నన్ను వెంటాడిన 'గుప్త' రహస్యం - Nostalgia

By Ravindra Siraj Nov. 18, 2020, 10:17 pm IST
నన్ను వెంటాడిన 'గుప్త' రహస్యం - Nostalgia

1997

ఆదోనిలో ద్వారకా థియేటర్. ఆనోటా ఈనోటా ఓ హిందీ సినిమా గురించి విని అర్జంట్ గా చూసేయాలన్న ఆత్రంతో ఏదోలా డబ్బులు సర్దుకుని సాయంత్రం ఫస్ట్ షోకి అరగంట ముందే చేరుకున్నా. చూద్దును కదా అప్పటికే జనం చెమటలు కక్కుకుంటూ కౌంటర్ దగ్గర కొట్టుకోవడం ఒకటే తక్కువ అనే రేంజ్ లో బుకింగ్ క్లర్క్ కోసం ఎదురు చూస్తున్నారు. అప్పటికి మనది పదహారేళ్ళ ప్రాయం కాబట్టి రోజూ ఇంట్లో అన్నం పెడుతున్నారో లేదో అన్నంత బక్కపలచని దేహంతో ఉండటం వల్ల అలా సింపతీ మీద ఆ గుంపులో దూరిపోయా. పది నిమిషాల తర్వాత ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్ బయట లైట్ లాగా బల్బుతో పాటు మా కళ్ళలో కూడా మెరుపులు వచ్చాయి.

పది నిమిషాలు ఏం జరిగిందో అర్థం కాలేదు. ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా అనిపించింది. సినిమా చూడటం జీవితంలో అంత ముఖ్యమైన ఘట్టామా అనే ఫీలింగ్ కలిగినా అది పెనం మీద నీటి బొట్టే. కుస్తీలో ఎలాగోలా నలిగి టికెట్ తో బయటపడ్డా. కరెంట్ కొట్టినంత షాక్. అంతకు కొద్దిరోజుల ముందే అమెరికా నుంచి వచ్చిన అక్కయ్య ఇచ్చిన వాచీ చేతికి లేదు. పోయింది. దాని విలువ ఎంతో కూడా తెలియని వయసు. కాసేపు కళ్ళలో నీళ్లు తిరిగినా అప్పటికే ఎన్నో దూరదర్శన్ ప్రోగ్రాములు చూసి తట్టుకున్న గుండె కావడంతో కాసేపటికే కొలుకున్నాను.

అప్పటికి డిటీఎస్ సౌండ్ టెక్నాలజీ వచ్చి ఏడాదే అయ్యింది. ఆ సౌండ్ సిస్టమ్ లో బోర్డర్ ఒకటే చూసింది. మాస్టర్ కూడా వేశారు కానీ అంతగా అనలేదు. ఇది మూడోది. ఆట మొదలైంది. మంగలి షాపులో కింద పారేసిన జుత్తుని టైలర్ దగ్గర కుట్టించుకుని విగ్గు పెట్టుకున్నట్టుగా ఉన్న ఆ బాబీ డియోల్ హీరో ఎలా అయ్యాడో అర్థం కాలేదు. కానీ మన టార్గెట్ ఆడు కాదుగా. కాజోల్, మనీషా కొయిరాలా గురించి అప్పటికే క్లాసులో ఒకటే గుసగుసలు. సో హీరో నచ్చకపోయినా క్షమించి చూడటం మొదలుపెట్టా.

అప్పటికి హిందీ మీద నాకు ఏమంత పట్టు లేదు. కాని దాదాపుగా అర్థమయ్యేది. ఎవరిని అడగకుండానే గుప్త్ అంటే రహస్యం అని తెలుసు కాబట్టి ఈ మాత్రం పాండిత్యానికే పెద్ద పండిత్ అన్న ఫీలింగ్. ఓపెనింగ్ షాట్ లొనే మనీలో చూసిన పరేశ్ రావల్, సడక్ లో భయపెట్టిన సదాశివ్ అమ్రపూర్కర్, ఖిలాడిలో టెన్షన్ పెట్టిన ప్రేమ్ చోప్రా, హిందీ సినిమాల్లో బాగా కనిపించే రజా మురాద్, ముఠామేస్త్రి విలన్ శరత్ సక్సేనాల దర్శనం. ఆ తర్వాత రాజ్ బబ్బర్.ఇంట్రో సాంగ్ తో బాబీ తర్వాత కాజల్, మనీషా అందరూ వచ్చేసారు. విజు షా పాటలకు థియేటర్ హోరెత్తిపోతోంది. ఈలలు గోల స్టార్ హీరో సినిమాకు ఏ మాత్రం తీసిపోని రేంజ్ లో. హత్యలు జరగడం మొదలైంది. హంతకుడు ఎవరు అనే ఆలోచనకు బుర్ర బద్దలైపోతోంది. ఈ మాత్రం ఆలోచన నా ఇంటర్ పరీక్షలప్పుడు చేసుంటే ఇప్పుడీ టైపింగ్ బదులు ఏ కలెక్టర్ గానో సీఎంతో వీడియో చాటింగ్ లో ఉండేవాడిని. సరే మన గ్రహాలు అలా ఉన్నప్పుడు ఎవరిని అని లాభం లేదు.

దర్శకుడు రాజీవ్ రాయ్ కట్టిపడేసాడు. హీరో మీదకు నేరాన్ని తోసేసి జైలుకు పంపడం మొదలు ఒక్కొక్కరి మీద అనుమానం వచ్చేలా చేసి ఆ తర్వాతి సీన్లో వాళ్ళను చంపేయడం మధ్యలో అదిరిపోయే డిటీఎస్ లో మతిపోగొడుతున్న పాటలు పూర్తి పైసా వసూల్ అయిపోయిన ఫీలింగ్. ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ఒకరిని మించి ఒకరు కాజోల్, మనీషా పోటీ పడి పెర్ఫార్మ్ చేస్తుంటే మొన్న సంజులో చూసిన ముసలి మనీషా తనేనా అన్న అనుమానం కలిగింది. ఇక ఇన్స్ పెక్టర్ ఉద్దం సింగ్ గా ఓంపూరి కౌంటర్లకు హాల్ దద్దరిల్లిపోతోంది. ఆయన పంచులు నాకు పూర్తిగా అర్థం కాకపోయినా ఎంజాయ్ మాత్రం చేయగలిగాను. క్లైమాక్స్ ముందు విలన్ ఎవరో తెలిసేసరికి మైండ్ బ్లాంక్ అయిపోయింది.

వంశీ గారి అన్వేషణ తర్వాత అంత షాక్ అనిపించిన సినిమా ఇదే. గుప్త్ ఎంతగా ఎక్కేసిందంటే అదే థియేటర్లో మరో రెండు సార్లు చూసే దాకా వదిలిపెట్టలేదు. సినిమా చూసిన మరుసటి రోజే టిప్స్ కంపెనీ ఒరిజినల్ ఆడియో క్యాసెట్ 45 రూపాయలన్నా లెక్క చేయలేదు. భరించేది నాన్న అయితే నొప్పి నాకెలా ఉంటుంది. బాలీవుడ్ థ్రిల్లర్స్ లో ఓ కొత్త ఒరవడికి గుప్త్ శ్రీకారం చుట్టిందన్నది నిజం. దాని తర్వాతే స్టార్ హీరోలు ఇలాంటి వాటిలో ఎక్కువగా నటించడం, మ్యూజిక్ కు పెద్ద పీట వేయటం జరిగాయని నా పర్సనల్ ఫీలింగ్.

సరదాగా చాలా రోజులైందని మొన్నోసారి గుప్త్ సినిమాని లాప్ టాప్ లో ప్లే చేసుకుని చూస్తుంటే ఈ జ్ఞాపకాలన్నీ రాసేందుకు ప్రేరేపించాయి. తరువాత బాబీ డియోల్ ఏ సినిమా నాకు నచ్చలేదు. త్రిమూర్తి బ్యానర్ పై అంతకు ముందే త్రిదేవ్, మొహ్రా, విశ్వాత్మ లాంటి భారీ బడ్జెట్ మల్టీస్టారర్లు తీసిన రాజీవ్ రాయ్ గుప్త్ స్థాయి విజయాన్ని మళ్ళీ అందుకోలేకపోయారు. ఏవో కారణాల వల్ల ఓ రెండు ఫ్లాపులు తీసి పరిశ్రమకు దూరమైపోయారు. క్లాసిక్స్ అంతే మళ్లీ తీయడం సాధ్యం కాదు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp