కనపెడితే మెగాస్టార్ లాంటి శిఖరాన్ని డీల్ చేస్తున్నప్పుడు కథలో ఉన్న ఎలిమెంట్స్ తన ఇమేజ్ కు సరితూగుతాయా లేదా అనేది చెక్ చేసుకోకుండా కోట్ల రూపాయల బడ్జెట్ ని మంచి నీళ్లలా ఖర్చు పెడితే ఏమవుతుంది. ఓ ఉదాహరణ చూద్దాం.

2001 సంవత్సరం. 'చూడాలని ఉంది' బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత చిరు చేసిన 'స్నేహం కోసం' యావరేజ్ కాగా 'ఇద్దరు మిత్రులు' ఫ్లాప్ అయ్యింది. మళ్ళీ 'అన్నయ్య'తో కం బ్యాక్ అయ్యారు. సరిగ్గా ఆ టైంలో చేసిన సినిమానే మృగరాజు. తనకో సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ తో మరో సినిమా చేయాలని చిరంజీవి ఆలోచన. అప్పటికే ఘరానా మొగుడు-అల్లుడా మజాకాల నిర్మాత దేవివరప్రసాద్ గారికి డేట్లు ఇచ్చేశారు. చేతిలో కథ లేదు. అదే సమయంలో నాగబాబు 1996లో వచ్చిన 'ది ఘోస్ట్ అండ్ డార్క్ నెస్'ని మన నేటివిటీకి తగ్గట్టు మార్చి తీస్తే ఎలా ఉంటుందన్న సలహా ఇచ్చారు. ఏ ముహూర్తంలో విన్నారో కానీ అందరికీ ఇది నచ్చింది.

సంభాషణల రచయిత సత్యానంద్ తో పాటు యండమూరి వీరేంద్రనాథ్, నాగబాబులు కలిసి స్క్రిప్ట్ కో రూపాన్ని ఇచ్చారు. అడవిలో ప్రభుత్వం కడుతున్న బ్రిడ్జ్ ప్రాజెక్ట్ లో పనిచేసే అమాయక గిరిజనులను పొట్టన పెట్టుకుంటున్న సింహాల అంతు చూసే రాజు కథే మృగరాజు. చాలా చిన్నదైన ఈ లైన్ కి కమర్షియల్ హంగుల పేరుతో ఇచ్చిన మసాలా కోటింగ్, వెగటు అనిపించే ఫ్లాష్ బ్యాక్, పేలవమైన క్లైమాక్స్, క్వాలిటీ లేని గ్రాఫిక్స్ వెరసి మృగరాజుని ప్రేక్షకులే కాదు అభిమానులు కూడా భరించలేకపోయారు. మణిశర్మ పాటలు కొంత ఊరటనిచ్చినా లాభం లేకపోయింది. 2001 సంక్రాంతికి మృగరాజుతో పోటీ పడిన 'నరసింహనాయుడు' ఇండస్ట్రీ హిట్ కాగా 'దేవిపుత్రుడు' కూడా సోసో ఫలితాన్నే అందుకుంది. ఈ మూడు సినిమాలకు మణిశర్మే సంగీత దర్శకుడు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp