ప్రేక్షకుల 'ప్రేమ'లో 'ఖైదీ' - Nostalgia

By iDream Post May. 16, 2020, 09:35 pm IST
ప్రేక్షకుల 'ప్రేమ'లో 'ఖైదీ'  - Nostalgia

సాధారణంగా డెబ్యూతో ఫ్లాప్ అందుకున్న దర్శకుడికి రెండో అవకాశం అంత సులభంగా దొరకదు. కానీ టాలెంట్ ని గుర్తించే రామానాయుడు లాంటి నిర్మాత ఉంటే మాత్రం అది సాధ్యమే. కామెడీ సినిమాలతో ఎనలేని గుర్తింపు తెచ్చుకున్న స్టార్ డైరెక్టర్ ఈవివి సత్యనారాయణ మొదటి సినిమా రాజేంద్రప్రసాద్ చెవిలో పువ్వు. సీత హీరోయిన్ గా నటించిన ఆ చిత్రం అంచనాలు అందుకోలేక ఫ్లాపయ్యింది. అతి తక్కువ గ్యాప్ లోనే నాయుడు గారు అప్పటికే తన సంస్థలో అసోసియేట్ చేసిన అనుభవమున్న ఈవివిని నమ్మి ప్రేమ ఖైదీని అప్పగించారు.

అప్పుడప్పుడే మీసాలు మొలుస్తూ యూత్ లోకి ఎంటరైన హరీష్ హీరో. కన్నడలో గుర్తింపు ఉన్నా తెలుగులో చేసింది రెండు మూడు సినిమాలే కాబట్టి హీరొయిన్ మాలాశ్రీ అంటే ఇక్కడ పెద్దగా ఎవరికి తెలియాదు. ఇళయరాజా, రాజ్ కోటి ప్రభంజనం ఉధృతంగా సాగుతున్న టైంలో అప్పటికే అవకాశాలు తగ్గిపోయిన దిగ్గజాలు రాజన్ - నాగేంద్రల సంగీత దర్శకత్వం. ఇవన్నీ ఈవివి ప్రతికూలతలు అనుకోలేదు. ఛాలెంజ్ గా తీసుకున్నారు. రామానాయుడు గారి నమ్మకాన్ని నిలబెట్టుకుని మొదటి పరాజయం ఇచ్చిన షాక్ నుంచి త్వరగా కోలుకోవాలని నిర్ణయించుకున్నారు. అలా ప్రేమఖైదీని ఒక యజ్ఞంగా తీర్చిదిద్దారు. చాలా కీలకమైన పాత్రలో శారద, సపోర్టింగ్ రోల్స్ లో గిరిబాబు, బాబు మోహన్, గోకిన రామారావు లాంటి సీనియర్లను తీసుకుని పొగరున్న కోటీశ్వరుడి కూతురికి, పైసా ఆస్తి లేని వెనుకబడిన ఓ చదువుకున్న కుర్రాడికి మధ్య చూపించిన ప్రేమకు ప్రేక్షకులు ఖైదీలుగా మారిపోయారు.

సగటు లవ్ స్టోరీస్ కి భిన్నంగా పరుచూరి బ్రదర్స్ ఇచ్చిన ట్రీట్ మెంట్ అద్భుతంగా పండింది. జనం విరగబడి చూశారు. పాటలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. నాయుడు గారు హాఫ్ సెంచరీ అయితే చాలనుకుంటే ప్రేమ ఖైదీ ఏకంగా వంద రోజులు ఆడింది. దెబ్బకు ఈవివి గారి సత్తా ఇండస్ట్రీకి తెలిసి వచ్చింది. దీని వల్లే హరీష్ చాలా బిజీ ఆర్టిస్ట్ అయ్యాడు. ఇప్పటికీ ఈ సినిమాలో పాటలు గొప్పగా అనిపిస్తాయి. తర్వాత ఇదే సినిమా హిందీలో ప్రేమ్ ఖైదీగా రామానాయుడు గారే కె మురళీమోహన్ రావు గారి డైరెక్షన్ లో రీమేక్ చేశారు. హరీష్, కరీనా కపూర్ జంట. అక్కడా హిట్ అయ్యింది. ఇలా ప్రతిభను నమ్మిన నిర్మాత ఎంత గొప్ప ఫలితాలు అందుకుంటారో చెప్పేందుకు ప్రేమ ఖైదీ మంచి ఉదాహరణగా నిలిచిపోయింది

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp