కాంబినేషన్ కుదిరింది కానీ లెక్క తప్పింది - Nostalgia

By iDream Post Jun. 22, 2020, 08:35 pm IST
కాంబినేషన్ కుదిరింది కానీ లెక్క తప్పింది - Nostalgia

ఏ సినిమాకైనా కాంబినేషన్ సెట్ కావడం ఎంత ముఖ్యమో అంతకన్నా ఎక్కువగా ఆ కంటెంట్ మన ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందో లేదో చెక్ చేసుకోవడం కూడా అంతే అవసరం. లేకపోతే పెట్టిన కోట్ల రూపాయల బడ్జెట్ బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. దానికి ఉదాహరణగా 1994లో వచ్చిన 'గ్యాంగ్ మాస్టర్' ని చెప్పుకోవచ్చు. అంతకు ముందు ఏడాది హిందీలో నసీరుద్దీన్ షా ప్రధాన పాత్రలో 'సర్' అనే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు నిర్ణయించుకున్నారు నిర్మాత టి సుబ్బరామిరెడ్డి. క్యాస్టింగ్, బడ్జెట్ విషయంలో రాజీ పడని ప్రొడ్యూసర్ కావడంతో అన్ని వనరులు పక్కగా కుదిరాయి. స్టార్ డైరెక్టర్ గా ఫుల్ ఫామ్ లో ఉన్న బి గోపాల్ ని తీసుకున్నారు.

అప్పటికే విపరీతమైన డిమాండ్ లో ఉన్న ఏఆర్ రెహమాన్ ను సంగీతం కోసం మాట్లాడుకున్నారు. రాజశేఖర్ హీరోగా మరో ముఖ్యమైన పాత్రలో కృష్ణంరాజుగారిని ఫైనల్ చేశారు. నగ్మా హీరోయిన్. పరుచూరి బ్రదర్స్ రచన. విఎస్ ఆర్ స్వామి కెమెరా. బోనస్ గా రాజశేఖర్ తమ్ముడు సెల్వ వెండితెర పరిచయం. ఇన్ని ప్రత్యేకతలతో అంతకు మించిన అంచనాలతో జూలై 15న గ్యాంగ్ మాస్టర్ విడుదలైంది. తీరా ఫలితం చూస్తే డిజాస్టర్. హిందీ వెర్షన్ లో విలన్ పాత్రలు వేసే నటుడు చేసిన రోల్ ని ఇక్కడ కృష్ణంరాజుతో వేయించడం కోసం దానికి మార్పులు చేయడం, సెల్వ కోసం సెపరేట్ గా ట్రాక్ తో పాటు పాటలు సెట్ చేయడం, పాటలు కూడా మరీ గొప్పగా లేకపోవడం లాంటి మైనస్సులతో గ్యాంగ్ మాస్టర్ అంచనాలు అందుకోలేకపోయింది.

సర్ తో ఎక్కడా పోల్చలేని విధంగా అన్ని కోణాల్లోనూ తేడా కొట్టేసింది. ఉన్నంతలో ఓ రెండు రెహమాన్ పాటలు మాత్రమే పర్వాలేదు అనిపించాయి. దీన్నే తమిళ్ లో మనితా మనితా పేరుతో డబ్బింగ్ చేస్తే అక్కడా ఇదే ఫలితం. హిట్ రీమేక్, అత్యున్నత సాంకేతిక నిపుణుల బృందం కలిసినా గ్యాంగ్ మాస్టర్ ని కనీసం యావరేజ్ కూడా చేయలేకపోయారు. దెబ్బకు సెల్వ ఇంకో ఆఫర్ రాకుండా కోలీవుడ్ కు షిఫ్ట్ అయిపోయాడు. ఊపుమీదున్న రాజశేఖర్ కు ఇది స్పీడ్ బ్రేకర్ గా నిలిచింది. బి గోపాల్ సైతం ఊహించని షాక్ ఇది. దీని తర్వాతే సుబ్బరామిరెడ్డి గారు సినిమా నిర్మాణానికి గ్యాప్ తీసుకోవడం గమనార్హం. నాలుగేళ్ల తర్వాత భగవద్గీత తీశారు కానీ కమర్షియల్ సినిమా జోలికి వెళ్ళలేదు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp