డబుల్ ఫోటోల 'జీన్స్' మేజిక్ - Nostalgia

By iDream Post Sep. 15, 2020, 09:28 pm IST
డబుల్ ఫోటోల 'జీన్స్'  మేజిక్ - Nostalgia

సాధారణంగా హీరో లేదా హీరోయిన్ ఎవరో ఒకరు డ్యూయల్ రోల్ చేయడం చూశాం కానీ హీరో తండ్రి కూడా ద్విపాత్రాభినయం చేయడం మాత్రం అరుదు. అలాంటి ఒక అరుదైన ప్రయోగం జీన్స్. 1998లో శంకర్ దర్శకత్వంలో ప్రశాంత్ హీరోగా రూపొందిన ఈ సినిమా మ్యూజికల్ బ్లాక్ బస్టర్. ఏఆర్ రెహమాన్ సంగీతం యువతరాన్ని మాత్రమే కాదు ప్రతి ఇంటిని పాటలతో హోరెత్తించింది. నాజర్ ఇందులో రెండు పాత్రల్లో కనిపించడమే అసలు విశేషం. ఇద్దరు కవల పిలల్ల ధనవంతుడైన తండ్రిగా, పెళ్ళాం చెప్పుచేతల్లో మసలే ఓ మాములు పల్లెటూరు అమాయక బైతుగా రెండు షేడ్స్ ని అద్భుతంగా పోషించారు.

ఐశ్వర్య రాయ్ కి సౌత్ లో విపరీతమైన గుర్తింపు తెచ్చిన చిత్రం ఇదే. ఒకే అమ్మాయిని ఒకే పోలికలు ఉన్న ఇద్దరు హీరోలు ప్రేమిస్తే అనే పాయింట్ చుట్టూ శంకర్ అల్లుకున్న కామెడీ డ్రామా తెరమీద అద్భుతంగా పండింది. కథలో ముప్పాతిక భాగం దాకా ప్రశాంత్ లు ఇద్దరినీ నమ్మించేందుకు లక్ష్మి, హీరోయిన్ తమ్ముడు రాజు సుందరం పడే పాట్లు మాములుగా ఉండవు. దానికి తోడు నాజర్ క్యారెక్టర్స్ మధ్య కూర్చిన ఎమోషన్, తన సీనియారిటీని రంగరించి రాధికా చూపించిన నటన జీన్స్ ని ఫ్యామిలీ ప్రేక్షకులకు బాగా దగ్గర చేశాయి. అప్పటిదాకా ఇది ఇండియాల్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందించిన మూవీగా చెప్పుకునేవారు. ఎవరికీ సాధ్యం కానీ విధంగా సెవెన్ వండర్స్ దగ్గర పాటను షూట్ చేయడం ద్వారా శంకర్ రేపిన సంచలనం అంతా ఇంతా కాదు.

దీనికి సంబంధించి కొన్ని విశేషాలు ఉన్నాయి. జీన్స్ షూటింగ్ ఏడాదిన్నర సాగింది. ముందు అనుకున్న హీరో ప్రేమదేశం అబ్బాస్. కానీ తను అప్పటికే నిండా బిజీగా ఉన్నాడు. తర్వాత అజిత్ ను అడిగారు. కాల్ షీట్స్ సమస్య వల్ల అతనూ నో అన్నాడు. అప్పుడు ప్రశాంత్ దగ్గరకు వెళ్ళింది. గతంలో ప్రేమికుడు సబ్జెక్టు వదులుకుని ఎంత పెద్ద తప్పు చేశానో అని బాధపడుతున్న అతగాడు ఇంకో నిమిషం ఆలస్యం చేయకుండా ఎగిరి గంతేసి ఒప్పుకున్నాడు. అలాగే భారతీయుడు మిస్ అయిన ఐశ్వర్యరాయ్ ఈసారి పొరపాటు చేయలేదు. లాస్ వేగాస్, యునివర్సల్ స్టూడియోస్ తదితర ప్రాంతాల్లో జీన్స్ చిత్రీకరణ జరిగింది.

దీంతోనే ప్రొడక్షన్ లో మొదటిసారి అడుగుపెట్టిన ముగ్గురు తమిళ నిర్మాతలు అశోక్-మైకేల్-మురళి కోట్లాది రూపాయలు మంచి నీళ్లలా ఖర్చు పెట్టారు. ఏప్రిల్ 24న జీన్స్ భారీ ఎత్తున విడుదలయ్యింది. తెలుగులో ఏఏం రత్నం అనువదించారు. కాన్సెప్ట్ పరంగా శంకర్ గత చిత్రాల స్థాయి లో లేకపోయినప్పటికీ జీన్స్ ఓ సరికొత్త అనుభూతినిచ్చిన మాట వాస్తవం. తమిళం కంటే తెలుగులోనే జీన్స్ బ్రహ్మాండంగా ఆడింది. కానీ హిందీలో మాత్రం ఫ్లాప్ అయ్యింది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఏఆర్ రెహమాన్ సంగీతం దీనికి ప్రధాన వెన్నెముక. ఇప్పటికీ హాయ్ రే హాయ్ రబ్బా, కన్నులతో చూసేది, ప్రియాప్రియా చంపొద్దే, పూవుల్లో దాగున్న పాటలు చాలా ఫ్రెష్ గా ఎవర్ గ్రీన్ కంపోజింగ్ గా నిలుస్తాయి. హీరోతో పాటు తండ్రి కూడా డ్యూయల్ రోల్ చేయడం హిందీ ఆంఖే రీమేక్ పోకిరి రాజాలో చూడొచ్చు. అందులో వెంకటేష్, సత్యనారాయణ ఇదే తరహాలో డబుల్ ఫోటోలో కనిపిస్తారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp