స్టార్ హీరో ఆత్మగా నటిస్తే - Nostalgia

By iDream Post Jan. 22, 2021, 06:53 pm IST
స్టార్ హీరో ఆత్మగా నటిస్తే - Nostalgia

మాములుగా భూత ప్రేతాలను ఆధారంగా చేసుకుని రూపొందే సినిమాల్లో భయపెట్టే హారర్ అంశాలు ఎక్కువగా ఉంటాయి. అందులోనూ హాలీవుడ్ నుంచి స్ఫూర్తిగా తీసుకున్నప్పుడు ఎంతసేపూ ఒక పాడుబడిన ఇంట్లోనో లేదా చనిపోయిన మనిషి తాలూకు దెయ్యం చుట్టూ కథ తిప్పడం తప్ప కొత్తగా ఏమి ఉండదు. అలా కాకుండా ఇలాంటి స్టోరీలోనూ మంచి ఎమోషన్స్, సంగీతం ఉంటే ఎలా ఉంటుంది. ఆ ఆలోచనకు రూపమే 1991లో వచ్చిన ఆత్మబంధం. అప్పట్లో ఈ టైటిల్ ప్రకటించినప్పుడు ఇదేదో బ్లాక్ అండ్ వైట్ కాలం నాటి పేరులా ఉందని అనుకున్నవారే ఎక్కువ కానీ అందులో ఊహించని కథాకథనాలు ఉంటాయని మాత్రం ఎవరూ అనుకోలేదు.

అది సుమన్ కమర్షియల్ మార్కెట్ లో మంచి డిమాండ్ ఉన్న హీరోగా వెలుగొందుతున్న సమయం. డ్రగ్స్ కేసు వివాదం ముగిసి నిర్దోషిగా బయటికి వచ్చి సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టక వరస విజయాలు వరించడం మొదలుపెట్టాయి. తమ హీరో కెరీర్ ని చూసి అభిమానులు మురిసిపోయారు. ఆ సమయంలో ఓ ఇంగ్లీష్ మూవీలోని పాయింట్ ఆధారంగా చేసుకుని రచయిత సత్యానంద్ ఆత్మబంధం కథ, మాటలు రాశారు. సునీల్ వర్మ దర్శకత్వం వహించారు. ఇందులో హీరో పాత్ర ఇంటర్వల్ కే చనిపోతుంది. ఆస్తి కోసం పిల్లనిచ్చిన మామతో పాటు ప్రాణంగా భావించే స్నేహితుడు తన చావుకు కారణమని తెలిసి ఆత్మగా వచ్చి వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకుంటాడు. భార్యబిడ్డ బాద్యతను తండ్రిగా భావించే భూతరాజుకు అప్పజెప్పి సెలవు తీసుకుంటాడు.

1991 ఏప్రిల్ 13న విడుదలైన ఆత్మబంధం చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. అప్పటి మాస్ ఫార్ములా సూత్రాలకు భిన్నంగా సరికొత్త అనుభూతి కలగజేసేలా సగం సినిమాకు పైగా హీరోని అత్మగా చూపడం వాళ్ళను థ్రిల్ చేసింది. కీరవాణి సంగీతం దీనికి దన్నుగా నిలిచింది. ముఖ్యంగా ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి పాట ట్యూన్ కి, సిరివెన్నెల సాహిత్యానికి మ్యూజిక్ లవర్స్ పరవశించిపోయారు. విలన్లు గా చిన్నా, కోట శ్రీనివాసరావు పాత్రలు బాగా పేలాయి. భూతవైద్యుడిగా సత్యనారాయణ క్యారెక్టర్ కూడా చక్కగా పండింది. హీరోయిన్ లిజి సైతం ఇండస్ట్రీ దృష్టిలో పడింది. దీనికి 20 రోజులు ముందు వచ్చిన అసెంబ్లీ రౌడీ ప్రభంజనాన్ని తట్టుకుని ఆత్మబంధం మంచి స్పందన దక్కించుకుంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp