మధ్యతరగతి జీవి మహాభారతం - Nostalgia

By iDream Post Jul. 05, 2021, 07:43 pm IST
మధ్యతరగతి జీవి మహాభారతం - Nostalgia

జీతం రాళ్ళ మీద బ్రతికే సగటు మధ్య తరగతి జీవితం మీద టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి లెక్కలేనన్ని సినిమాలు వచ్చాయి. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ హయాంతో మొదలుపెడితే నిన్నా మొన్న వచ్చిన ఇప్పటి జెనరేషన్ మిడిల్ క్లాస్ మెలోడీస్ దాకా ప్రత్యేకంగా చెప్పుకోదగ్గవి మాత్రం కొన్నే ఉంటాయి. వాటిలో ఒకటి ఆమ్మో ఒకటో తారీఖు. 2000 సంవత్సరం. అప్పటికే చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లతో సూపర్ హిట్లు తీసిన దర్శకులు ఈవివి సత్యనారాయణ గారికి బాలకృష్ణతో చేసిన 'గొప్పింటి అల్లుడు' ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ సమయంలో తక్కువ బడ్జెట్ లో ఓ మీడియం రేంజ్ సినిమా తీయాలని నిర్ణయించుకున్నారు.

శ్రీహరిని సోలో హీరోగా నిలబెట్టడంలో సక్సెస్ అయిన ఏఏ ఆర్ట్స్ బ్యానర్ మీద 'ఆమ్మో ఒకటో తారీఖు'ని ప్లాన్ చేసుకున్నారు ఈవివి. తను తీసిన 'చాలా బాగుంది' ద్వారా కమెడియన్ గా సత్తా చాటిన ఎల్బి శ్రీరామ్ ని ఈసారి సీరియస్ రోల్ లో చూపిస్తూ ఆయన విశ్వరూపాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలని ఈవివి డిసైడ్ అయ్యారు. అలా రూపుదిద్దుకున్న పాత్రే ఆర్టిసి డ్రైవర్ గోవిందరావు. అంతకు ముందే 'ఆమె' సినిమాలో ఈవివి ఆవిష్కరించిన మధ్య తరగతి జీవన చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ నమ్మకంతోనే అంతకు మించిన ఎమోషనల్ డ్రామాను సంభాషణల రచయిత జనార్ధన మహర్షితో కలిసి సిద్ధం చేశారు.

చాలీచాలని జీతంలో తలకు మించిన భారాన్ని కుటుంబ సభ్యుల రూపంలో మోస్తున్న చిరుద్యోగి గోవిందరావు(ఎల్బి శ్రీరామ్), ఇంట్లో వాళ్ళు చేస్తున్నవి చిన్న వృత్తులైనా తెలివిగా పొదుపు చేసుకుంటూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్న రిక్షావాడి(చలపతిరావు)జీవితం మరోవైపు రెండింటిని చూపించిన తీరు ఆడియన్స్ ని ఆకట్టుకుంది. శ్రీకాంత్ రాశి ప్రధాన జంట అయినప్పటికీ స్టోరీ మొత్తం ఎల్బి శ్రీరామ్ చుట్టే తిరుగుతుంది. అయితే కష్టాల డోస్ బాగా ఎక్కువవ్వడంతో పాటు డ్రామా కొన్ని చోట్ల శృతి మించడంతో 2000 అక్టోబర్ 20న రిలీజైన ఆమ్మో ఒకటో తారీఖు ఆమె స్థాయిలో ఆడలేదు. దీనికి సరిగ్గా వారం ముందు వచ్చిన 'నువ్వే కావాలి' సునామి కూడా కలెక్షన్ల మీద ప్రభావం చూపించింది. తనికెళ్ళ భరణి కామెడీ మాత్రం బాగా పేలింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp