అదరగొట్టిన అరుణాచలం - Nostalgia

By iDream Post Jun. 23, 2021, 08:05 pm IST
అదరగొట్టిన అరుణాచలం - Nostalgia

డబ్బు సంపాదించడం కష్టం ఖర్చు పెట్టడం చాలా తేలికనుకుంటాం కానీ నిజానికి రెండూ అంత సులభం కాదు. అందులోనూ లెక్కలేనంత సొమ్ము చేతిలో ఉన్నప్పుడు ఒక్కోసారి మనం అనుకున్నవి కూడా రివర్స్ లో జరుగుతూ ఉంటాయి. వినడానికి చాలా వింతగా అనిపించే ఈ పాయింట్ తో సినిమాలు రావడం అవి కూడా మంచి విజయం సాధించడం అంటే విశేషమేగా. అదేంటో చూద్దాం. 1902లో జార్జ్ బర్ మెచియాన్స్ రాసిన 'బ్రివ్ స్టర్స్ మిలియన్స్' అనే నవల బాగా ప్రసిద్ధి పొందింది. దీని ఆధారంగా హాలీవుడ్లో కొన్ని సినిమాలు కూడా వచ్చాయి. 1954లో ఈ పాయింట్ తో ఎన్టీఆర్ హీరోగా రూపొందిన 'వద్దంటే డబ్బు' మంచి విజయం సాధించింది.

మళ్ళీ 1985లో బాలకృష్ణ హీరోగా ఇంచుమించు ఇదే పాయింట్ తో జంధ్యాల 'బాబాయ్ అబ్బాయ్' తీశారు కానీ ఇది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. తిరిగి 1997లో మళ్ళీ అలాంటి కథే వచ్చింది. 'ముత్తు' బ్లాక్ బస్టర్ సాధించాక కొంత గ్యాప్ తీసుకున్న రజని ఇండస్ట్రీలో తాను పైకి వచ్చేందుకు సహాయపడిన మిత్రుల కోసం ఓ సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ టైంలో పైన చెప్పిన థీమ్ ని ఆధారంగా చేసుకుని రచయిత క్రేజీ మోహన్ చెప్పిన కథ రజినిని బాగా ఆకట్టుకుంది. అప్పటికే సూపర్ స్టార్ తో సినిమా చేయాలని ప్రయత్నిస్తున్న దర్శకుడు సుందర్ సికి కబురు వెళ్ళింది. నిజానికి అతనికి ఈ స్టోరీ నచ్చలేదు. అయినా నో అనే పరిస్థితి కాదది.

రంభ హీరోయిన్ గా దేవా సంగీత దర్శకత్వంలో పాటలు సిద్ధం చేసుకుని అరుణాచలం షూటింగ్ చేశారు. ముందుగా మేస్త్రి, కుబేరన్ టైటిల్ అనుకున్నప్పటికీ ఫైనల్ గా ఓ మిత్రుడి సలహాతో రజిని వాటిని వద్దన్నారు. ఆడియో సినిమా రిలీజ్ కు ముందే చార్ట్ బస్టర్ అయ్యింది. 1997 ఏప్రిల్ 10న 'అరుణాచలం' భారీ ఓపెనింగ్స్ తో విడుదలయ్యింది. బాషా రేంజ్ లో కాకపోయినా ఫ్యాన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కి కావాల్సిన అన్ని అంశాలు ఉండటంతో తెలుగు వెర్షన్ అందించిన నిర్మాత ఏఎం రత్నంకు మంచి లాభాలు అందాయి. ఎమోషన్, ఎంటర్ టైన్మెంట్, మ్యూజిక్, థ్రిల్స్ ఇలా అన్ని సమపాళ్ళలో కుదిరిన అరుణాచలం రజనీకాంత్ కోరుకున్నట్టే వసూళ్లు తెచ్చి తాను ముందే అనుకున్న 8 మిత్రులు సన్నిహితుల కుటుంబాలకు అందేలా చేసింది

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp