భక్తి ముసుగులో అజ్ఞానం హద్దులు దాటితే - Nostalgia

By iDream Post Apr. 10, 2021, 08:33 pm IST
భక్తి ముసుగులో అజ్ఞానం హద్దులు దాటితే - Nostalgia

ప్రపంచం సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందినా సమాజంలో మూఢనమ్మకాలను మాత్రం పూర్తిగా రూపుమాపలేకపోయింది. అందుకే దేవుడు దెయ్యం పేరుతో తాంత్రిక శక్తులు ఉన్నాయంటూ బెదిరిస్తూ పబ్బం గడుపుకునే స్వాములు బాబాలకు లోటు లేకుండా గడిచిపోతోంది. కళ్ళముందు కటిక నిజం కనిపిస్తున్నా ఒప్పుకోలేని చదువుకున్న మూర్ఖులు ఎందరో. రాసలీలల వీడియోతో పట్టుబడిన ఓ స్వామిజి ఏకంగా తన పేరు మీద ద్వీపాన్ని ఏర్పాటు చేసుకుని పాస్ పోర్టులు ఇచ్చే స్థాయికి చేరుకునేలా చేసింది మన వ్యవస్థే. దానికి అమాయకులైన ప్రజలూ కారణమే. పచ్చిగా అనిపించినా చాలా సున్నితమైంది ఈ సమస్య.

అందుకే దర్శకులు ఇలాంటి వాటి జోలికి వెళ్లేందుకు ఇష్టపడరు. కానీ చంద్రశేఖర్ యేలేటి శైలి విభిన్నం. 2003లో ముక్కుమొహం తెలియని యువతీయువకులతో 'ఐతే' లాంటి సంచలనం తీశాక సామాన్య ప్రేక్షకుడు సైతం ఈయన గురించి మాట్లాడుకున్నాడు. ఆఫర్లు ఎన్ని వచ్చినా తొందరపడకుండా రెండేళ్లు గ్యాప్ తీసుకుని మరీ 'అనుకోకుండా ఒక రోజు' స్క్రిప్ట్ ని సిద్ధం చేసుకున్నారు. అప్పటిదాకా నాగార్జున, నితిన్, సుమంత్ లాంటి స్టార్ల సినిమాల్లో గ్లామర్ పాత్రలు మాత్రమే చేసిన ఛార్మీకి జీవితంలో ఒక్కసారి తరహాలో ఈ సబ్జెక్టు తనవద్దకు తీసుకెళ్లాడు ఏలేటి. కథ పూర్తిగా విన్నాక మరో ఆలోచన లేకుండా చేసేందుకు ఒప్పుకుంది. సస్పెండ్ అయినా మంచివాడైన పోలీస్ పాత్రకు జగపతిబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఆ టైంలో పెద్ద విశేషం.

సినిమాల్లో కోరస్ సింగర్ గా పనిచేసే సహస్ర (ఛార్మీ) జీవితం ఓ రాత్రి మాయమవుతుంది. ఓ నైట్ పార్టీ అటెండ్ అయ్యాక తన జీవితంలో ఊహించని మార్పులు చేరుకుంటాయి. ఎవరి జోలికి వెళ్లని తన మీద హత్యాప్రయత్నాలు కూడా జరుగుతాయి. తీగలాగితే దీనివెనుక ఓ పెద్ద స్పిరిచువల్ ముఠా ఉందని అర్థమవుతుంది. మరి ఆ విష వలయం నుంచి సహస్ర ఎలా తప్పించుకుందో ఉత్కంఠభరితంగా సాగే కథనం కోసం సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. కీరవాణి పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా కుదిరాయి. పేపర్ మీద చాలా కన్ఫ్యుజింగ్ గా అనిపించే ఈ స్క్రీన్ ప్లేని తెరమీద మాత్రం ప్రతిఒక్కరు అబ్బురపడేలా యేలేటి తెరకెక్కించిన తీరు నంది అవార్డులను కూడా తెచ్చింది. ఈ స్థాయిలో మూఢభక్తి మీద చెంప ఛెళ్లుమనిపించేలా అంతకు ముందు ఆ తర్వాత సినిమా రాలేదన్నది వాస్తవం

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp