మెడికల్ మాఫియాపై 'గణేష్' పంజా - Nostalgia

By iDream Post Aug. 23, 2020, 08:26 pm IST
మెడికల్ మాఫియాపై 'గణేష్' పంజా - Nostalgia

సామజిక సమస్యల మీద సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. అందులోనూ స్టార్ హీరోలవి ఊహించడం కూడా కష్టమే. కొన్నిసార్లు ఇలాంటి ప్రయత్నాలు నిరాశ పరిస్తే కొన్ని కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. అలాంటి వాటిలో ముందు వరసలో ఉంచాల్సిన మూవీ గణేష్. 1998లో విక్టరీ వెంకటేష్ కు నంది అవార్డు తెచ్చిన ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో సురేష్ బాబు నిర్మించడం విశేషం. 'ప్రేమ'తో ఇదే బ్యానర్ లో పరిచయమైన దర్శకుడు సురేష్ కృష్ణ అసిస్టెంట్ తిరుపతిస్వామి దీంతో డెబ్యు చేయడం కాకతాళీయం. ఓ జర్నలిస్ట్ సొసైటీలో పేరుకుపోయిన మెడికల్ మాఫియా అంతు చూడడానికి కంకణం కట్టుకోవడం, సదరు దందాను నడిపిస్తున్న మంత్రికి ఎదురేగి తన కుటుంబాన్ని బలి చేసుకోవడం లాంటి ఆసక్తికరమైన అంశాలతో గణేష్ రూపొందింది.

మంచి ఫాంలో ఉన్న రంభను హీరొయిన్ గా తీసుకోగా చాలా కీలకమైన పాత్ర అల్లరి ప్రియుడు, రోజా ఫేం మధుబాల పోషించారు. శత్రువు తర్వాత ఆ స్థాయిలో కోట శ్రినివాసరావు విలనీ పండించిన సినిమా ఇదే. ఫ్లాష్ బ్యాక్ లో గుండెలు పిండేసేలా చిత్రీకరించిన తిరుపతి స్వామి అందులో ప్రభుత్వ ఆసుపత్రుల దుస్థితిని కళ్ళకు కట్టినట్టు చూపించాడు. సరిగ్గా దీనికి పదేళ్ళ క్రితం వెంకటేష్ ప్రేమలో హీరొయిన్ గా చేసిన రేవతి ఇందులో చాలా చిన్న పాత్ర చేయడం గమనార్హం. మణిశర్మ పాటలు చార్ట్ బస్టర్స్ కాగా నేపధ్య సంగీతంతో డిటిఎస్ సౌండ్ సిస్టం థియేటర్లు మోతమ్రోగాయి. భారతీయుడు, జెంటిల్ మెన్ తరహా సినిమాలు తెలుగులో రావడం లేదని బాధ పడుతున్న మూవీ లవర్స్ కొరతను తీరుస్తూ గణేష్ అన్నిరకాలుగానూ ఘన విజయం సాధించింది.

ముఖ్యంగా క్లైమాక్స్ లో వెంకీ నటన, పరుచూరి బ్రదర్స్ సంభాషణలు ఆడియన్స్ చేత చప్పట్లు కొట్టించుకోవడమే కాదు ఆలోచింపజేశాయి కూడా. బెస్ట్ యాక్టర్ గా వెంకటేష్ తో పాటు ఉత్తమ విలన్ గా కోట, బెస్ట్ డైలాగ్స్ గా పరుచూరి సోదరులు, రూపశిల్పి విభాగంలో రాఘవతో పాటు ఉత్తమ తృతీయ చిత్రంగా గణేష్ నంది పురస్కారాల్లో సింహభాగం దక్కించుకుంది. ఆ టైంలో తాను కెరీర్లోనే చేసిన మంచి సినిమాగా గణేష్ ని చెప్పుకున్నారు వెంకటేష్. దీని తర్వాత తిరుపతి స్వామి నాగార్జునతో అజాద్, విజయ్ కాంత్ తో తమిళంలో నరసింహ (తెలుగులో టైటిల్ సెల్యూట్) చేశాక యాక్సిడెంట్ లో కన్నుమూయడం దురదృష్టకరం. అన్ని కూడా సామాజిక స్పృహతో రూపొందినవి కావడం గమనించాల్సిన విషయం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp