న‌ల్లి...న‌ల్లి... ఎక్క‌డున్నావ్‌? - Nostalgia

By G.R Maharshi Nov. 21, 2019, 08:12 am IST
న‌ల్లి...న‌ల్లి... ఎక్క‌డున్నావ్‌? - Nostalgia

దోమ‌లు న‌ల్లుల‌తో మ‌నికి ర‌క్త‌సంబంధం ఈనాటిది కాదు. దోమ‌లు సంగీత‌కారులైతే న‌ల్లుల‌ది నిశ్శ‌బ్ద సంగీతం. దోమ‌లు అభివృద్ధి దిశ‌లో ఉంటే న‌ల్లులు మాత్రం ఎందుకు తిరోగ‌మించాయి?

మా చిన్న‌ప్పుడు సినిమా ప్రేక్ష‌కుల‌కి ప్ర‌ధాన శ‌త్రువులు ఈ న‌ల్లులు. మా ఊర్లో నేల 40 పైస‌లు, బెంచీ 75 పైస‌లు, కుర్చీ రూ.1.45పైస‌లు ఉండేది. మాకు నేల‌, బెంచీ త‌ప్ప‌, కుర్చీ యోగం త‌క్కువ‌. నేల మీద సౌల‌భ్యం ఏమంటే న‌ల్లులు ఉండ‌వు. కానీ జ‌నం ఎక్కువ‌. ఒక‌రి మీద ఇంకొక‌రు కూర్చుంటారు. కామెడీ సీన్స్ వ‌స్తే ఒక‌రి మీద ఇంకొక‌రు రోడ్ రోల‌ర్‌లా దొర్లుతారు. తాంబూలం న‌మిలే వాళ్లు ఎంగిలి ఎటు మూయాలో తెలియ‌క మ‌న‌మీద ఊస్తూ ఉంటారు. నేల క్లాస్‌లో బీడీలు ఏ రేంజ్‌లో తాగే వారంటే ఒక్క‌సారి ఆ పొగ‌కి స్క్రీన్ కూడా మ‌స‌గ్గా ఉండేది.

బెంచీల ప్ర‌త్యేక‌త ఏమంటే కొన్ని వేల న‌ల్లులు పిల్లా పాప‌ల‌తో స‌భ్య స‌మాజంలో జీవిస్తూ ఉంటాయి. లైట్స్ ఆఫ్ చేయ‌గానే ఆన్‌డ్యూటీలోకి దిగుతాయి. పిర్ర‌ల‌కి టెస్ట్ డోస్ ఇస్తాయి. మ‌నం ఉలిక్కిప‌డి గాలిలోకి ఎగురుతాం. సినిమా అయిపోయే వ‌ర‌కు అలా జ‌ర్కులిస్తూనే ఉంటాం. న‌ల్లుల సామాజిక దాడికి జ‌డుసుకున్న కొంద‌రు తిని పారేసిన వేరుశ‌న‌గ కాగితాల్ని మ‌డిచి అగ్గి పుల్ల‌తో అంటించి బెంచీల తొర్ర‌లోకి పెడ‌తారు. ఒక‌సారి బెంచీ అంటుకుంది. అస‌లే ఆ సినిమా పేరు అగ్గిబ‌రాటా. ఎన్టీఆర్ చిత్ర‌విచిత్ర విన్యాసాలు చేస్తూ ఉంటే చెక్క‌కాలిన వాస‌న‌, జ‌నం హాహాకారాలు చేసి నీళ్లు పోసి ఆర్పేశారు. అప్పుడ‌ప్పుడే క‌మ్యూనిస్టు ఉద్య‌మాలు పుంజుకుంటున్న కాల‌మేమో, న‌ల్లులు కూడా ఎరుపు రంగును ఇష్ట‌ప‌డేవి. కుర్చీ క్లాస్ ప్రేక్ష‌కుల‌పై మెరుపు దాడి చేసి అంద‌రూ త‌మ‌కు స‌మాన‌మేన‌ని నిరూపించేవి.

ఒక‌సారి కంచుకోట సినిమాకు వెళ్లాం. న‌ల్లుల నుంచి ర‌క్షించుకోవ‌డానికి ఎత్తైన కిటికీ ఎక్కి కూచున్నాం. ఎన్టీఆర్ క‌త్తి తిప్పుతున్నాడు. గౌను, టైట్ ఫ్యాంట్ వేసుకుని పాట‌లు పాడుతున్నాడు. క్లైమాక్స్‌లో ఛేజ్‌. స్టూడియోలో చెక్క గుర్రం ఎక్కి క‌ళ్లాన్ని ఎడాపెడా లాగుతూ నుదుటి మీద చెమ‌ట‌ని తుడుచుకుంటూ ఎన్టీఆర్ వెళుతూ ఉంటే కొండ‌లు కోన‌లు మాయ‌మ‌వుతున్నాయి. హాల్ అంతా విజిలెన్స్‌ మొద‌లైంది. మేము కూడా ఉత్సాహంతో అరుస్తున్నాం. ఈ హ‌డావుడి మేము కూచున్న కిటికీ చెక్క‌లో ఉన్న ఒక తేలు పిల్ల‌కి న‌చ్చ‌లేదు. స‌రాస‌రా వ‌చ్చి మా ఫ్రెండ్ పిర్ర‌ని ముద్దు పెట్టుకుంది. వాడు గ‌ట్టిగా అరిచి కింద ఉన్న బెంచీదారుల‌పై దూకాడు. త‌మ మీద ఏం ప‌డిందో తెలియ‌క వాళ్లు భ‌యంతో ప‌రుగెత్తారు. సినిమా అగిపోయింది.
ఇప్పుడు న‌ల్లీ లేదు, బాల్యం లేదు. సినిమాలో మ‌జా లేదు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp