అక్కినేని దగ్గుబాటి హీరోల మొదటి కలయిక - Nostalgia

By iDream Post Mar. 25, 2021, 08:30 pm IST
అక్కినేని దగ్గుబాటి హీరోల మొదటి కలయిక - Nostalgia

ఒకే స్టేచర్ ఉన్న స్టార్ హీరోలు కలిసి చేయడాన్ని మల్టీ స్టారర్ అంటాం. అలా కాకుండా వయసులో వ్యత్యాసం ఉన్నా బలమైన నేపధ్యం కలిగిన ఇద్దరు కలిసి నటించినా అంతే స్థాయిలో ఆసక్తి ఉంటుంది. కాకపోతే అభిమానుల అంచనాలు అందుకోగలిగే నేర్పు దర్శకుడికి ఉండాలి. అందులో తేడా వస్తే ఫలితం మారిపోతుంది. ఓ ఉదాహరణ చూద్దాం. 1986లో 'కలియుగ పాండవులు' సినిమా ద్వారా పరిచయమైన వెంకటేష్ కు మొదటి సక్సెస్ మంచి కిక్ ఇచ్చింది. అగ్ర నిర్మాతల ఉంచి ఆఫర్స్ రావడం మొదలయ్యాయి. అప్పుడు వైజయంతి మూవీస్ సంస్థ వచ్చిన ప్రతిపాదనే అదే ఏడాది విడుదలైన బ్రహ్మరుద్రులు.

నిర్మాత సి అశ్వినీదత్ మంచి ఊపు మీదున్న సమయమది. అన్న ఎన్టీఆర్ తో చేసిన మొదటి సినిమా 'ఎదురులేని మనిషి'తో మొదలుపెట్టి ఆ తర్వాత తీసిన యుగపురుషుడు, గురుశిష్యులు, అడవిసింహాలు, అగ్ని పర్వతం అన్నీ కమర్షియల్ సూపర్ హిట్లుగా నిలిచి ఆయన స్థాయిని అమాంతం పెంచేశాయి. ఆ టైంలో అక్కినేని నాగేశ్వర్ రావు-దగ్గుబాటి వెంకటేష్ కాంబోకి సరిగ్గా సరిపోయేలా పరుచూరి బ్రదర్స్ అందించిన స్క్రిప్ట్ దత్తుగారికి నచ్చి వెంటనే మురళీమోహన్ రావు గారిని దర్శకుడిగా లాక్ చేసి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. చక్రవర్తి సంగీతం అందించారు. రజని, నూతన్ ప్రసాద్, రంగనాథ్, రంజని తదితరులు ఇతర కీలక తారాగణం.

న్యాయానికి ధర్మానికి కట్టుబడ్డ జస్టిస్ జగదీశ్ చంద్ర ప్రసాద్(ఏఎన్ఆర్)జీవితంలో చెలరేగిన అలజడి, ఏనాడో దూరం చేసుకున్న చెల్లి కుటుంబం నుంచి మేనల్లుడు సత్యం(వెంకటేష్)పాతికేళ్ల తర్వాత వచ్చాక జరిగే పరిణామాల క్రమాన్ని మురళీమోహన్ రావు ఫక్తు ఫార్ములా డ్రామా తరహాలో దీన్ని తీర్చిదిద్దారు. అది ఇది మోతాదు మించడంతో ప్రేక్షకులకు రుచించలేదు. ఫలితంగా 1986 నవంబర్ 11న అష్టలక్ష్మి వైభవం, ఈ ప్రశ్నకు బదులేది సినిమాలతో పాటుగా రిలీజైన బ్రహ్మరుద్రులుకి పరాజయం తప్పలేదు. మళ్ళీ ఏఎన్ఆర్ కాంబోలో వెంకటేష్ మరో సినిమా చేయలేకపోయారు. వైజయంతి బ్యానర్ లో 19 ఏళ్ళ తర్వాత వెంకటేష్ మళ్ళీ సుభాష్ చంద్ర బోస్ చేస్తే అది ఇంకా పెద్ద డిజాస్టర్ కావడం కొసమెరుపు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp