థియేటర్ సాక్షిగా 'అమ్మోరు' దర్శనం - Nostalgia

By Ravindra Siraj Nov. 25, 2020, 10:01 pm IST
థియేటర్ సాక్షిగా 'అమ్మోరు' దర్శనం - Nostalgia

(మొన్న 23వ తేదీ అమ్మోరు సినిమా పాతిక సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అప్పుడు స్కూల్ విద్యార్ధిగా ఉన్న ఓ సినీఅభిమాని జ్ఞాపకాల దొంతర)

1995 సంవత్సరం ....

అవి నేను తొమ్మిదో తరగతి చదువుతున్న రోజులు....

ఒంటరిగా సినిమా చూసేంత ధైర్యం, స్వతంత్రం ఇంకా రాని కాలం...

తేదీలతో సహా పాత విషయాలు చెప్పేంత జ్ఞాపక శక్తి లేదు కానీ ఆ రోజు స్నేహితులతో కలిసి వెళ్లిన ఒక్క సినిమా మాత్రం నా దృక్పథాన్ని పూర్తిగా మార్చేసింది

"ఏంట్రా ఇది. ఊళ్ళో ఇంకే సినిమాలు లేనట్టు ఆ దేవతల బొమ్మని డబ్బులు ఖర్చుపెట్టి మరీ చూడాలా. ప్లాప్ అయినా పర్లేదు బాస్ ని చూసుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు ఏదైనా సరే చిరుకే నా ఓటు"

నా ఫ్రెండ్ ప్రతిపాదనకు నేనిచ్చిన జవాబు. అప్పటికే వాడు మా బ్యాచ్ లో వాళ్ళను చాలా తెలివిగా ఇన్ఫ్లూయన్స్ చేసి వాడి వైపు తిప్పుకున్నాడు కాబట్టి నా వెర్షన్ నిలబడలేదు. ప్రజాస్వామ్య సూత్రాల ప్రకారం ఇష్టం లేకపోయినా వాళ్ళ వెంట నడిచాను.

ఆదోని. ద్వారకా సినీ కాంప్లెక్స్. మొత్తం మూడు స్క్రీన్లు ఉన్నాయి. మేము వెళ్లిన మినీ ద్వారకా అన్నిటిలోకి చాలా చిన్నది.

గేటు లోపలికి అడుగు పెడుతున్నామో లేదో భారీ జన సందోహం. టికెట్ల కోసం బారులు. గుంపుల కొద్దీ ఆడవాళ్లు. మగాళ్ల సంగతి సరేసరి. ఏ సినిమాకు ఇంత రద్దో అర్థం కావడానికి ఓ రెండు నిమిషాలు పట్టింది.

నేనేదైతే వద్దని మొత్తుకున్నానో దానికే ఈ జాతర. కాస్త లోపలికి వెళ్ళాక షాక్ కొట్టింది. పసుపు పూసిన నిలువెత్తు ఏదో దేవత బొమ్మకి పూజలు, ప్రదక్షిణలు జరుగుతున్నాయి. టెంకాయలు పగలగొట్టి ఉన్నాయి. మహిళలు పదే పదే దండం పెట్టుకుంటున్నారు. ఇదంతా ఒక సినిమా తాలూకు ప్రభావం అని సులువుగా నమ్మే వయసు కాదది. ఆ సంభ్రమాశ్చర్యాలు వెంటాడుతుండగానే హాల్లో అడుగుపెట్టాం. టైటిల్స్ మొదలయ్యాయి. పేరు "అమ్మోరు"

టికెట్లు ఎలా సంపాదించుకున్నాం అనే వివరణ ప్రస్తుతానికి అప్రస్తుతం కాబట్టి నేరుగా పాయింట్ లోకి వెళ్లిపోదాం. మొదట అనాసక్తిగా చూడటం మొదలుపెట్టాను. థియేటర్లో సినిమా చూడాలి అంటే మినిమం స్టార్ హీరో ఉండాలనే అపరిపక్వత కొట్టుమిట్టాడే వయసు కదా. ఆ ఆలోచనలతో నెగటివ్ కోణంలో చూస్తున్నా

టైం గడిచే కొద్దీ నన్ను నేను మర్చిపోతున్నా. జనం గుడ్లప్పగించి చూస్తున్నారు. ఒక్కో సీన్ ముందుకు వెళ్లే కొద్ది వాళ్ళ తన్మయత్వం అంతకంతకూ పెరుగుతూ పోతోంది. అప్పటికప్పుడు ఎవడైనా దొంగల బ్యాచ్ వచ్చి ఒంటి మీద నగలన్నీ ఒలుచుకుపోయినా ఆ అమ్మోరు తల్లే తిరిగి తెప్పిస్తుందన్న ధీమాతో పరిసరాలు మర్చిపోయి మరీ చూస్తున్నారు.

ఇంతలో అద్భుతమైన సీన్ ఒకటి వచ్చింది. బేబీ సునయనను బావిలో పారేయడానికి కళ్ళు చిదంబరం చెరువు దగ్గరికి వచ్చి అన్నంత పనీ చేస్తాడు. ఇప్పుడేమవుతుందనే నరాలు తెగే ఉత్కంఠ మధ్యే నీళ్లే చేతులుగా మారి పాపగా మారిన అమ్మోరు తల్లిని సముద్రుడు బయటికి తీసుకొచ్చే సన్నివేశం చూస్తూ అప్పటికే మెదడు మొద్దుబారిపోయింది

హఠాత్తుగా తెర ముందు మూడో వరసలో ఓ ఇద్దరు ముగ్గురు ఆడాళ్లు జడలు విరబూసుకుని ఊగిపోతున్నారు. మాకదేంటో అర్థం కాలేదు. పక్కనున్న పెద్దాయన చెప్పాడు దాన్ని పూనకం అంటారని. దేవత స్వయంగా వాళ్ళ శరీరంలోకి వచ్చిందన్న మాట విని ఒళ్ళు జలదరించింది.

మాటలు రావడం లేదు. నిర్మాత ఎం శ్యామ్ ప్రసాద్ రెడ్డి ధైర్యం గురించి చెప్పాలంటే మాటలు చాలవేమో. స్టార్లు లేకుండా హుషారెత్తించే పాటలు పెట్టకుండా రెండున్నర గంటల పాటు కన్నార్పకుండా గ్రాఫిక్స్ తో ఇంత మాయాజాలం చేసిన దర్శకుడు ఎవరా అని బయటికి వచ్చాక పదే పదే పోస్టర్ల వంక చూసాను
పెద్ద అక్షరాల్లో "కోడి రామకృష్ణ"

సినిమా పత్రికలు తిరగేసి మరీ ఆయన ఫోటో చూసా. ఇలాంటి ఆలోచనలతో ఇంత గొప్పగా తీసిన వ్యక్తిని చూడకపోతే ఇంకెందుకు దండగ అనిపించింది. ఇక అది మొదలు వెనక్కు వెళ్లి ఆయన దర్శకత్వం వహించిన మొదటి సినిమా ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్యతో మొదలుకుని అక్షరం ముక్క తెలుగు రాని రాజశేఖర్ తో అందరితో సెల్యూట్ కొట్టించేలా తీసిన అంకుశం దాకా అన్ని మరొక్కసారి చూడటం మొదలుపెట్టా. వయసు పెరిగే కొద్దీ ఆయన సినిమాల మీద తెలుసుకున్న విషయాలు నాకో గొప్ప విజ్ఞాన గనిని కానుకగా ఇచ్చాయి.

చెల్లి సెంటిమెంట్ తో ఏడిపిస్తూనే ఇండస్ట్రీ రికార్డులు కొడితే "ముద్దుల మావయ్య"
జీరో మార్కెట్ ఉన్న ఇద్దరు హీరోలతో వర్తమాన రాజకీయాలపై సీరియస్ గా తీసి వంద రోజులు ఆడిస్తే "భారత్ బంద్"
ప్రతీకారం తీర్చుకోవడంలోనూ కొత్త స్టైల్ ని పరిచయం చేస్తూ ఉక్కిరిబిక్కిరి చేసే మలుపులతో బ్లాక్ బస్టర్ కొడితే "శత్రువు"
హీరో లేకుండా హీరోయిన్ తోనే డ్యూయల్ రోల్ చేయించి యాక్షన్ మసాలాతో కుర్చీలోనే కట్టిపడేస్తే "పోలీస్ లాకప్"
గ్లామర్ వేషాలేసుకునే అమ్మాయిని తీసుకొచ్చి గద్వాల్ రాణిగా కత్తి పట్టించి బాక్స్ ఆఫీస్ కి సవాల్ విసిరితే "అరుంధతి"
ఆయన సినిమాల గురించి రాస్తూ పోతే తెల్లవారడం ఖాయం....

మొన్న 23వ తేదీ అమ్మోరు అప్పుడే 25 సంవత్సరాలు పూర్తి చేసుకుందని తెలిసి ఆశ్చర్యమేసింది. సౌందర్య, రామిరెడ్డి, కోడి రామకృష్ణ, సంగీత దర్శకుడు శ్రీ, కళ్ళు చిదంబరం మనమధ్య లేకపోయినా ఈ అద్భుతంలో భాగమైన కారణంగా చిరకాలంలో ఈ సినిమా రూపంలో సజీవంగా కళ్ళ ముందు తిరుగుతూనే ఉంటారు....

ఇంకో యాభై ఏళ్ళు పూర్తయినా అమ్మోరు మాత్రం వెండితెర సాక్షిగా పూజలు అందుకుంటూనే ఉంటుంది. తరాలతో సంబంధం లేకుండా ఒక అద్భుతంగా నిలిచిపోతుంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp