ఇద్దరు హీరోలు ఓకే టైపు - Nostalgia

By iDream Post Mar. 20, 2021, 08:30 pm IST
ఇద్దరు హీరోలు ఓకే టైపు - Nostalgia

మాములుగా ఇద్దరు హీరోల సినిమాలు రూపొందినప్పుడు ఒక క్యారెక్టర్ కి మరో పాత్రకు పోలిక లేకుండా దర్శక రచయితలు జాగ్రత్త పడతారు. ఒకరు దొంగ అయితే మరొకరు పోలీస్ గానో లేదా ఒకరికి మంచి ఉద్యోగం ఉంటే రెండో వాడు పోకిరి టైపులోనో ఉండటం సహజం. అలా కాకుండా ఇద్దరూ ఒకే తరహా పాత్రలైతే ఎలా ఉంటుందన్న ఆలోచన బాలీవుడ్ సుప్రసిద్ధ రచయితలు సలీం జావేద్ లకు వచ్చింది. అదే 1974లో వినోద్ ఖన్నా-రణధీర్ కపూర్ లు హీరోగా 'హాథ్ కి సఫాయి'గా వచ్చి ఘన విజయం అందుకుంది. ప్రకాష్ మెహరా దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ సూపర్ స్టార్ కృష్ణ గారికి బాగా నచ్చింది.

అప్పటికే ఆయన బావమరిది ఉప్పలపాటి సూర్యనారాయణబాబు నిర్మాతగా తొలి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. దీన్నే చేసుకోమని కృష్ణ ప్రోత్సహించి త్రిపురనేని మహారథితో స్క్రిప్ట్ సిద్ధం చేయించారు. కొద్దిపాటి మార్పులు తోడయ్యాయి. మంజుల, జామున హీరోయిన్లు కాగా మోహన్ బాబు, త్యాగరాజు, సాక్షి రంగారావు తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. సత్యం సంగీతం అందించారు. కృష్ణ గారే ఎం మల్లికార్జున రావును దర్శకుడిగా రికమండ్ చేశారు. అలా 1977లో 'మనుషులు చేసిన దొంగలు'ని భారీ బడ్జెట్ తో ఈ రీమేక్ ని నిర్విఘ్నంగా పూర్తి చేశారు సూర్యనారాయణ. అక్టోబర్ 19న ఈ సినిమా విడుదలయ్యింది.

ఇందులో చిన్నప్పుడే ఇద్దరు హీరోలు విడిపోతారు. వేర్వేరు చోట్ల ఇద్దరూ దొంగలుగానే పెరుగుతారు. కానీ విచిత్రంగా ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పడక ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటారు. నిజం తెలిశాక విలన్ అంతు చూస్తారు. భారీ అంచనాల మధ్య రిలీజైన మనుషులు చేసిన దొంగలు మంచి ఫలితాన్నే అందుకుంది. కాకపోతే కేవలం రెండు రోజుల గ్యాప్ తో వచ్చిన 'యమగోల' సునామి ముందు తగ్గాల్సి వచ్చింది. దానికి తోడు వేరే నిర్మాత ఒకరు అదే నెల 15వ తేదీ 'దొంగలు చేసిన దేవుడు' అనే డబ్బింగ్ సినిమా కూడా విడుదల చేసి ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేశారు. మొత్తానికి బ్లాక్ బస్టర్ కాకపోయినా మనుషులు చేసిన దొంగలు డీసెంట్ సక్సెస్ అయ్యింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp