గోల్డ్ మ్యాన్ సృష్టించిన సంచలనం - Nostalgia

By iDream Post Mar. 29, 2021, 08:33 pm IST
గోల్డ్ మ్యాన్ సృష్టించిన సంచలనం - Nostalgia

సినిమా పరిణామక్రమం ఎన్ని రకాలుగా మార్పు చెందినా ఇప్పటికీ మహారాజ పోషకులు మాస్ ప్రేక్షకులే. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా, అభిరుచుల్లో ఎంత మార్పు వచ్చినా వీళ్ళను సంతృప్తి పరిస్తే వచ్చే ఆదరణే వేరు. ఇది చరిత్రలో పలుమార్లు ఋజువవుతూనే ఉంది. అందులోనూ దీనికి మొదటి మార్గదర్శిగా నిలిచిన హీరోగా స్వర్గీయ నందమూరి తారకరామారావు గురించే చెప్పుకోవచ్చు. 1977 సంవత్సరం. అప్పటిదాకా అన్ని రకాల పాత్రలు చేస్తున్న ఎన్టీఆర్ క్రమంగా మాస్ బాటను వదిలి విభిన్నమైన పాత్రలతో పాటు పౌరాణికాలు కూడా చేస్తున్నారు. దానవీరశూరకర్ణ అందులో భాగంగా వచ్చి ఎంత చరిత్ర సృష్టించిందో చూశాం.

అదే సంవత్సరం దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేసిన మాయాజాలం అడవి రాముడు రూపంలో కనివిని ఎరుగని రికార్డులు సృష్టించింది. అది మొదలు మళ్ళీ ఎన్టీఆర్ లోని మాస్ విశ్వరూపం బయటికి వచ్చింది. యుగపురుషుడు, డ్రైవర్ రాముడు, వేటగాడు, యుగంధర్, సర్దార్ పాపారాయుడు లాంటి బ్లాక్ బస్టర్స్ ఆయన్నుంచి అభిమానులు ఏం కోరుకుంటున్నాయో స్పష్టంగా చూపించాయి. అప్పటికే అన్నగారితో కేడి నెంబర్ వన్ తప్ప మిగిలినవన్నీ సూపర్ హిట్లు అందుకున్న రాఘవేంద్రరావు మరోసారి ఆయనతో జట్టుకట్టి చేసిన కమర్షియల్ ఫీస్ట్ గజదొంగ. విజయదుర్గా ఆర్ట్స్ పతాకంపై భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా ఇది.

రచయితగా మెల్లగా పేరు తెచ్చుకుంటున్న సత్యానంద్ కు ఈ రూపంలో బంగారం లాంటి అవకాశం తలుపు తట్టింది. దానికి తగ్గట్టే ఆయన ఉపయోగించుకున్నారు. ఎన్టీఆర్ ని డ్యూయల్ రోల్ లో చూపిస్తూ స్మగ్లర్ గోల్డ్ మ్యాన్ గా ఒకటి, రాజాగా రెండో పాత్రను డిజైన్ చేసిన విధానం ప్రేక్షకులకు బాగా నచ్చింది. చక్రవర్తి స్వరపరిచిన సంగీతం చార్ట్ బస్టర్ అయ్యింది. ముఖ్యంగా నీ ఇల్లు బంగారం కాను పాట ఇప్పటికీ హాట్ ఫేవరెట్. హీరోయిన్లు జయసుధ, శ్రీదేవి గ్లామర్, భారీ నిర్మాణ విలువలు బాగా ఆకట్టుకున్నాయి. 1981 జనవరి 30న విడుదలైన గజదొంగ ఆశించిన విజయాన్ని అందుకుంది. అయితే కేవలం ఇరవై రోజుల గ్యాప్ తో రిలీజైన ప్రేమాభిషేకం ప్రభావం దీని మీద పడటంతో వసూళ్ల లెక్కల్లో రెండో స్థానంలో నిలవాల్సి వచ్చింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp