రాజకీయ నగ్నత్వాన్ని చూపించిన సినిమా - Nostalgia

By iDream Post Jan. 13, 2021, 08:10 pm IST
రాజకీయ నగ్నత్వాన్ని చూపించిన సినిమా - Nostalgia

సినిమాల రూపంలో రాజకీయాలను స్పృశించడం కత్తి మీద సాము లాంటిది. ఏ మాత్రం తేడా వచ్చినా పరిణామాలు కోర్టుల దాకా వెళ్తాయి. ఇప్పుడు మనోభావాలు మరీ సున్నితంగా మారాయి కానీ ఒకప్పుడు దర్శకుడు కోడి రామకృష్ణ గారు ఈ లైన్ మీద ఎన్నో అద్భుతమైన పొలిటికల్ డ్రామాలు తెరకెక్కించారు. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సిన సినిమా భారత్ బంద్. 1991 కోడి మంచి ఫామ్ లో సమయం. అంకుశం లాంటి పోలీస్ కథను, మధురానగరిలో లాంటి కామెడీ థ్రిల్లర్ ను, శత్రువు లాంటి రివెంజ్ డ్రామాను డీల్ చేసి అన్ని జానర్లలో హిట్లు కొట్టి తన సత్తా చాటిన టైంలో వర్తమాన పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు చూపించే ఓ సినిమా తీయాలని నిర్ణయించుకున్నారు.

అప్పుడు రూపకల్పన చేసిన స్క్రిప్టే భారత్ బంద్. ఇమేజ్ ఉన్న స్టార్ హీరోలను తీసుకుంటే సబ్జెక్టు పరంగా ఎన్నో మార్పులు పరిమితులు ఉంటాయని గుర్తించిన కోడి వాళ్ళ జోలికి వెళ్లకుండా అప్పుడప్పుడే పేరు తెచ్చుకుంటున్న వినోద్ కుమార్ ని, తమిళంలో సెటిలైన రఘు(ఇప్పటి రెహమాన్)లను తీసుకున్నారు. విలక్షణత ఉంటే తప్ప ఒప్పుకోని హీరోయిన్ అర్చనను ఒక ఛాలెంజింగ్ పాత్రను ఎంచుకున్నారు. సంగీత దర్శకుడిగా విజయ్ శేఖర్ ను పరిచయం చేశారు. సబ్జెక్టు చాలా లోతైనది కావడంతో క్యాస్టింగ్ తో పాటు బడ్జెట్ ని కూడా భారీగా డిమాండ్ చేసింది. అయినా సరే నిర్మాత సుభాష్ సరేనన్నారు. అలా నిర్మాణం మొదలయ్యింది.

బారుడు చొక్కా, నిక్కరు వేసుకుని హత్యలు చేసి ఓ బడ్డీకొట్టు ఆసామీ ఎమెల్యే స్థాయి నుంచి ముఖ్యమంత్రి పదవి దాకా ఎలా వచ్చాడు, దాని వల్ల జరిగిన దారుణాలు ఎలా ఉంటాయనే పాయింట్ మీద ఈ సినిమా రూపొంది 1991 ఆగస్ట్ 15 విడుదలైంది. అప్పటి సామాజిక పరిస్థితులను ఏ మాత్రం బెరుకు లేకుండా కోడిరామకృష్ణ తెరకెక్కించిన తీరు అందరినీ విస్మయపరిచింది. జొన్నవిత్తుల అందించిన మాటలు పాటలు రెండూ తూటాల్లా దూసుకుపోయాయి. జలియన్ వాలా బాగ్ ఉదంతాన్ని స్ఫూర్తిగా తీసుకుని డిజైన్ చేసిన క్లైమాక్స్, ఫస్ట్ హాఫ్ లో వచ్చే పొలిటికల్ సన్నివేశాలు హై లైట్స్ గా చెప్పుకోవచ్చు. భారత్ బంద్ లో అద్భుతమైన నటనకు తొలి సినిమాతోనే కాస్ట్యూమ్స్ కృష్ణ స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయారు. అశోక్ కుమార్ విలనీ కూడా బాగా పండింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp