అంచనాలలో గ్రీకువీరుడి మునక - Nostalgia

By iDream Post Sep. 11, 2020, 08:35 pm IST
అంచనాలలో గ్రీకువీరుడి మునక - Nostalgia

హీరోలకు నట వారసులు ఉండటం సర్వసాధారణం. ఎన్టీఆర్ తో మొదలుకుని చిరంజీవి దాకా అందరూ తమ బిడ్డలను ఓ స్థాయికి తీసుకెళ్లిన వాళ్లే. ఇక్కడ అభిమానుల అందండలతో పాటు స్వంత టాలెంట్లు కూడా వాళ్ళకంటూ ఒక ఇమేజ్ రావడానికి దోహదపడ్డాయి. అయితే దర్శకుల పిల్లలు డైరెక్టర్లు కావడం అరుదు కానీ కొందరు మాత్రం హీరోలు అయ్యేందుకు గట్టి ప్రయత్నాలు చేసిన ఉదంతాలు ఉన్నాయి. అందులో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది దాసరి అరుణ్ కుమార్ గురించి. దర్శకరత్నగా వందకు పైగా సినిమాల్లో ఎన్నో అద్భుతమైన బ్లాక్ బస్టర్లు ఇచ్చిన దాసరి నారాయణరావుగారు 1998లో కొడుకుని కథానాయకుడిగా లాంచ్ చేయాలని డిసైడ్ అయ్యారు.

ప్రేక్షకులకు పరిచయం లేదు కాబట్టి మాస్ కథ కన్నా లవ్ స్టోరీ అయితే బాగుంటుందని ముందు ఓ ప్లాట్ అనుకున్నారు. కానీ దాసరి గారు రాసుకున్న థీమ్ కి అప్పుడే తమిళ్ లో విడుదలైన కాదలిక్కు మరియాదై(తెలుగులో ప్రేమించేది ఎందుకమ్మా)కు దగ్గర పోలికలు కనిపించడంతో స్క్రిప్ట్ మొత్తం క్యాన్సిల్ చేసి కేవలం పదిహేను రోజుల్లో ఫ్రెష్ గా మరొకటి రాసుకున్నారు. నాగార్జున నిన్నే పెళ్లాడతాలో సూపర్ హిట్ సాంగ్ లో మొదటి పదాన్ని తీసుకుని 'గ్రీకువీరుడు' అని టైటిల్ పెట్టారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో గ్రాండ్ ఓపెనింగ్ చేశారు. అతిరధ మహారధులు విచ్చేశారు. ఫుల్ ఫామ్ లో ఉన్న తమిళ మ్యూజిక్ డైరెక్టర్ దేవాను సంగీతం కోసం తీసుకున్నారు. బాలీవుడ్ లో క్రేజ్ సంపాదించుకున్న పూజా బాత్రా హీరోయిన్ గా ఎంపికయ్యింది. తోటపల్లి మధు సంభాషణలు, శ్యామ్ కె నాయుడు ఛాయాగ్రహణం ఇలా టీమ్ చక్కగా కుదిరింది.

ప్రేమించడానికి ఎవరిని అడగకపోయినా పెళ్లికి మాత్రం పెద్దల అండ అవసరమనే కాన్సెప్ట్ ని తీసుకున్న దాసరి ఆశించిన స్థాయిలో అరుణ్ ని ప్రెజెంట్ చేయలేకపోయారు. దీంతో ఏదేదో ఊహించుకున్న ప్రేక్షకులు నిరాశపడ్డారు. ఫలితంగా గ్రీకువీరుడు ఫ్లాప్. ఆ టైంలోనే పరిచయమైన డీటీఎస్ సౌండ్ టెక్నాలజీ ఖరీదైన వ్యవహారం కావడంతో కేవలం పాటలకు మాత్రమే ఆ మిక్సింగ్ చేయించారు. మ్యూజికల్ గా గ్రీకువీరుడు మరీ తీవ్రంగా నిరాశపరచలేదు కానీ అసలు కంటెంట్ క్లిక్ కాలేకపోయింది. ఇప్పటి స్టార్ రైటర్/నా పేరు సూర్య దర్శకుడు వక్కంతం వంశీ దీని క్లైమాక్స్ లో ఓ కీలక పాత్ర చేశారు. గ్రీకువీరుడు తర్వాత అరుణ్ కుమార్ తో దాసరితో పాటు ఇతర దర్శక నిర్మాతలు సినిమాలు చేశారు కానీ ఏవీ ఆయన్ను హీరోగా సెటిల్ చేయలేకపోయాయి.తర్వాత చాలా గ్యాప్ తీసుకుని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన అరుణ్ కుమార్ కొత్త జనరేషన్ లో ఒక్క క్షణం, శైలజారెడ్డి అల్లుడు లాంటి వాటిలో కనిపించారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp