బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో బెస్ట్ ఎలివేషన్ - Nostalgia

By iDream Post Apr. 14, 2021, 08:30 pm IST
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో బెస్ట్ ఎలివేషన్ - Nostalgia
సినిమాల్లో ఫ్యాక్షనిజం జడలు విచ్చుకుంది సమరసింహారెడ్డితో అనుకుంటాం కానీ దానికన్నా చాలా ముందు కడప రెడ్డెమ్మ రూపంలో అక్కడి రక్తపాతాన్ని తమ్మారెడ్డి భరద్వాజ తెరమీద ఆవిష్కరించారు. ఆ తర్వాత ప్రేమించుకుందాం రాలో విలన్ బ్యాక్ డ్రాప్ ని సీమతో ముడిపెట్టారు కానీ దానికో ఊపు తెచ్చి కాసుల కల్పతరువుగా మార్చింది మాత్రం బి గోపాలే. 'సమరసింహారెడ్డి'తో ఇండస్ట్రీ రికార్డులు బద్దలయ్యాక అభిమానులు బాలయ్యనే పదే పదే అలాంటి పవర్ ఫుల్ పాత్రల్లో చూసేందుకే ఇష్టపడ్డారు. అందుకే ఆ తర్వాత వచ్చిన సుల్తాన్, కృష్ణబాబు, వంశోద్ధారకుడు, గొప్పింటి అల్లుడు ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయాయి. అన్నీ ఫ్లాపులే.

అప్పుడు మళ్ళీ గోపాలే రంగంలోకి దిగి 'నరసింహనాయుడు'తో మరో బ్లాక్ బస్టర్ అందించాక ప్రేక్షకులకు ఏం కావాలో బాలయ్యకు అర్థమయ్యింది. కానీ దర్శకులందరూ పదే పదే అదే తరహా కథలు రాసుకుని రావడం ఒకరకంగా ఆయన గ్రాఫ్ ని తగ్గించేసింది. ఆ ఫ్లో వద్దనుకుని కాస్త డిఫరెంట్ గా ట్రై చేసిన 'భలేవాడివి బాసూ'లో కామెడీ ట్రై చేస్తే దాని ఫ్యాన్సే తిరస్కరించారు. సరే మళ్ళీ పాత స్కూల్ కు వెళ్ళిపోదామని చేసిన 'సీమసింహం' కూడా అంచనాలకు తగ్గట్టు లేకపోయింది. టైటిల్ శక్తివంతంగా ఉన్నప్పటికీ కంటెంట్ వీక్ కావడంతో ఓపెనింగ్స్ తో వచ్చిన రికార్డులు చివరిదాకా నిలవలేదు.అప్పుడు కలిశాడు వివి వినాయక్ 'చెన్నకేశవరెడ్డి' కథతో. ఆదిలో జూనియర్ ఎన్టీఆర్ ని చూపించిన తీరు, దానికి వచ్చిన స్పందన చూసిన బాలయ్య ఎక్కువ ఆలోచించలేదు.

పరుచూరి బ్రదర్స్ రాసిన స్క్రిప్ట్ కి ఓకే చెప్పారు. డ్యూయల్ రోల్ లో తండ్రి పాత్రకు టబుని, కొడుకు సరసన శ్రేయను హీరోయిన్లుగా ఎంచుకున్నారు. వయొలెంట్ బ్యాక్ డ్రాప్ అయినప్పటికీ సెకండ్ హాఫ్ మొత్తం ఫాదర్ క్యారెక్టర్ ని సీమలో చూపించే తీరు జనానికి నచ్చుతుందని టీమ్ అనుకుంది. అయితే జరిగింది వేరు. కీలకమైన ఫ్లాష్ బ్యాక్ లో హీరో ఫ్యామిలీని విలన్ చంపడమనే ట్రాక్ ని అచ్చం సమరసింహారెడ్డి తరహాలో చూపించిన తీరు జనానికి రొటీన్ అనిపించింది. దానికి తోడు బాలయ్య చేసిన పోలీస్ ఆఫీసర్ పాత్ర రెండో సగంలో డమ్మీ కావడం మైనస్ అయ్యింది. అయితే మణిశర్మ ఇచ్చిన పాటలు, శరభా శరభా అంటూ పెద్దబాలయ్య ఎలివేషన్ కు ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఆయా సన్నివేశాలు బాగా పండటంతో చెన్నకేశవరెడ్డి మరీ బ్యాడ్ ప్రోడక్ట్ కాకుండా కాపాడాయి. సుమారు 42 కేంద్రాల్లో వంద రోజులు జరుపుకుందీ సినిమా.
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp