పేరుకి తగ్గట్టే చాలా బాగుంది - Nostalgia

By iDream Post May. 04, 2021, 08:30 pm IST
పేరుకి తగ్గట్టే చాలా బాగుంది - Nostalgia

సినిమాలకు సంబంధించిన కొన్ని అంశాలు వినేందుకు సున్నితంగా ఉంటాయి. వాటిని తెరకెక్కించడంలో దర్శకులకు చాలా నేర్పు ఉండాలి. ఏ మాత్రం తడబడినా ఫలితం ఇంకోలా ఉంటుంది. 1999లో దర్శకులు ఈవివి సత్యనారాయణ గారికి స్నేహం కాన్సెప్ట్ మీద ఒక విభిన్నమైన ఆలోచన వచ్చింది. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక సందర్భంలో తప్పు చేస్తాడు. దాని వల్ల రకరకాల స్థాయిలో అవతలి వాళ్లకు నష్టమో లాభమో జరుగుతుంది. అయితే పశ్తాతాపానికి మించిన శిక్ష మరొకటి లేదనేది పెద్దలు చెప్పే మాట. దీనికి ఫ్రెండ్ షిప్ ని ముడిపెట్టి ఓ లైన్ రాసుకుని వెంటనే తన రైటర్స్ టీమ్ తో సంభాషణల రచయిత జనార్ధన మహర్షికి కబురు పెట్టారు. అలా తయారయ్యిందే చాలా బాగుంది స్క్రిప్ట్. శ్రీకాంత్, వడ్డే నవీన్ హీరోలుగా రూపొందించారు.

ఇద్దరు ప్రాణ స్నేహితులు శివాజీ(వడ్డే నవీన్), వంశీ(శ్రీకాంత్)లు. శివాజీకి తాగుడు అలవాటు. ఓసారి మత్తు ఎక్కువై ఏం చేస్తున్నాడో తెలియని మైకంలో సీత(మాళవిక)ను మానభంగం చేయబోతాడు. కట్ చేస్తే ఆ అమ్మాయే వంశీ భార్యగా ఈ ఇద్దరి జీవితంలోకి ప్రవేశిస్తుంది. అయితే ఈ విషయం వంశీకి తెలియదు. తన మీద అఘాయిత్యం చేయబోయిన శివాజీ మీద ప్రతీకారం తీర్చుకునేందుకు సీత నిర్ణయించుకుంటుంది. ఈలోగా ఇతనికి మతిస్థిమితం సరిగా లేని గంగ(ఆశా షైనీ)తో పెళ్లయ్యేలా చేస్తుంది సీత. ఆ తర్వాత జరిగే పరిణామాలు, వంశీకి తెలియకుండా సీత నడిపించే డ్రామానే సినిమాలోని అసలు పాయింట్.

కథ మీద నమ్మకంతో ఈవివి గారు అప్పజెప్పిన బాధ్యతను ఆరుగురు రచయితలతో కలిసి జనార్ధన మహర్షి సమర్ధవంతంగా నిర్వర్తించారు. దీన్ని స్వంతంగా తన బ్యానర్ మీదే నిర్మించాలని డిసైడ్ అయ్యారు ఈవివి. ఆస్థాన సంగీత దర్శకులు కోటి స్వరాలు సమకూర్చగా హీరోయిన్లుగా ఇద్దరూ కొత్తమ్మాయిలనే తీసుకున్నారు. 2000 సంవత్సరం ఫిబ్రవరి 18 చాలా బాగుంది రిలీజయింది. అంతకు నెలముందు జనవరిలో వచ్చి వసూళ్ల సునామి రేపుతున్న కలిసుందాం రా, అన్నయ్యల పోటీని తట్టుకుని మరీ ఘనవిజయం సాధించింది. ఎల్బి శ్రీరామ్ లోని అద్భుత నటుడు ప్రపంచానికి పరిచయమయ్యింది ఈ సినిమాతోనే.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp