Devadas : అజరామర ప్రేమకథకు నిదర్శనం - Nostalgia

By iDream Post Jan. 13, 2022, 09:00 pm IST
Devadas : అజరామర ప్రేమకథకు నిదర్శనం - Nostalgia

ప్రేమకు త్యాగానికి ప్రతీకగా నిలిచిన దేవదాసు సినిమా ఎప్పటికీ మర్చిపోలేని ఎవర్ గ్రీన్ క్లాసిక్. లవ్ లో ఫెయిలైనవాళ్లకు మందు అలవాటు చేసిందే దేవదాసని ఇప్పటికీ కామెంట్ చేసేవాళ్ళు లేకపోలేదు. అలాంటి ఈ ఆణిముత్యం వెనుక కొన్ని అరుదైన విశేషాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. 1951లో నిర్మాత డిఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సిద్ధపడ్డారు. చక్రపాణి రాసిన ప్రసిద్ధ నవలను తెలుగీకరించి దాన్ని ఇక్కడి ప్రేక్షకులను రంజింపజేసేలా వెండితెర రూపం ఇవ్వాలనేది ఆయన సంకల్పం. హీరోగా అక్కినేని నాగేశ్వరరావును అనుకున్నప్పుడు ఇండస్ట్రీలో ఎన్నో కామెంట్స్. కానీ అవేవి ఆయన ఖాతరు చేయలేదు. డాన్స్ మాస్టర్ గా పేరొందిన వేదాంతం రాఘవయ్యకు దర్శకత్వ బాధ్యతలు అప్పజెప్పారని తెలిసి విమర్శల బాణాలు గుప్పించినవారు ఉన్నారు. పట్టించుకోలేదు.

ముందు హీరోయిన్ గా అనుకున్న ఛాయస్ భానుమతిగారు. కానీ ఆవిడ దగ్గరే ఈ నిర్మాత నారాయణ ఒకప్పుడు ఉద్యోగిగా పని చేశారు. ఈ కారణమో మరొకటో ఖచ్చితంగా తెలియదు కానీ మొత్తానికి నో చెప్పేశారు. కట్ చేస్తే పార్వతి పాత్ర సావిత్రి దగ్గరకు వెళ్ళింది. బంగారం లాంటి అవకాశం వదులుకుంటే మళ్ళీ రాదు. వెంటనే ఎస్ చెప్పారు. దేవదాస్ నవల తెలుగు అనువాదం తెప్పించుకుని చదవడం మొదలుపెట్టారు. తొలుత తీసుకున్న సంగీత దర్శకుడు సిఆర్ సుబ్బరామన్. రెండు పాటలు బ్యాలన్స్ ఉండగా కాలం చేశారు. ఎంఎస్ విశ్వనాథన్ వచ్చి ఆ బాధ్యతను పూర్తి చేసి జగమే మాయ, అందం చూడవయా పాటలను స్వరపరిచారు. మొత్తం ఆల్బమ్ విన్నాక ఇద్దరు పనిచేశారన్న స్పృహే రానంత గొప్పగా సంగీతం అజరామరంగా నిలిచిపోయింది.

షూటింగ్ మొదలయ్యాక ఎన్నో బ్రేకులు. షాట్స్ సరిగా రాక రీ షూట్లు చేసేవాళ్ళు. కొన్ని సీన్లు అయ్యాక తాగుబోతులో ఉండాల్సిన లక్షణాలు కనిపించడం లేదని గమనించిన ఏఎన్ఆర్ వాటిని మళ్ళీ తీయించేవారు. అలా టీమ్ మొత్తం పెర్ఫెక్షన్ కోసం పాకులాడేది. మొత్తానికి కొంత ఆలస్యంగానే అయినా కోరుకున్న రీతిలో పూర్తి సంతృప్తి చెందాకే గుమ్మడికాయ కొట్టారు. 1953 జూన్ 29 దేవదాసు థియేటర్లలో అడుగుపెట్టింది. జనం నీరాజనం పట్టారు. విషాద ప్రేమకథకు ఇంత స్పందన రావడం చూసి అనుమానపడ్డ వాళ్లే నోరెళ్ళబెట్టారు. తర్వాత 1955లో దిలీప్ కుమార్ తో దేవదాస్ రీమేక్ అయ్యింది. రిజల్ట్ సేమ్. అయితే తనకన్నా గొప్పగా దిలీప్ సాబే ఆ పాత్రలో జీవించాడని తెలుగుకన్నా హిందీ వెర్షనే తనకు ఎంతో ఇష్టమని అక్కినేని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు

Also Read : Saudagar : 60 దాటిన స్టార్లతో బ్లాక్ బస్టర్ క్లాసిక్ - Nostalgia

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp