ఆడ వేషంలో 'మేడమ్' నవ్వులు - Nostalgia

ఒక ఇమేజ్ వచ్చాక స్టార్ హీరోలు ఆడ వేషం వేయాలంటే ప్రాక్టికల్ గా చాలా సమస్యలు ఉంటాయి. ఏ మాత్రం అటుఇటు అయినా దాని ప్రభావం ఫలితం మీద చాలా తీవ్రంగా ఉంటుంది. అందుకే ఇలాంటి ప్రయత్నాలు మన హీరోలు చాలా అరుదుగా చేస్తారు. దాదాపు ప్రతిఒక్కరు ఈ ముచ్చట తీర్చుకున్నారు కానీ సినిమా మొత్తం అదే గెటప్ లో చేయడం అంటే సాహసమే. దానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ఆదరణ దక్కడం కూడా విశేషమే. దానికో మంచి ఉదాహరణగా 'మేడమ్'ని చెప్పుకోవచ్చు. 1991లో నరేష్ 'చిత్రం భళారే విచిత్రం' రూపంలో బ్లాక్ బస్టర్ అందుకున్నాక రాజేంద్రప్రసాద్ కూ అలాంటిది ఒకటి తనకూ కావాలని కోరుకున్నారు.
సరైన కథ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో 1994లో ఆ కోరిక తీరింది. సుప్రసిద్ధ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు గారు చెప్పిన ఓ లైన్ నటకిరీటీకి బ్రహ్మాండంగా నచ్చింది. స్వంతంగా తనే నిర్మించాలని నిర్ణయించుకుని ఎంవివిఎస్ బాబురావుతో కలిసి స్క్రిప్ట్ ని సిద్ధం చేయించారు. బడ్జెట్ సినిమాలను 35 ఎంఎంలోనే తీస్తున్న టైంలో ఆ విషయంలోనూ రాజీ పడకుండా సినిమా స్కోప్ కి ఫిక్స్ అయ్యారు. తనతో రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు సూపర్ హిట్స్ లో నటించిన సౌందర్యను హీరోయిన్ గా తీసుకున్నారు. ఇంకా అప్పటికావిడ స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకోలేదు. భైరవద్వీపం, బృందావనం లాంటి చక్కని ఆల్బమ్స్ తో తనతో సింక్ కుదుర్చుకున్న మాధవిపెద్ది సురేష్ నే సంగీత దర్శకుడిగా ఎంచుకున్నారు సింగీతం.
స్నేహితుడి(శుభలేఖ సుధాకర్) బామ్మ ఆరోగ్యం కోసం ఒక్క రోజు ఆడ వేషం వేసిన డబ్బింగ్ ఆర్టిస్ట్ ప్రసాద్(రాజేంద్ర ప్రసాద్) అనుకోకుండా ఆ గెటప్ లోనే నెలల తరబడి గడపాల్సి వచ్చింది. ప్రియురాలి(సౌందర్య)దగ్గర మాములుగా బయటి ప్రపంచానికి సరోజినీదేవిగా రెండు పాత్రలు వేయాల్సి వస్తుంది. మధ్యలో ఒక కన్ఫ్యుజింగ్ లవ్ డ్రామా కూడా ఉంటుంది. 1994 అక్టోబర్ 19న రిలీజైన మేడమ్ ఆద్యంతం నవ్వుల్ని పంచి ఆడియన్స్ కి పిచ్చపిచ్చగా నచ్చేసింది. మహిళా సంక్షేమం కోసం సరోజినీ విరాళాలు వసూలు చేసే సీన్లో చిరంజీవి, విజయశాంతిలు కనిపిస్తారు. ఇదో అదనపు బోనస్. నగేష్, ఏవిఎస్, రావికొండలరావు, సాక్షి రంగారావు, షావుకారు జానకి తదితరులు ఆయా పాత్రలకు తగ్గట్టు సహజంగా ఒదిగిపోయారు. మ్యూజికల్ గానూ మేడమ్ మంచి స్పందన దక్కించుకుంది.


Click Here and join us to get our latest updates through WhatsApp