క్లాసిక్ టైటిల్ తో మెగాస్టార్ మూవీ - Nostalgia

By iDream Post Apr. 13, 2021, 08:30 pm IST
క్లాసిక్ టైటిల్ తో మెగాస్టార్ మూవీ - Nostalgia

ఇండస్ట్రీలో మాములుగా స్టార్ హీరోలుగా ఒక రేంజ్ కి ఎదిగాక అగ్ర నిర్మాతలకు వాళ్ళ డేట్లు దొరకడమే మహా కష్టంగా ఉంటుంది. అలాంటిది మంచి స్నేహితుడు, రూమ్ మేట్ తనతో సినిమా తీయాలని ముచ్చపడితే అది నెరవేర్చడానికి కథేంటో కూడా అడగకుండా చేయడం అరుదు. అలంటి ఉదాహరణే ఇది. 1984 సంవత్సరం. అప్పటికే చిరంజీవి పేరు పరిశ్రమలో మారుమ్రోగుతోంది. ఖైదీతో వచ్చిన స్టార్ డం మార్కెట్ ని ఎన్నో రెట్లు పెంచేసింది. ఆ తరువాత మంత్రి గారి వియ్యంకుడు పర్వాలేదనిపించుకోగా సంఘర్షణ, అల్లుళ్ళు వస్తున్నారు, హీరో కమర్షియల్ సక్సెస్ అయ్యాయి. గూండా మరోసారి చిరు స్టామినా ఋజువు చేసింది.

అదే సమయంలో నారాయణరావు చిరంజీవితో సినిమా తీయాలనే సంకల్పంతో ఉన్నారు. స్వతహాగా తండ్రి ప్రముఖ పంపిణీదారుడు ప్రసాదరావు నేపథ్యం అండగా ఉన్నప్పటికీ స్వంతంగా ముద్ర వేయాలన్న లక్ష్యంతో కథ కోసం వెతుకుతుండగా ఇప్పటి తమిళ స్టార్ హీరో విజయ్ తండ్రి ఎస్ ఏ చంద్రశేఖర్ గారు కన్నడలో అంబరీష్ హీరోగా రూపొందిస్తున్న 'గెలవు నన్నదే' గురించి తెలిసింది. అప్పటికది షూటింగ్ లో ఉంది. అంతకు ముందే చిరు-చంద్రశేఖర్ కాంబినేషన్ లో చట్టానికి కళ్ళు లేవు, పల్లెటూరి మొనగాడు వచ్చాయి. ప్రతిపాదన వినగానే ఇప్పుడు చేస్తున్నదే తెలుగులోనూ రీమేక్ చేద్దామని చెప్పగా నారాయణరావు ఓకే చెప్పేశారు. ఎన్టీఆర్ సూపర్ హిట్ మూవీ దేవాంతకుడు టైటిల్ నే దీనికి ఫిక్స్ చేశారు.

అలా తోటపల్లి మధు రచనలో స్క్రిప్ట్ రూపకల్పన మొదలయ్యింది. కథ తదితర వివరాలు చిరు నారాయరావుని అడగలేదు. దర్శకుడి పేరు వినగానే ఓకే చెప్పేశారు. తీరా చూస్తే గెలవు నన్నదే అక్కడ ఫ్లాప్ అయ్యింది. కారణాలు విశ్లేషించిన నారాయణరావు టీమ్ తో కలిసి రిపేర్లకు ఉపక్రమించారు. ఒరిజినల్ వెర్షన్లో హీరో పాత్రను డిజైన్ చేయడంలో జరిగిన లోపాలను ఇక్కడ సవరించారు. పందెం గెలవడం కోసం ఎంత రిస్క్ కైనా సిద్ధపడే హీరో ఆ స్వభావం వల్లే ఓ హత్యకేసులో ఇరుక్కుంటాడు. ఇదే కథలో మెయిన్ పాయింట్. విజయశాంతిని హీరోయిన్ తీసుకున్నారు. జెవి రాఘవులు స్వరాలు సమకూర్చారు. 1984 ఏప్రిల్ 12న విడుదలైన దేవాంతకుడు ఆశించినట్టే కమర్షియల్ సక్సెస్ అందుకుంది. జూలైలో హైదరాబాద్ సంధ్య 35 ఎంఎం వేదికగా వంద రోజుల వేడుక నిర్వహించారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp