నటుడి కెరీర్ ని దెబ్బ తీసిన బామ్మ - Nostalgia

By iDream Post Jan. 20, 2021, 07:52 pm IST
నటుడి కెరీర్ ని దెబ్బ తీసిన బామ్మ  - Nostalgia

సినిమా సెట్లలో చిత్రీకరణలో ప్రమాదాలు జరగడం సహజం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్నిసార్లు అనూహ్య పరిణామాలు ఎదురవుతూనే ఉంటాయి. ఆ మధ్య కమల్ హాసన్ ఇండియన్ 2 షూటింగ్ లో క్రేన్ పడిపోయి టెక్నీషియన్లు చనిపోయిన విషాద సంఘటన ఇంకా కళ్ళముందు మెదులుతూనే ఉంది. కొన్నిసార్లు ఇలాంటి ఘటనల వల్ల ప్రముఖ నటులు సైతం తమ విలువైన కెరీర్ ని బంగారు భవిష్యత్తుని పోగొట్టుకున్న దాఖలాలు ఉన్నాయి. నూటొక్క జిల్లాల అందగాడిగా పేరొందిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ కం విలన్ నూతన్ ప్రసాద్ గారు కూడా ఈ విధి ఆటకు గురవ్వడం అంత సులభంగా మర్చిపోలేం. అప్పటి ఆ జ్ఞాపకాన్ని ఓసారి తరచి చూద్దాం.

1988వ సంవత్సరం. తమిళంలో సుప్రసిద్ధ ఏవిఎం సంస్థ 'పాట్టి సొల్లయ్ తాట్టతే' సినిమాని పాండిరాజన్ హీరోగా మనోరమ టైటిల్ పాత్రలో నిర్మించింది. ముసలావిడ పాత్రను హైలైట్ చేస్తూ దర్శకుడు రాజశేఖర్ దీన్ని ఆద్యంతం వినోదాత్మకంగా రూపొందించిన తీరు అక్కడి ప్రేక్షకులను కట్టి పడేసింది. ఫలితంగా సిల్వర్ జూబ్లీ ఆడేసి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది. ఇందులో ప్రీ క్లైమాక్స్ ముందు మేజిక్ కారుతో చేయించిన విన్యాసాలు పిల్లలను విపరీతంగా ఆకట్టుకుని కుటుంబాలు సినిమా హాలుకు పోటెత్తేలా చేశాయి. చంద్రబోస్ సంగీతం కూడా మంచి పేరు తీసుకొచ్చింది. ఈ కథను పలు హాలీవుడ్ సినిమాల స్ఫూర్తితో సౌత్ నేటివిటీకి అనుగుణంగా మార్చుకున్నారు.

ఇదే ఏవిఎం సంస్థ తెలుగులో 1989లో 'బామ్మ మాట బంగారు బాట' పేరుతో రీమేక్ చేసింది. దర్శకుడు, మ్యూజిక్ డైరెక్టర్లతో సహా దాదాపు అదే టీమ్ ని కొనసాగిస్తూ క్యాస్టింగ్ మాత్రం తెలుగు నటీనటులను తీసుకున్నారు. రాజేంద్రప్రసాద్, గౌతమి జంటగా నటించగా అసలైన బామ్మ క్యారెక్టర్ చేయడానికి భానుమతి గారు ఒప్పుకున్నారు. ఆవిడ భర్తగా చేసిన నూతన్ ప్రసాద్ దీని షూటింగ్ లోనే ప్రమాదానికి గురై వెన్నెముక దెబ్బ తినడంతో కాళ్ళు చచ్చుబడి చక్రాల కుర్చీ మీద ఆధారపడాల్సి వచ్చింది. వైకల్యం శాశ్వతం అయ్యింది. అది ఆయన ఆర్టిస్ట్ గా విపరీతమైన డిమాండ్ ఉన్న సమయం. వ్యక్తిగతంగానే కాదు ఆర్థికంగా కూడా ఇది తీవ్రప్రభావం చూపించింది. బామ్మమాట బంగారు బాట హిట్టయినా ఈ చేదు సంఘటన దాన్ని ఆస్వాదించనివ్వలేదు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp