హంతకుడే హీరో అయితే - Nostalgia

By iDream Post Apr. 16, 2021, 08:30 pm IST
హంతకుడే హీరో అయితే - Nostalgia

సాధారణంగా మన తెలుగు సినిమాల్లో హీరో చాలా మంచివాడు. ఏ కొంచెం నెగటివ్ షేడ్ ఉన్నా ప్రేక్షకులు ఒప్పుకోవడం కష్టం. మహేష్ బాబు 'అతడు' గుర్తుందిగా. కాంట్రాక్ట్ తీసుకుని మార్దర్లు చేసే పార్ధు ఓ ఫ్యామిలీలోకి వెళ్ళిపోయాక మంచివాడిగా మారిపోతాడు. అందరికీ సహాయాలు చేస్తాడు. అలా అని ఫస్ట్ హాఫ్ లో అమాయకులను చంపినట్టు చూపించరు. ఎందుకంటే అది ఆడియన్స్ మనస్సులో నెగటివ్ గా వెళ్తుంది కాబట్టి. హత్యలు చేయడంలో కూడా పరిమితులు ఉంటాయి, మంచి చెడ్డా చూసుకోవాలి తప్పదు. ఈ తరహా క్యారెక్టరైజేషన్ కొత్తగా అనిపిస్తుంది కానీ నిజానికి ఈ టైపు విభిన్న ప్రయత్నం నాగార్జున ఎప్పుడో 1991లో చేశారు. అదే కిల్లర్.

సుప్రసిద్ధ నిర్మాణ సంస్థ జగపతి ఆర్ట్స్ అధినేత విబి రాజేంద్రప్రసాద్(జగపతిబాబు తండ్రి)గారికి ఏఎన్ఆర్ తో 'దసరాబుల్లోడు' లాంటి ఎన్నో ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ తీసిన గొప్ప ట్రాక్ రికార్డు ఉంది. అక్కినేని వారసుడితోనూ అలాంటిది సాధించాలని 1986లో 'కెప్టెన్ నాగార్జున్' తీస్తే అది కాస్తా డిజాస్టర్ అయ్యింది. అప్పటికి నాగ్ ఇంకా స్టార్ కాలేదు. శివ తర్వాత స్టార్ డం వచ్చాక మరోసారి ఇద్దరూ కలుసుకున్నప్పుడు రెగ్యులర్ కమర్షియల్ సబ్జెక్టు కాకుండా ఏదైనా డిఫరెంట్ గా చేయాలని డిసైడ్ అయ్యారు. మలయాళంలో టాప్ డైరెక్టర్ గా వెలుగుతున్న ఫాజిల్ చెప్పిన 'కిల్లర్' కథ విపరీతంగా నచ్చేసింది. జంధ్యాల సంభాషణలు, ఇళయరాజా సంగీతంతో టీమ్ ని రెడీ చేశారు. అప్పటికే పెద్దింటల్లుడుతో మెప్పించిన నగ్మాని హీరోయిన్ గా తీసుకున్నారు.

చిన్నప్పుడే తల్లితండ్రులను కోల్పోయి అనాథగా పెరిగిన ఈశ్వర్ పెద్దయ్యాక కిరాయికి హత్యలు చేసే కిల్లర్ గా మారతాడు. ఆ క్రమంలోనే నగరంలో పేరు మోసిన మాళవికదేవి(శారద) స్నేహ(బేబీ షామిలి)ని చంపే కాంట్రాక్టు వస్తుంది. ఈజీ అనుకుని ఒప్పుకున్న ఈశ్వర్ కు దిగాక అదెంత కష్టమో తెలుస్తుంది. ఇద్దరి మీద అభిమానం పెరుగుతుంది. క్లైమాక్స్ కు ముందు తను వాళ్ళ బంధువే అని తెలుస్తుంది. 1992 జనవరి 10న 'కిల్లర్' రిలీజయింది. అదే రోజు వచ్చిన వెంకటేష్ 'చంటి' ప్రభంజనం ముందు కిల్లర్ నిలవలేకపోయింది. అందులోనూ ఫస్ట్ హాఫ్ టైట్ స్క్రీన్ ప్లేతో నడిచిన కిల్లర్ సెకండ్ హాఫ్ లో బాగా నెమ్మదించడం, సెంటిమెంట్ డ్రామా మరీ ఎక్కువైపోవడం ప్రభావం చూపించడంతో యావరేజ్ గా నిలిచింది. కానీ ఇళయరాజా పాటలు అద్భుతం. ఇప్పటికీ ప్రియా ప్రియతమా రాగాలు ఇష్టపడని మ్యూజిక్ లవర్ ఉండడు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp