మహిళా చైతన్యపు ఆణిముత్యాలు - Nostalgia

By Ravindra Siraj Mar. 08, 2021, 04:00 pm IST
మహిళా చైతన్యపు ఆణిముత్యాలు - Nostalgia

ఏ బాష అయినా సినిమా పరిశ్రమ పురుషాధిక్యంలోనే సాగుతుందన్న మాట వాస్తవం. ఒక చిత్రం వందల కోట్ల బిజినెస్ జరుపుకుందంటే దానికి మొదటి రెండు కారణాలు హీరో దర్శకుడు. ఆ తర్వాతే హీరోయిన్ ప్రస్తావన ఉంటుంది. ఇది ఎప్పటి నుంచో ఉన్నదే. అయితే ఈ సాంప్రదాయక సూత్రాన్ని తప్పని ఋజువు చేస్తూ మహిళా చైతన్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన గొప్ప సినిమాలు ఎన్నో వచ్చాయి. ఇవి కమర్షియల్ గానూ విలువల పరంగానూ అత్యున్నత స్థాయిలో నిలిచినవి. అన్నిటి గురించి చెప్పుకుంటే అదో గ్రంథమే అవుతుంది కానీ మచ్చుకు కొన్ని మేలి ముత్యాల్లాంటి ఉదాహరణలు చూద్దాం

మిస్సమ్మ (1955)

ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్విఆర్ లాంటి దిగ్గజాలు ఉన్నా కూడా టైటిల్ సావిత్రి గారి పాత్రను ఆధారంగా పెట్టడాన్ని బట్టే చెప్పొచ్చు ఇందులో ఆవిడ విశ్వరూపం ఏ స్థాయిలో సాగిందో. ముక్కు మీద కోపంతో అవసరార్థం కుటుంబ భారం వల్ల ఓ ఉద్యోగానికి అబద్దం చెప్పే మిస్సమ్మ పాత్రలో సావిత్రి గారిని తప్ప ఇంకెవరిని ఊహించుకోలేనంత గొప్పగా క్యారెక్టర్ ను పండించడం ఇప్పటికీ రాబోయే నటీమణులు ఒక డిక్షనరీగా చూడొచ్చు. ఎల్వి ప్రసాద్ దర్శకత్వ మాయాజాలానికి సకుటుంబ సపరివార సమేతంగా నవ్వుల వర్షంలో మునిగి తేలడంలో మిస్సమ్మ పాత్ర చిత్రణ, సావిత్రి నటన ప్రధాన కారణాలుగా నిలిచాయి

అంతులేని కథ (1976)

చుట్టూ కొన్ని వందల మగాళ్ల కళ్ళు కామంతో ఇంకేదో ఉద్దేశంతో మసిలే ప్రపంచంలో ఉద్యోగం చేసుకునే అమ్మాయి ఎలా ఉండాలో కళ్ళకు కట్టినట్టు చూపించిన దర్శకులు కె బాలచందర్. ఇందులో జయప్రద పాత్రను తీర్చిదిద్దిన తీరు నభూతో నభవిష్యత్. అప్పట్లో ఈ సినిమా చూసిన ఎందరో మహిళలు తమ ఆలోచనా ధోరణిలో మార్పు వచ్చిందని ఎలాంటి సవాళ్లనైనా ఎదిరించే మనస్తత్వాన్ని పెంచుకున్నామని చెప్పడం విశేషం. అంతులేని కథలో రజినీకాంత్ లాంటి ఉద్దండులు ఎందరు ఉన్నా జయప్రద రూపమే ఇప్పటికీ సినిమా చూసిన ప్రతిసారి సమ్మోహనపరుస్తుంది. ఆత్మవిశ్వాసానికి రోల్ మోడల్ గా ఆవిడ పోషించిన సరిత పాత్రను చెప్పొచ్చు

మయూరి (1984)

నమ్మి ఏడడుగులు నడిచి నూరేళ్లు తోడు ఉంటాడన్న ప్రియుడు దూరమై అంగవైకల్యం వచ్చి కాళ్లు పోగొట్టుకుని నడవలేని పరిస్థితి వచ్చినప్పుడు ఒక అమ్మాయి మానసిక స్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవడం కష్టం. అయితే అక్కడితో జీవితం అయిపోదని తలుచుకుంటే ఆకాశమే హద్దుగా ఎన్ని శిఖరాలైనా అందుకోవచ్చని సింగీతం శ్రీనివాసరావు ఆవిష్కరించిన ఒక మోటివేషనల్ బుక్ లాంటి సినిమా మయూరి. ప్రముఖ నాట్య కళాకారిణి సుధా చంద్రన్ నిజ జీవిత కథను తీసుకోవడమే కాదు ఆమెతోనే నటింపజేసి గొప్ప విజయాన్ని అందుకోవడం చరిత్రలో ఎప్పటికీ మర్చిపోలేని గొప్ప మలుపు

ప్రతిఘటన (1985)

అన్యాయాన్ని ప్రశ్నించిన పాపానికి నలుగురిలో నగ్నంగా అవమానం పాలైన దారుణ స్థితి ఎదురైనప్పుడు కూడా మనోనిబ్బరం కోల్పోకుండా రాక్షస సంహారానికి నడుం బిగించిన ఓ వీర నారి గాధను దర్శకుడు టి కృష్ణ చూపించిన తీరుకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆడది తలుచుకుంటే ఏదైనా సాధించగలదు సమాజం మార్పు తీసుకురాగలదు అనే తరహాలో టి కృష్ణ తీర్చిదిద్దిన ఝాన్సీ పాత్ర అవార్డులు రివార్డులే కాదు కలెక్షన్ల వర్షం సైతం కురిపించింది. బెంగుళూరులో ఏకధాటిగా అయిదు ఆటలతో రెండు వందల రోజులు ప్రదర్శింపబడటం ఇప్పటికీ చెక్కుచెదరలేదు

స్వర్ణకమలం (1988)

అనంతమైన ప్రతిభ ఉంటే చాలదు వాటిని ప్రపంచానికి చాటి చూపించే అవకాశాలు వచ్చినప్పుడు అందిపుచ్చుకోవాలనే సందేశంలో భానుప్రియ అద్భుతమైన పెర్ఫార్మన్స్ కు కళాతపస్వి కె విశ్వనాధ్ ఉదాత్తమైన దర్శకత్వం తోడవ్వడంతో స్వర్ణకమలం సంగీత పరిమళాలతో పాటు జీవితానికి కావాల్సిన పాఠాలను కూడా నేర్పించింది. ఇళయరాజా సంగీతం సాయి నాధ్ సంభాషణలు ఇమేజ్ భేషజాలకు పోకుండా వెంకటేష్ ప్రదర్శించిన నటన ఎప్పటికీ మర్చిపోలేని ఓ గొప్ప సినిమాగా స్వర్ణకమలంని మిగిల్చింది. అర్థం చేసుకోరూ అంటూ కళ్ళతోనే అభినయించిన భానుప్రియ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే

కర్తవ్యం (1990)

లేడీ అమితాబ్ గా విజయశాంతికి గొప్ప పేరు తెచ్చిన చిత్రమిది. మోహనగాంధీ దర్శకత్వంలో హీరో లేకుండా ఒక పవర్ ఫుల్ మహిళా పోలీస్ ఆఫీసర్ బయోపిక్ తరహాలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో థియేటర్లను మహిళలతో కిక్కిరిసిపోయేలా చేసింది. ఈ స్ఫూర్తితో అమ్మాయిలు పోలీసు ఉద్యోగాలను అప్లై చేసుకోవడానికి ముందు రావడం అతిశయోక్తి కాదు. సంఘ విద్రోహ శక్తులు ఎన్ని అరాచకాలకు పాల్పడినా భయపడకుండా కర్తవ్య నిర్వహణకు ప్రాణాలకు తెగించిన ఇన్స్ పెక్టర్ పాత్రకు అప్పటి ఐపిఎస్ ఆఫీసర్ కిరణ్ బేడీని స్ఫూర్తిగా తీసుకోవడం విశేషం. ఇప్పటికీ కర్తవ్యంని మించిన పవర్ ఫుల్ లేడీ పోలీస్ కథ రాలేదన్నది వాస్తవం

అంకురం (1993)

ఎవరో ఒకరు ఎపుడో అపుడు నడవరా ముందుకు ఆటో ఇటో ఎటో వైపు అంటూ కొన్ని లక్షల జీవితాల్లో ఆలోచన రేకెత్తించిన ఈ పాట ఉన్నది ఈ సినిమాలోనే. సమాజంలో బయటికి కనిపించని ఓ చీకటి కోణానికి చేదు వాస్తవాలను జోడించి దర్శకులు సి ఉమామహేశ్వరావు చేసిన గొప్ప ప్రయత్నమే ఈ సినిమా. ఇప్పుడు మనం చూస్తున్న నాంది, పవర్ ప్లే లాంటి సినిమాల్లో అండర్ ట్రయిల్ కాన్సెప్ట్ ని పాతిక సంవత్సరాల క్రితమే ఈయన స్పృశించిన తీరు జేజేలు దక్కించుకుంది. రేవతి నటన నీరాజనాలు అందుకుంది. ఓంపురి, శరత్ బాబు తదితరుల నటన దీని స్థాయిని ఎక్కడికో తీసుకెళ్లింది

ఒసేయ్ రాములమ్మ (1996)

విజయశాంతి పనైపోయింది ఇక లేడీ ఓరియెంటెడ్ సినిమాకు కాలం చెల్లిందనుకుంటున్న తరుణంలో దర్శక రత్న దాసరి తెలంగాణ నేపథ్యంలో పట్వారిల దాష్టీకానికి బలైపోయిన ఓ ఆబల కథను ఒసేయ్ రాములమ్మాగా తీర్చిదిద్దిన తీరుకు బాక్సాఫీస్ దాసోహమంది. కమర్షియల్ సూత్రాలకు భిన్నంగా నడిచినప్పటికీ జనం రాములమ్మను తమ బిడ్డగా భావించి ఘన విజయం చేకూర్చారు. ముఖ్యంగా వందేమాతరం శ్రీనివాస్ పాటలు ఊరువాడా మారుమ్రోగిపోయాయి. ఓ ప్రభంజనంలా తెలుగు రాష్ట్రాన్ని కుదిపేశాయి. దీని దెబ్బకే విజయశాంతి కెరీర్ మరో పదేళ్లు నిర్విరామంగా సాగింది

అరుంధతి ( 2009)

గ్లామర్ పాత్రలతో స్టార్ హీరోల సరసన నటిస్తున్న అనుష్కకు ఈ సినిమా ప్రకటించినప్పుడు ఎన్నో కామెంట్స్ వచ్చాయి. కేవలం గ్రాఫిక్స్ ని నమ్ముకుని ఇంత భారీ బడ్జెట్ తో అనుష్కతో చేస్తున్న ప్రయోగం బెడిసికొడుతుందేమో అని అందరూ భయపడ్డారు. కానీ అనూహ్యంగా హీరో లేకుండానే జేజెమ్మగా అనుష్క యాక్టింగ్ కి కోడి రామకృష్ణ కథ చెప్పిన విధానానికి విజువల్ ఎఫెక్ట్స్ కి అరుంధతి గొప్ప విజయం అందుకుంది. ఆలస్యంగా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలైనా కూడా రికార్డులు కొల్లగొట్టి అనుష్కను ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చి పెట్టాయి. ఆ తర్వాత ఈ స్థాయిలో హీరోయిన్ బేస్డ్ మూవీ సక్సెస్ కాలేదన్నది నిజం.

ఇవి కేవలం కొన్ని మెచ్చుతునకలు మాత్రమే. వీటితో సమానంగా లేదా అంతకన్నా ఎక్కువగా చెప్పుకోదగిన సినిమాలు చాలానే ఉన్నాయి. అశ్విని నాచప్ప అశ్విని, అనుష్క రుద్రమదేవి, భాగమతి, సమంతా ఓ బేబీ, ఐశ్వర్య రాజేష్ కౌసల్య కృష్ణమూర్తి లాంటి ఎన్నో. ఇవన్నీ మాస్ లెక్కల ప్రతిబంధకాలు దాటుకుని కేవలం మహిళా పాత్రధారిని ఆధారంగా చేసుకుని గొప్ప విజయం సాధించినవి. ఇవి మరెన్నో రావాల్సిన అవసరం చాలా ఉంది. స్త్రీ శక్తిని తెరపై ఆవిష్కరించే దర్శకులూ దానికి కావాలి

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp