ఇది పెదనాన్న 'బాహుబలి' - Nostalgia

By iDream Post Apr. 14, 2020, 04:39 pm IST
ఇది పెదనాన్న 'బాహుబలి' - Nostalgia

డార్లింగ్ గా, రెబెల్ స్టార్ గా అశేష అభిమానులను సంపాదించుకున్న ప్రభాస్ కు బాహుబలి తెచ్చిన ఖ్యాతి ఎలాంటిదో చూశాం. హిందీలోనూ వందల కోట్లు కొల్లగొట్టే స్థాయికి ప్రభాస్ చేరుకున్నాడంటే అది దాని చలవే. ఇప్పటికీ బాలీవుడ్ తో సహా అన్ని భాషల్లోనూ బాహుబలిని మించిన సినిమా తీయాలని తాపత్రయపడే వారెందరో. ఇదిలా ఉండగా ప్రభాస్ కు ఇంత స్టార్ డం రావడంలో మొదటి అడుగుగా నిలిచిన కృష్ణంరాజు గారికి సైతం ఇలాంటి చిరస్మరణీయమైన చిత్రం ఒకటుంది. అదే 'తాండ్రపాపారాయుడు'.

1986లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో చాలా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. గోపికృష్ణ బ్యానర్ పై కృష్ణంరాజు గారితో కలిసి ఆయన సోదరుడు సూర్యనారాయణరాజు దీన్ని నిర్మించారు. 17వ శతాబ్దం నాటి కథాకాలంలో వీరులకు పురిటిగడ్డైన బొబ్బిలి బ్యాక్ డ్రాప్ లో ఈ కథ సాగుతుంది. బాహుబలి ఫాంటసీ కథ కాగా తాండ్ర పాపారాయుడు చరిత్రను ఆధారంగా చేసుకుని వాస్తవిక అంశాలను మేళవించి రూపొందించినది. కళింగ దేశాన్ని ఆక్రమించాలనే దురుద్దేశంతో ఫ్రెంచ్ తరఫున రాయబారిగా వచ్చిన బుస్సీ దొర బొబ్బిలి, విజయనగరం సంస్థానాల మధ్య ఉన్న వైరుధ్యాలను తనకు అనుకూలంగా మార్చుకునే కుట్రలు పన్నుతాడు. వీటికి అనుకుని ఉన్న రాజాం సంస్థానపు యువరాజు తాండ్రపాపారాయుడు. అవకాశం ఎదురుచూస్తున్న విజయరామరాజు బుస్సీని మచ్చిక చేసుకుని బొబ్బిలి మీద యుద్ధం ప్రకటిస్తాడు. అరివీరభయంకరంగా జరిగిన పోరులో పాపారాయుడు వీరమరణం పొందుతాడు.

సినిమా ఆద్యంతం అద్భుతమైన కథా కథనాలతో సాగుతుంది. అప్పట్లోనే దీనికి సుమారు 1 కోటి 75 లక్షల దాకా ఖర్చు పెట్టడం కథలుగా చెప్పుకునేవారు. కేవలం వార్ సీన్స్ కోసమే 50 లక్షలు బడ్జెట్ అయ్యిందంటే అర్థం చేసుకోవచ్చు. దాసరి నారాయణరావు గారికి ఇది 90వ సినిమా. ఇందులో మరో విశేషం ఉంది. ఆరుగురు ఎంపిలు పనిచేసిన ఒకే ఒక్క తెలుగు సినిమా ఇది. వాళ్ళు కృష్ణంరాజు, జయప్రద, దాసరి, సినారె, మోహన్ బాబు, సుమలత. సాలూరి రాజేశ్వర్ రావు గారు అందించిన సంగీతం కూడా చిరస్థాయిగా నిలిచిపోయింది. ముఖ్యంగా అభినందన మందారమల అనే పాట అప్పట్లో చార్ట్ బస్టర్. ఈ లాక్ డౌన్ టైంలో తాండ్ర పాపారాయుడుని మంచి ఛాయస్ గా పెట్టుకుంటే వినోదంతో పాటు చరిత్రను కూడా తెలుసుకోవచ్చు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp