దొంగ స్వామిజీపై సినిమా యుద్ధం - Nostalgia

By iDream Post Mar. 13, 2021, 04:00 pm IST
దొంగ స్వామిజీపై సినిమా యుద్ధం - Nostalgia

నవలలు సినిమాలుగా రూపొందటం ఎప్పటి నుంచో ఉన్నదే. ఇప్పుడంటే చదివే వాళ్ళు రాసేవాళ్ళు ఇద్దరూ తగ్గిపోయారు కాబట్టి రావడం లేదు కానీ ఒకప్పుడు వీటికొచ్చే అద్దెలతోనే లైబ్రరీలు పాన్ షాపులు నడిచాయంటే ఆశ్చర్యం కలగక మానదు. ముఖ్యంగా 80వ దశకం మొదలయ్యాక యండమూరి వీరేంద్రనాథ్ తన రచనల ద్వారా రచయితలకు స్టార్ స్టేటస్ తీసుకురావడం అప్పటి తరం ఎప్పటికి మర్చిపోలేని ఓ గొప్ప జ్ఞాపకం. ఆయన నవలలతో ముందు చిరంజీవి ఎన్నో సూపర్ హిట్లు అందుకున్నారు. అభిలాష, ఛాలెంజ్, రాక్షసుడు, దొంగమొగుడు, మరణమృదంగం ఇవన్నీ సినిమాలు. అంతకు ముందే పాఠకాదరణ పొందిన సీరియళ్లు.

1986లో తెరంగేట్రం చేసిన అక్కినేని నాగార్జునకు తండ్రి అభిమానుల ద్వారా వచ్చిన మార్కెట్ తప్ప స్వంతంగా తన ఇమేజ్ కోసం ఇంకా అడుగులు వేస్తున్న సమయమది. 1988లో అప్పటిదాకా చేసిన 9 చిత్రాల్లో విక్రమ్ తో పాటు మజ్ను, కలెక్టర్ గారి అబ్బాయి, కిరాయిదాదాలు మాత్రమే కమర్షియల్ గా మంచి విజయం సొంతం చేసుకున్నాయి. ఆ టైంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ముందు ఆఖరి పోరాటం నవలను సినిమాగా తీద్దామనే ప్రతిపాదన ఉంచారు నిర్మాత అశ్వినిదత్. సబ్జెక్టు భారీ బడ్జెట్ ని డిమాండ్ చేస్తుందన్న ఆలోచనను రానివ్వద్దంటూ జంధ్యాల గారితో కలిసి స్క్రిప్ట్ ని సిద్ధం చేయించారు. అప్పటికే నాగార్జున డేట్లు దత్తు గారి వద్ద ఉన్నాయి.

మూఢభక్తిని పెంపొందించి తనను తాను దైవాంశసంభూతుడిగా చెప్పుకుని లక్షలాది అమాయక భక్తుల విశ్వాసాన్ని వాడుకుని బయటికి కనిపించని ఓ అరాచక శక్తిగా మారతాడు అనంతానంతస్వామి(అమ్రిష్ పూరి). అతని ఆట కట్టించేందుకు నడుం బిగించిన సిసిఐ ఆఫీసర్ ప్రవల్లిక(శ్రీదేవి)కు అండగా నిలబడతాడు విహారి(నాగార్జున). ఇద్దరూ కలిసి చేసిన పోరాటంలో గెలుపు ఎలా దక్కించుకున్నారు అనేదే ఇందులో మెయిన్ పాయింట్. నవలగా చాలా నిడివి ఉన్న ఈ కథాంశాన్ని సినిమాకు తగ్గట్టు కుదించి పాటలు లాంటి కమర్షియల్ అంశాలు జోడించేందుకు పెద్ద కసరత్తే జరిగింది.

నాన్న ఏఎన్ఆర్ కు జోడిగా నటించిన శ్రీదేవి తనపక్కన డాన్స్ చేస్తే అభిమానులు మెచ్చుతారా అనే సంశయం నాగార్జునలో తొలుత ఉంది. కానీ కథ ప్రకారం ఈ ఇద్దరికీ పాటలు ఉంటాయి తప్ప ఎక్కడా గొప్ప ప్రేమికులుగా చూపమని రాఘవేంద్రరావు సర్దిచెప్పారు. అంతేకాదు క్లైమాక్స్ లో ఎలాగూ శ్రీదేవి పాత్ర చనిపోయి హీరో సుహాసినిని చేసుకుంటాడు కాబట్టి ఇంకేం ఆలోచించనక్కర్లేదని క్లారిటీ ఇవ్వడంతో మబ్బులు వీడిపోయాయి. ఖర్చుకు నెరవకుండా దత్తు అప్పటిదాకా తన బ్యానర్ లో దేనికీ పెట్టనంత బడ్జెట్ ఆఖరి పోరాటంకు కేటాయించారు. ఇళయరాజా యాక్షన్ డ్రామాకు సైతం అద్భుతమైన పాటలు ఇచ్చారు.


1988 మార్చి 12న విడుదలైన ఆఖరి పోరాటం నాగ్ కోరుకున్న ఘనవిజయాన్ని అందుకుంది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా నవలలోని ఒరిజినాలిటి తగ్గకుండా దర్శకేంద్రుడు తీర్చిదిద్దిన తీరుకి గట్టి వసూళ్లు వచ్చాయి. ఇళయరాజా సాంగ్స్ ఆడియో పరంగానే కాక తెరమీద కూడా కలర్ ఫుల్ గా వచ్చాయి. లతా మంగేష్కర్ బాలుతో పాడిన తెల్లతీరకు తకధిమి పాటకు మ్యూజిక్ లవర్స్ పరవశించిపోయారు. స్వామిజిగా విశ్వరూపం చూపించిన అమ్రిష్ పూరికి ఆఫర్స్ క్యూ కట్టాయి కానీ అప్పటికే బాలీవుడ్ లో టాప్ ఆర్టిస్ట్ గా ఉన్న ఆయన ఎక్కువ సినిమాలు చేయలేకపోయారు. ఆఖరి పోరాటం శతనోత్సవం జరుపుకుంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp