పసందైన వినోదాల విందు - Nostalgia

By iDream Post Aug. 27, 2020, 07:16 pm IST
పసందైన వినోదాల విందు - Nostalgia

ఇప్పుడంటే ఓ మూసలోపడిపోయి కామెడీ సినిమాలంటూ ప్రత్యేకంగా రావడం లేదు కానీ ఒకప్పుడు జంధ్యాల, రేలంగి నరసింహారావు లాంటి దర్శకులు తెలుగు తెరపై హాస్య చిత్రాలతో చెరిగిపోని ముద్రవేశారు. స్టార్లతో అవసరం లేకుండా కేవలం కంటెంట్ ని నమ్ముకుని కుటుంబం మొత్తం థియేటర్ కు వచ్చి మనసారా నవ్వుకునేలా చేయడం వీళ్ళకే చెల్లింది. అందులోనూ హాస్యబ్రహ్మ జంధ్యాల గారి పేరు పోస్టర్లో కనపడితే చాలు ఇంకేమి ఆలోచించకుండా టికెట్ కొనే ప్రేక్షకులు ఉండేవారు. ఆయన తీసిన ఆణిముత్యాల్లో ఒకటి 'జయమ్ము నిశ్చయమ్మురా'. రాజేంద్రప్రసాద్, చంద్రమోహన్, సుమలత కాంబినేషన్ లో వండి వార్చిన ఈ నవ్వుల జల్లు అప్పట్లో 15 కేంద్రాల్లో యాభై రోజులు పూర్తి చేసుకుందంటే ఆశ్చర్యం కలగకమానదు.

కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇద్దరు బ్రహ్మచారి కుర్రాళ్ళు ప్రేమ పెళ్లిళ్లు చేసే పనినే వృత్తిగా మార్చుకుంటారు. ఆ క్రమంలో వీళ్లిద్దరికీ విడివిడిగా లవ్ స్టోరీస్ ఉంటాయి. అయితే రాంబాబు(రాజేంద్రప్రసాద్) తన ప్రేమను గెలిపించుకోవడం కోసం ఆమె ఊళ్ళో తిష్ట వేసి నానా అగచాట్లు పడాల్సి వస్తుంది. ఆ తర్వాత రెండు జంటల ప్రయాణం ఏ మలుపులు తీసుకుంది ఎక్కడ ముగిసింది అనేది సినిమాలో చూడాల్సిందే. ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తున్న బాబు చిట్టి మేమ్స్ ఈ సినిమాలోనివే. శ్రీలక్ష్మి తనతో మాట్లాడిన వాళ్లనల్లా చిట్టి అని పిలవడం, భర్తగా నటించిన బ్రహ్మానందం గోడకు తల ఆన్చి విషాద సంగీతం వాయించడం అప్పట్లో ఓ రేంజ్ లో పేలింది. కోట శ్రీనివాసరావు తెలంగాణ యాసలో కనిపించిన వారందరికీ సినిమా కథలు చెప్పడం ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది.

దీనికి సంగీతం రాజ్ కోటి. జంధ్యాల గారితో మొదటి కాంబినేషన్. ఏఆర్ రెహమాన్ కీ బోర్డు ప్లేయర్ గా ఈ చిత్రానికి పనిచేయడం విశేషం. అప్పటిదాకా టీవీ నటులుగా ఉన్న ధర్మవరపు సుబ్రహ్మణ్యం, అశోక్ కుమార్ లకు దీంతో నే జంధ్యాల గారు గట్టి బ్రేక్ ఇచ్చారు. అగ్రహీరోల సినిమాలకు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ గా ఉన్న జ్యోతి ప్రసాద్ కు నిర్మాతగా ఇదే మొదటి సినిమా. ఊహించిన దానికన్నా జయమ్ము నిశ్చయమ్మురా పెద్ద హిట్టు కొట్టింది. తమిళంలో పాంఢ్యరాజన్ హీరోగా కిలాడి మాప్పిళ్ళై పేరుతో రీమేక్ చేస్తే అక్కడా బాగా ఆడింది. ప్రేమించిన పాపానికి వాళ్ళ ఇంట్లో కష్టాలన్నీ తీర్చాల్సి వచ్చిన ప్రియుడి పాత్ర చంద్రమోహన్ కు చాలా పేరు తెచ్చింది. ఇలా చక్కని హాస్యంతో చక్కిలిగింతలు పెట్టిన జయమ్ము నిశ్చయమ్మురా ఇప్పుడు చూసినా మీ పెదవులు నవ్వి నవ్వి అలిసిపోవడం ఖాయం

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp