అనంత‌పురంలో ANR అభిమానులు - Nostalgia

By G.R Maharshi Sep. 20, 2020, 03:47 pm IST
అనంత‌పురంలో ANR అభిమానులు - Nostalgia

సెప్టెంబ‌ర్ 20, అక్కినేని పుట్టిన రోజు. చిన్న‌ప్పుడు ANR అంటే ఇష్ట‌ముండేది కాదు. ఆయ‌న‌కి ఫైటింగులు రావు కాబ‌ట్టి. NTR అయితే క‌త్తి తిప్పేవాడు. కృష్ణ అయితే పిస్టోలు కాల్చేవాడు. ANR అమ్మాయిల‌తో డాన్సులు చేస్తూ ప్రేమ‌, వ‌ల‌పు, మ‌న‌సు అంటూ డైలాగులు చెప్పేవాడు. అ ప‌దాల‌కి అర్థం తెలీదు కాబ‌ట్టి ఆయ‌న పార్టీలో వుండేవాళ్లం కాదు.

మా స్కూల్లో అంద‌రూ ఎన్టీఆర్ పార్టీనే. కొబ్బ‌రి ఆకులు ఈనెల‌తో స‌య్‌స‌య్‌మ‌ని క‌త్తి యుద్ధం చేసేవాళ్లం. నేన‌యితే ఒక చెయ్యి వెన‌క్కి పెట్టుకుని క‌త్తి తిప్పుతూ NTRలా ముక్కు పుటాలు నొక్కేవాన్ని (గండికోట ర‌హ‌స్యంలో NTR మాన‌రిజం ఇది)

ANR సినిమాలు చూసేవాన్ని కానీ, బాగా త‌క్కువ‌. మాయ‌బ‌జారులో అభిమ‌న్యుడి ఎపిసోడ్ చాలా బోర్ నాకు. నేను 5వ త‌ర‌గతిలో వుండ‌గా మా అమ్మ న‌న్ను వ‌దిలేసి తిరుప‌తి వెళ్లింది. ఆమె వ‌చ్చిన త‌ర్వాత న‌న్ను బాగా బాధ‌పెట్టిన అంశం ఏమంటే తిరుప‌తి ప్ర‌తాప్ టాకీస్‌లో ద‌స‌రాబుల్లోడు సినిమా చూసొచ్చింది. అప్ప‌టికే ద‌స‌రా బుల్లోడు Songs మారుమోగి పోతున్నాయి.

మా రాయ‌దుర్గానికి కూడా ద‌స‌రాబుల్లోడు రాక‌పోతాడా అని ఎదురు చూస్తూ ఉంటే 4 నెల‌ల త‌ర్వాత నూర్ టూరింగ్ టెంట్‌కి వ‌చ్చాడు. ఆ రోజు వూళ్లో పెద్ద వూరేగింపు. డ‌ప్పులు, పులివేషాలు, బ్యాండ్ మేళాలు. టెంట్ కిట‌కిట‌లాడి టికెట్ల‌కి కొట్టుకున్నారు. ఈ సినిమాలో మొద‌టి సారి నాగేశ్వ‌ర‌రావు న‌చ్చేశాడు. చిన్న కారులో ఆయ‌న షికారు, వాణిశ్రీ పాటలు, ఐదుసార్లు చూశాను. నాకు వ‌య‌సు పెరిగే కొద్దీ ANRకి Likes పెరిగాయి.

త‌ర్వాత ప్రేమ‌న‌గ‌ర్‌. ఆ పాట‌ల‌కి పిచ్చెక్కిపోయింది. ప్ర‌తి పెళ్లిలో అవే గ్రామ్‌ఫోన్ రికార్డులే. నేను ఏదైనా పెళ్లికి పోతే ఆ రికార్డులు వేసేవాడి ద‌గ్గ‌రే కూచునేవాన్ని. న‌ల్ల‌టి ప్లేట్‌పై ముల్లు తిరుగుతుంటే పాట ఎలా వ‌స్తుందో అర్థ‌మ‌య్యేది కాదు. ఆయ‌న్ని బ‌తిమాలి ప్రేమ‌న‌గ‌ర్ పాటలు వేయించేవాన్ని.

7వ త‌ర‌గ‌తిలో వుండ‌గా బంగారు బాబు, కొడుకుకోడ‌లు, ఇలా వ‌రుస‌గా చూసేవాన్ని. ఏడుపు సినిమా అని దేవ‌దాసుని చాలా ఏళ్లు చూడ‌లేదు. ఇంట‌ర్‌లో వుండ‌గా చూసాను. త‌ర్వాత ఎన్నోసార్లు చూసాను. క్లాసిక్స్ అర్థం కావాలంటే మ‌న‌కు వ‌య‌సుండాలి.

టెన్త్‌లో నెంబ‌ర్ వ‌న్ స్టూడెంట్ అయిన నేను, సినిమాలు చూసిచూసి ఇంట‌ర్‌లో ఫెయిల‌య్యాను. అప్పుడు నాకు అనంత‌పురం అక్కినేని అభిమాన సంఘాలు ప‌రిచ‌య‌మ‌య్యాయి. NTR, ANR గ్రూప్‌లు చాలా తీవ్రంగా ప‌నిచేసేవి. త‌మాషా ఏమంటే త‌రిమెల నాగిరెడ్డి లైబ్ర‌రీలో ఉద‌యం నుంచి మ‌ధ్యాహ్నం వ‌ర‌కూ విప్ల‌వ సాహిత్యం చ‌దివే నేను, సాయంత్రం ఈ ఫ్యాన్స్ గ్రూప్‌తో గ‌డిపేవాన్ని. వీళ్లంతా పెద్ద‌గా చ‌దువుకున్న వాళ్లు కాదు, చిన్న‌చిన్న ప‌నులు చేసుకుని బ‌తికేవాళ్లు. నా లాంటి వాళ్లు ఒక‌రిద్ద‌రు మాత్ర‌మే స్టూడెంట్స్‌.

మునిసిపాలిటీలో కాలువ‌లు వూడ్చే జోగులు వీరాభిమాని. ఆయ‌న చేతులు బొబ్బ‌లెక్కి వుండేవి. ANRని పొగుడుతూ NTRని ఎవ‌రైనా తిడితే జేబులో ఉన్న నాలుగైదు రూపాయ‌లు వెంట‌నే ఖ‌ర్చు పెట్టేవాడు. ఆనంద్ అనే వాడు స‌ప్త‌గిరి హోట‌ల్లో బాయ్‌గా చేసేవాడు. కొత్త సినిమా రిలీజ్ అయితే వుద్యోగాన్ని ఎగ్గొట్టి తిట్లు తినేవాడు. చంద్ర స్కూల్‌లో వాచ్‌మ‌న్‌. ఇలాంటి వాళ్లంతా ల‌లిత క‌ళాప‌రిషత్ వెనుకల ఉన్న ఒక పార్క్‌లో స‌మావేశ‌మ‌య్యే వాళ్లు. వీళ్ల‌కో ఉత్త‌రాల వ్య‌వ‌స్థ ఉండేది. రాష్ట్రంలోని ఏయే సెంట‌ర్ల‌లో ANR సినిమాలు రికార్డు క‌లెక్ష‌న్లు చేసాయో ఆ వివ‌రాల‌ను ఆయా సెంట‌ర్ల ఫ్యాన్స్ ఉత్త‌రాలు రాసేవాళ్లు. అంతే కాకుండా NTR ఫ్యాన్స్‌ని స‌వాల్ చేస్తూ బూతులు తిడుతూ పాంప్లేట్స్ వేసేవాళ్లు.

వీళ్ల పిచ్చి ఏ స్థాయిలో వుండేదంటే ANR సినిమా గౌరీ లేదా త్రివేణి టాకీసుల్లో House Full అయితే టపాసులు కాల్చేవాళ్లు. అవి వూళ్లో పెద్ద థియేట‌ర్లు కాబ‌ట్టి. ఒక‌వేళ House Full కాక‌పోతే కొన్ని టికెట్లు తామే కొని, Full బోర్డు పెట్టించేవాళ్లు.

బుచ్చిబాబు అనే సినిమా క‌దిరిలో 100 రోజులు ఆడితే అనంత‌పురం నుంచి ప్ర‌త్యేకంగా బస్సు ఏర్పాటు చేసి అభిమానుల్ని తీసుకెళ్లారు. నేను వెళ్ల లేదు కానీ, ఆ సంబ‌రాల్ని నెల‌రోజులు చెప్పారు.

రావ‌ణుడే రాముడైతే అనే సినిమాకి నాతో కూడా చిల్ల‌ర నాణాలు విసిరించారు. ఆ త‌ర్వాత నేను మెల్లిగా ఈ గ్రూపుల నుంచి త‌ప్పుకుని సాహిత్యంలో మునిగిపోయాను.
ఎంతో మంది అభిమానులు త‌మ క‌ష్టార్జితాన్ని , జీవితాల్ని త‌గ‌ల‌బెడితేనే కొంద‌రు హీరోల‌య్యేది.

ANRని ఎంతో ఇష్ట‌ప‌డిన నేను 83 త‌ర్వాత ఆయ‌న సినిమాలు చూడ‌డం మానుకున్నాను. చాలా కాలం త‌ర్వాత సీతారామ‌య్య‌గారి మ‌నుమ‌రాలు చూసాను, న‌చ్చింది. ఆ త‌ర్వాత మనం చూసాను. ఆ వ‌య‌సులో కూడా ఆ ఎన‌ర్జీ, ఆ న‌ట‌న మార్వ‌లెస్‌.

టీవీలో ఆయ‌న నివాళి దృశ్యాలు చూసిన‌పుడు బాధ‌గా అనిపించింది. నా త‌రం వాళ్లంతా దాదాపు 20 ఏళ్లు ప్ర‌తిరోజూ ఆయ‌న గురించి మాట్లాడుకుని వుంటారు. సినిమాకి వున్న గొప్ప‌త‌న‌మ‌ది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp