వ్యక్తిత్వ పాఠాలు నేర్పించే సినిమా - Nostalgia

By iDream Post Mar. 04, 2021, 08:36 pm IST
వ్యక్తిత్వ పాఠాలు నేర్పించే సినిమా  - Nostalgia

మనం సినిమాను కేవలం వినోద సాధనంగానే చూస్తాం. అందులో సందేశాలు గట్రా లాంటివి ఏదో స్టార్ హీరోలు చెబితే అంతో ఇంతో వింటాం కానీ ఒక అప్ కమింగ్ హీరోతో చెప్పిస్తే ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందా. ఈ ప్రశ్న పాత తరం దర్శకులను అడిగితే ఖచ్చితంగా కాదనే చెబుతారు. కానీ ఇప్పటి జెనరేషన్ ఆలోచనా విధానం మారింది. సరైన రీతిలో వినోదంపాళ్ళు తగ్గించకుండా కథను ఆసక్తిగా చెప్పగలిగితే ప్రవచనాలు చెప్పినా వింటారని నిరూపించిన సినిమా చిరునవ్వుతో. ఈ చిత్రం విడుదలైన సమయంలో ఎందరో యువకుల ఆలోచనా ధోరణిలో మార్పులు తీసుకొచ్చిందంటే నమ్మకపోవచ్చు కానీ ఇది నిజం. ఆ విశేషాలు చూద్దాం.

2000 సంవత్సరం. రచయితగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కు బాగా పేరు తీసుకొచ్చిన సినిమాలు రెండు. ఒకటి స్వయంవరం రెండు నువ్వే కావాలి. సనాతన సంభాషణ శైలికి సెలవు చెప్పి వీటిద్వారా ఓ కొత్త ట్రెండ్ తీసుకొచ్చారు మాటల మాంత్రికుడు. ఆ సమయంలో హీరో వేణు తన రెండో సినిమాకు కూడా ఈయనతోనే రాయించుకోవాలన్న ఉద్దేశంతో దర్శకుడు రామ్ ప్రసాద్ వచ్చి కథ చెప్పినప్పుడు వెంటనే ఎస్ చెప్పారు. షహీన్ ఖాన్ ని హీరోయిన్ గా పరిచయం చేస్తూ గుర్తుండిపోయే పాటల కోసం బడ్జెట్ పరంగా కొంత ఎక్కువే అయినా మణిశర్మను సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. ఆయన నిరాశపరచకుండా గొప్ప ట్యూన్స్ ఇచ్చారు. ముఖ్యంగా సిరివెన్నెల రచించిన సంతోషం సగం బలం హాయిగ నవ్వమ్మా పాట ఒక టానిక్ లాంటిది.

కథ విషయానికి వస్తే వంటలు చేసుకునే బావ(వేణు)ను చేసుకోవడం ఇష్టం లేక మరదలు(ప్రేమ)పెళ్లి పీటల నుంచి లేచిపోతుంది. దీంతో అందరూ జాలి చూపిస్తున్నా అదేమీ పట్టించుకోకుండా వేణు జాబ్ కోసం సిటీకి వెళ్తాడు. అక్కడ బాగా డబ్బున్న అమ్మాయి సంధ్య(షహీన్)ను చూసి ప్రేమిస్తాడు. కానీ అదంతా స్నేహం అనుకున్న సంధ్య ప్రతాప్(ప్రకాష్ రాజ్)తో ఎంగేజ్ మెంట్ చేసుకుని షాక్ ఇస్తుంది. ఆ తర్వాత జరిగేది సినిమాలోనే చూడాలి. అర్థవంతమైన డైలాగులు, వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడి ఉత్సాహాన్ని ఇచ్చే ఎన్నో గొప్ప మాటలు త్రివిక్రమ్ ఇందులో రాశారు. గిరిబాబు. ఎంఎస్, బ్రహ్మానందం, ఆలీ, ఎల్బి శ్రీరామ్ తదితరులు పండించిన కామెడీ అద్భుతంగా పేలింది. 2000 నవంబర్ 10న దేవుళ్ళుతో పాటు విడుదలైన చిరునవ్వుతో బ్లాక్ బస్టర్ గా నిలిచింది

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp