కళాతపస్వి లెక్క తప్పిన వేళ - Nostalgia

By iDream Post Mar. 09, 2021, 08:43 pm IST
కళాతపస్వి లెక్క తప్పిన వేళ - Nostalgia

స్టార్ హీరోతో కళాత్మక సినిమాలు చేయడం చాలా రిస్క్. ఏ మాత్రం అటుఇటు అయినా ఫలితం ఎప్పటికీ మర్చిపోలేనంత తీవ్రంగా వస్తుంది. అందులోనూ కమర్షియల్ సూత్రాలకు లోబడి నటించే వాళ్ళను డీల్ చేసేటప్పుడు బ్యాలన్స్ కోల్పోకుండా సబ్జెక్టును డీల్ చేయడం చాలా ముఖ్యం. దానికో మంచి ఉదాహరణ చిన్నబ్బాయి. 1996 సంవత్సరం. విక్టరీ వెంకటేష్ వరస విజయాలతో మంచి దూకుడు మీదున్నాడు. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, పవిత్ర బంధం లాంటి చిత్రాలు ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా దగ్గర చేశాయి. సరదాబుల్లోడు మిస్ ఫైర్ అయిన సమయంలో వెంకటేష్ కు చిన్నబ్బాయి కథను వినిపించారు విశ్వనాథ్ గారు.

అప్పటికే ఈ కాంబినేషన్ లో వచ్చిన స్వర్ణకమలం(1988) కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోయింది. పదేళ్ల తర్వాత మళ్ళీ ఈ కలయిక సాధ్యమవ్వడంతో వెంకీ ఎక్కువ ఆలోచించలేదు. నిజానికి ఆ టైంలో విశ్వనాథ్ గారి ఫామ్ తగ్గిపోయింది. 'ఆపద్బాంధవుడు' డిజాస్టర్ గా మిగిలింది. 'స్వాతి కిరణం' పేరు తెచ్చింది కానీ కాసులు రాలేదు. 'శుభ సంకల్పం' కొంత మెరుగైన ఫలితం దక్కించుకుందే తప్ప సాగర సంగమం సరసన నిలిచే స్థాయి కాదు. హిందీలో చేసిన 'ధన్ వాన్' కూడా ఆడలేదు. అందుకే 'చిన్నబ్బాయి'ని ప్రకటించినప్పుడు అభిమానుల్లో ఒకరకమైన అనుమానం సందేహం. కానీ ఆ ఇద్దరూ వాటిని లెక్క చేయలేదు

ఇందులో హీరో పాత్రకు నత్థి ఉంటుంది. ఒక విమెన్ హాస్టల్ లో పని చేస్తూ ఆ హోమ్ పెద్ద శ్రీవిద్యకు చేదోడు వాదోడుగా ఉంటూ తన జీవితంలోకి ప్రవేశించిన ఓ డబ్బున్న అమ్మాయికి జీవితం విలువను తెలిసొచ్చేలా చేయడమే ఇందులో అసలు పాయింట్. లైన్ ఎలా ఉన్నా ట్రీట్మెంట్ చాలా నీరసంగా సాగడంతో చిన్నబ్బాయి కనీసం అభిమానులకు కూడా రుచించలేదు. సత్యానంద్ సంభాషణలు, ఇళయరాజా సంగీతం వీక్ గా ఉన్న స్క్రిప్ట్ ని కాపాడలేకపోయాయి. దానికి తోడు 1997 జనవరి 10న విడుదలైన చిన్నబ్బాయి అదే నెలలో ముందు వచ్చిన చిరంజీవి హిట్లర్, తర్వాత వచ్చిన పెద్దన్నయ్య సూపర్ హిట్ల మధ్యలో నలిగిపోయి చేదు ఫలితాన్ని అందుకున్నాడు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp