బాక్సాఫీస్ వద్ద కౌబాయ్ క్లాష్ - Nostalgia

By iDream Post Jul. 12, 2020, 08:59 pm IST
బాక్సాఫీస్ వద్ద కౌబాయ్ క్లాష్ - Nostalgia

కొన్ని అనుకుని ప్లాన్ చేసినా అనుకోకుండా జరిగినా సినిమాల విడుదల విషయంలో తీసుకునే నిర్ణయాలు వివిధ రూపాల్లో ప్రభావితం చూపుతూ ఉంటాయి. ఇక్కడ విశేషం కూడా అలాంటిదే. అది 1990వ సంవత్సరం. ప్రముఖ నిర్మాత-దర్శకుడు-నటుడు గిరిబాబు తన రెండో అబ్బాయి బోసుబాబుని హీరోగా పరిచయం చేయలనే ఉద్దేశంతో భారీ బడ్జెట్ తో 'ఇంద్రజిత్' మొదలుపెట్టారు. డైరెక్టర్ కూడా ఆయనే. బలంగా లాంచ్ చేయాలని స్టోరీ ఎక్కువ ఖర్చుని డిమాండ్ చేస్తున్నా లెక్క చేయలేదు. నిజానికి అప్పుడు కౌబాయ్ ట్రెండ్ తగ్గిపోయింది. సబ్జెక్టు మీద నమ్మకంతో గిరిబాబు రిస్క్ ని రెడీ అయ్యారు. సరిగ్గా అదే సమయంలో ఇంచుమించు ఇలాంటి బ్యాక్ డ్రాప్ తోనే మెగా స్టార్ చిరంజీవి హీరోగా కైకాల సత్యనారాయణ నిర్మాతగా కె మురళీమోహనరావు దర్శకత్వంలో 'కొదమసింహం' షూటింగ్ కూడా జరుగుతోంది.

రెండూ పోటాపోటీగా నిర్మాణం జరుపుకున్నాయి. ఇంద్రజిత్ కొద్దిగా ముందు పూర్తయ్యింది. రిలీజ్ డేట్ అనౌన్స్ చేద్దామనుకునే టైంలో కొదమసింహం విడుదల తేదీని ప్రకటించేశారు. దీంతో ఇంద్రజిత్ కొన్న బయ్యర్లు గిరిబాబు కొద్దిరోజులు ఆగమని ఒత్తిడి చేశారు. దీంతో చిరంజీవి మూవీ ఆగస్ట్ 9న భారీ ఎత్తున రిలీజయింది. అంచనాలు పూర్తిగా అందుకోలేకపోవడంతో బ్లాక్ బస్టర్ అనిపించుకోలేదు. అయినప్పటికీ పలు కేంద్రాల్లో వంద రోజులు ఆడింది. స్టైలిష్ మేకింగ్, పాటలు దీన్ని కొంతవరకు నిలబెట్టాయి. కొదమసింహం వేడి చల్లారాక సెప్టెంబర్ 29న ఇంద్రజిత్ ని రిలీజ్ చేశారు గిరిబాబు. టాక్ బాగానే వచ్చింది. వసూళ్లు కూడా పర్లేదు అనిపించుకున్నాయి కానీ లాభాలు తెచ్చే స్థాయిలో ఇంద్రజిత్ మేజిక్ చేయలేకపోయింది. బోసుబాబు కొత్తవాడు కావడం వల్ల ఇంత పెద్ద కాన్వాస్ ని మోయలేకపోయాడు.

దాంతో గిరిబాబుకి రెండో ప్రయత్నం చేసే అవకాశం దక్కలేదు. బోసుబాబుతో ఇతర నిర్మాతలు చేయాలనుకున్న సినిమాలు ముందుకు వెళ్లలేకపోయాయి. ఒకవేళ కొదమసింహం రాకపోయి ఉంటే ఇంద్రజిత్ ఖచ్చితంగా ఇంకా బాగా ఆడి ఉండేదని గిరిబాబు పలు సందర్భాల్లో చెప్పారు. మరో విశేషం ఏమిటంటే ఇంద్రజిత్, కొదమసింహం రెండు సినిమాలకూ సంగీతం అందించింది రాజ్ కోటిలే. మ్యూజికల్ గా హిట్ కొట్టింది మాత్రం చిరునే. ఈ బోసుబాబు అన్నయ్యే ఇప్పటి కమెడియన్ కం క్యారెక్టర్ ఆర్టిస్ట్ రఘుబాబు. తర్వాత కాలంలో బోసుబాబు సీరియల్స్ చేస్తూ గడిపేశారు కానీ నటుడిగా మాత్రం మళ్ళీ తెరపై కనిపించలేదు. 1990లో జరిగిన ఈ కౌబాయ్ క్లాష్ తర్వాత మళ్ళీ ఎవరు ఇలాంటి సినిమాల జోలికి పోలేదు. తిరిగి 2002లో మహేష్ బాబు టక్కరిదొంగ ఈ సాహసం చేశారు కానీ ఫలితం మాత్రం నెగటివ్ గానే దక్కింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp