నిధుల వేటలో ఫ్యామిలీ డ్రామా - Nostalgia

By iDream Post Feb. 23, 2021, 08:30 pm IST
నిధుల వేటలో ఫ్యామిలీ డ్రామా - Nostalgia

తెలుగు సినిమా ప్రస్థానంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ల శకం తర్వాత ఆ స్థాయిలో ప్రభావం చూపించిన స్టార్లలో చిరంజీవిది ఇప్పటికీ ప్రత్యేక స్థానం. ఆరుపదుల వయసులోనూ అభిమానులు మెచ్చేలా నృత్యాలు పోరాటాలు చేయడం ఆయనకే చెల్లింది. అయితే ఇది ఏదో ఒక్క సినిమాతోనే ఒక్క సంవత్సరంలోనో జరిగిపోలేదు. దీని వెనుక పునాదిరాళ్ళుగా చెప్పుకునే ఎన్నెన్నో హిట్లు, ఫ్లాపులు, బ్లాక్ బస్టర్లు ఉన్నాయి. వాటిని మెట్లుగా మార్చుకునే చిరు ఈ స్థాయికి చేరుకున్నారు. హీరో అనే పదానికి సరైన నిర్వచనంలా ప్రేక్షకులు ఫీలవుతున్న తరుణంలో అదే టైటిల్ గా పెట్టుకుని ఓ సినిమా వచ్చిందంటే ఆశ్చర్యం కలుగుతుంది కదూ. కానీ నిజం. అదేంటో చూద్దాం.

1984వ సంవత్సరం. అప్పటికే 'ఖైదీ' లాంటి ఇండస్ట్రీ హిట్ దక్కాక చిరంజీవికి ఫ్యాన్స్ విపరీతంగా పెరిగిపోయారు. వేగానికి నిర్వచనంలా ఉన్న ఇతన్ని చూసి యువత వెర్రెక్కిపోయారు. దర్శక నిర్మాతలు ప్రత్యేకంగా చిరు కోసమే కథలు వండటం మొదలుపెట్టారు. ఖైదీ ప్రభావం వల్లే మంచి సినిమా అయిన బాపు గారి 'మంత్రి గారి వియ్యంకుడు' జస్ట్ యావరేజ్ గా మిగిలింది. సురేష్ సంస్థలో మెగాస్టార్ చేసిన ఒకే ఒక్క సినిమా 'సంఘర్షణ', కామెడీ ఎంటర్ టైనర్ 'అల్లుల్లోస్తున్నారు' మంచి సక్సెస్ లు అందుకున్నాయి కానీ మరీ ఖైదీ స్థాయి అయితే కాదు. తర్వాత వచ్చిన 'గూండా' మళ్ళీ చిరంజీవిలోని అసలైన మాస్ యాంగిల్ బయటికి తీసి బ్లాక్ బస్టర్ అందుకుంది.

ఆ సమయంలో వచ్చిందే హీరో. పలు హాలీవుడ్ సినిమాలను స్ఫూర్తిగా తీసుకుని దర్శకుడు విజయబాపినీడు అల్లు అరవింద్ నిర్మాతగా ఒక విభిన్న ప్రయత్నంగా దీన్ని తీర్చిద్దిదారు. తను ఎప్పుడూ నమ్ముకునే ఫ్యామిలీ డ్రామాకు నిధి వేట అనే క్రైమ్ ఎలిమెంట్ జోడించి కొత్తగా ట్రై చేశారు. రాధికా హీరోయిన్ గా రూపొందిన హీరోకు కృష్ణ-చక్ర సంగీతం అందించగా కాశి విశ్వనాథ్ మాటలు సమకూర్చారు. స్టైలిష్ గా ఉన్నప్పటికీ 1984 మార్చి 23న విడుదలైన హీరో మరీ గొప్ప విజయం అందుకోలేకపోయింది. కమర్షియల్ గా సేఫ్ అయ్యింది. బావమరుదులైన అల్లు అరవింద్, చిరంజీవి ఇందులో అన్నదమ్ములుగా కనిపిస్తారు. రావు గోపాల్ రావు, అల్లు రామలింగయ్య, రంగనాథ్, సంగీత, ఉదయ్ కుమార్ తదితరులు ఇతర తారాగణం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp