మంచితనానికి ప్రతిరూపం ఈ అన్నయ్య - Nostalgia

By iDream Post Jun. 29, 2021, 08:20 pm IST
మంచితనానికి ప్రతిరూపం ఈ అన్నయ్య - Nostalgia

మాములుగా అన్నా చెల్లెళ్ళ సెంటిమెంట్ మీద సినిమాలు ఎక్కువగా వస్తుంటాయి కానీ సరైన రీతిలో రాసుకోవాలే కానీ తమ్ముళ్లతో కూడా ఎమోషన్ ని పిండేసి కాసులు రాబట్టుకోవచ్చు. ఎలా అంటారా. ఇది చూడండి. 2000 సంవత్సరం సంక్రాంతికి విజయ్ కాంత్ హీరోగా తమిళంలో 'వానతైపోలా' వచ్చింది. విక్రమన్ దర్శకత్వంలో రూపొందిన ఈ విలేజ్ బ్రదర్స్ డ్రామాకు అక్కడి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఏకంగా 250 రోజులు ప్రదర్శింపబడి కొత్త రికార్డులు సృష్టించింది. దీంతో రీమేక్ హక్కులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. కన్నడలో విష్ణువర్ధన్ తో 'యజమాన' పేరుతో, తెలుగులో రాజశేఖర్ కథానాయకుడిగా 'మా అన్నయ్య' టైటిల్ తో రీమేకులు ఒకేసారి మొదలయ్యాయి.

ఈ కథ ఒప్పుకునే సమయానికి రాజశేఖర్ హ్యాట్రిక్ డిజాస్టర్లతో ఉన్నారు. నేటి గాంధీ, బొబ్బిలి వంశం, మెకానిక్ మావయ్య వరసగా ఫెయిలయ్యాయి. ఇవన్నీ స్ట్రెయిట్ సబ్జెక్టులే. అప్పుడే దర్శకుడు రవిరాజా పినిశెట్టితో కలిసి వానతైపోలా రీమేక్ ప్రతిపాదన తీసుకొచ్చారు నిర్మాతలు బెల్లంకొండ సురేష్, సింగనమల రమేష్ లు. అప్పటికి ఐదారేళ్ళ నుంచి టాలీవుడ్ లో ఫ్యామిలీ సినిమాలు బ్రహ్మాండంగా ఆడుతున్నాయి. అగ్ర హీరోలందరూ ఈ జానర్లో బ్లాక్ బస్టర్లు అందుకున్నారు. ఆల్రెడీ ప్రూవ్ అయిన సబ్జెక్టు కావడంతో ఎక్కువ ఆలస్యం చేయకుండా వెంటనే ఒప్పేసుకున్నారు యాంగ్రీ మెన్. ఆయన సరసన మీనా హీరోయిన్ గా ఎంపికయ్యింది. రెండు విభిన్నమైన గెటప్స్ లో రాజశేఖర్ డ్యూయల్ రోల్ చేయడం మార్కెట్ పరంగా ప్లస్ అయ్యింది.

పోతపోసిన మంచితనానికి ప్రతిరూపంగా ఉండే గోపాలం(రాజశేఖర్)తన తమ్ముళ్ల కోసమే సర్వం త్యాగం చేసి వాళ్ళను గొప్ప స్థాయికి చేర్చేందుకు కష్టపడతాడు. ఎన్ని అవమానాలు ఎదురైనా దిగమింగుకుని కుటుంబంలో వచ్చిన కలతలను కంటికి రెప్పలా కాచుకుంటూ నెగ్గుకొస్తాడు. ఈ మెయిన్ పాయింట్ మీద ఆరోగ్యకరమైన భావోద్వేగాలను పండించడంతో మా అన్నయ్య మన ఆడియన్స్ కూ బాగా నచ్చేశాడు. ఎస్ ఏ రాజ్ కుమార్ నుంచి మరో మెలోడీ ఆల్బమ్ మ్యూజిక్ లవర్స్ ని మెప్పించింది. 2000 డిసెంబర్ 1న రిలీజైన మా అన్నయ్య యాంగ్రీ మెన్ కోరుకున్న సక్సెస్ ని బంగారు పళ్లెంలో అందించింది. ముఖ్యంగా బిసి సెంటర్స్ లో విరగాడేసింది. అటు కన్నడలో యజమాన ఏకంగా ఇండస్ట్రీ రికార్డులు నెలకొల్పాడు. భోజ్ పూరి, బెంగాలీలో కూడా ఇది రీమేక్ అయ్యింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp