చైతన్యానికి బ్రాండ్ నేమ్ F/0 గోపిచంద్ - Nostalgia

By iDream Post May. 03, 2020, 06:34 pm IST
చైతన్యానికి బ్రాండ్ నేమ్ F/0 గోపిచంద్  - Nostalgia

నిజానికి ఈ ఫోటోలో వ్యక్తి పరిచయానికి ఫాదర్ అఫ్ గోపీచంద్ అనే శీర్షిక తప్పు. కానీ ఇప్పటి తరం వెంటనే కనెక్ట్ అయిపోయి గుర్తుపట్టాలంటే ఇలా చెప్తేనే సులభంగా అర్థమవుతుంది. ఇక్కడ ఉన్నది టి కృష్ణ గారు. అభ్యుదయ చిత్రాల్లో తనకంటూ ఒక బ్రాండ్ ను సృష్టించుకుని దర్శకుడిగా చేసినవి కొన్ని సినిమాలే అయినా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన ప్రస్థానాన్ని లిఖించుకున్న ఈయన కెరీర్ కేవలం మూడేళ్లే సాగిందంటే నమ్మగలరా. అయినా కూడా ప్రతి చిత్రం ఆణిముత్యం.

డెబ్యూ మూవీ 'నేటి భారతం'తోనే సిల్వర్ జూబ్లీ కొట్టేసి రెండో సినిమా 'వందేమాతరం'తో సంచలనాలకు తెరతీశారు. సామాజిక సమస్యలను ఇతివృత్తంగా తీసుకుని చుట్టూ ఉన్న మనుషుల మురికిని తెరమీద చూపిస్తూ ప్రశ్నిస్తూ జనాన్ని ఆలోచింపజేసేలా తను నమ్మిన సిద్ధాంతాలకే కట్టుబడటం ఆయన శైలి. శోభన్ బాబు లాంటి స్టార్ తో 'దేవాలయం'లాంటి సోషల్ మూవీలో డీ గ్లామర్ రోల్ చేయించడం ఈయనకే సాధ్యమయ్యింది. ఇక విజయశాంతి ప్రధాన పాత్రలో టి కృష్ణ గారు తీసిన 'ప్రతిఘటన' ఒక చరిత్ర. ఇప్పటికీ ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ లో దీనిది ప్రత్యేక స్థానం.

ముఖ్యంగా ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో పాట ఇప్పటికీ వలువలు విడిచి తిరుగుతున్న నైతిక విలువలను ప్రశ్నిస్తున్నట్టే ఉంటుంది. ఆఖరి చిత్రం 'రేపటి పౌరులు' సైతం మర్చిపోలేని చిత్రంగా నిలిచిపోయింది. నటుడిగా టి కృష్ణ ఆర్ నారాయణమూర్తి దర్శకత్వంలో 'అర్ధరాత్రి స్వతంత్రం'లో ఒక చిన్న శక్తివంతమైన పాత్ర చేశారు. పైన పిక్ అందులోదే. ఏం పిల్లడో ఎల్దామ్ వస్తవా అనే పాటలో టి కృష్ణ గారే నర్తించారు. దాని తర్వాతే ఆయన్ను అరెస్ట్ చేసి ఉరి తీసే సన్నివేశం ఉంటుంది. మనం కమర్షియల్ సినిమాల్లో చూసే హీరో గోపీచంద్ వెనుక ఇంత గొప్ప అభ్యుదయ దర్శకుడు ఉండటం అందరూ తెలుసుకోవాల్సిన వాస్తవం

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp