చినబాబు పెద్ద మనసు - Nostalgia

By iDream Post May. 06, 2021, 08:30 pm IST
చినబాబు పెద్ద మనసు - Nostalgia
స్టార్ కుటుంబాల నుంచి వచ్చిన హీరోలకు ఏ ఢోకా ఉండదనుకుంటాం కానీ నిజానికి వాళ్ళ మీదే అభిమానుల అంచనాలు అనే ఒత్తిడి అధికంగా ఉంటుంది. దానికి తోడు ఒక పెద్ద బ్యానర్ తోడైతే ఇక ఆ హైప్ ని అందుకోవడం అంత సులభంగా ఉండదు. 1987 సంవత్సరం. అప్పటికి అక్కినేని నాగేశ్వరావు గారి వారసుడిగా నాగార్జున తెరంగేట్రం చేసి మూడేళ్లు అయ్యింది. చేసింది పది సినిమాలు. అవకాశాలకు లోటు లేదు కానీ తనదైన బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న తరుణం. కలెక్టర్ గారి అబ్బాయి, కిరాయి దాదా మాస్ లో ఫాలోయింగ్ తీసుకురాగా మజ్ను తనలో అసలైన నటుడిని ప్రపంచానికి పరిచయం చేసింది. అప్పుడు వచ్చిన ప్రతిపాదనే చినబాబు.

సురేష్ సంస్థ అధినేత రామానాయుడు గారికి ఆ సమయంలో తన అల్లుడు నాగార్జునతో సినిమా తీయాలనే ఆలోచన బలంగా ఉంది. దానికి తగ్గ కథ ఉంటే చెప్పమని పరుచూరి సోదరులకు పురమాయించడంతో వాళ్ళు చినబాబు స్క్రిప్ట్ ని సిద్ధం చేశారు. కొత్త దర్శకులను ప్రోత్సహించడంలో ముందుండే నాయుడు గారు వాళ్ళ రికమండేషన్ మీదే అప్పుడప్పుడే పైకొస్తున్న మోహనగాంధీ గారికి డైరెక్టర్ గా అవకాశం ఇచ్చారు. అమల హీరోయిన్ గా నాగ్ కాంబినేషన్ లో ఇది రెండో సినిమా. మంచి బడ్జెట్ లో ఢిల్లీ, హైదరాబాద్, మదరాసు, కేరళ తదితర రాష్ట్రాల్లో రాజీ పడకుండా అనుకున్న టైంలోనే షూట్ పూర్తి చేశారు.

ఊరిలో గౌరవ మర్యాదలు ఉండే పెద్ద మనిషి చక్రపాణి(రావుగోపాలరావు) చిన్నకొడుకైన వేణు అలియాస్ చినబాబు(నాగార్జున)కు చదువు అయిపోయి ఉంటుంది కానీ ఉద్యోగం ఉండదు. చెల్లి పెళ్లి కోసం తప్పని పరిస్థితుల్లో తప్పుడు మార్గంలో వెళ్లిన చినబాబు ఆ క్రమంలో తన స్నేహితులను కోల్పోతాడు. దీనికి కారణమైన వాళ్ళను పట్టుకున్నాకే తనకిష్టమైన పోలీస్ జాబ్ లో చేరడాన్ని ఆలస్యం చేసుకుంటాడు. ఆ తర్వాత జరిగే కథే చినబాబు. చక్రవర్తి సంగీతం, పిఎస్ ప్రకాష్ ఛాయాగ్రహణం ఈ సినిమాకు దన్నుగా నిలిచాయి. 1988 మే 6 చినబాబు రిలీజయింది. పర్వాలేదనే విజయం సాధించింది కానీ నాయుడు గారు కోరుకున్న స్థాయిలో కాదు. ఆ తర్వాత సురేష్ సంస్థతో కానీ ఆ దర్శకుడితో కానీ నాగార్జున మరో సినిమా చేయలేకపోయారు.
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp