గుండ‌మ్మ క‌థ‌కి 59 ఏళ్లు - Nostalgia

By G.R Maharshi Jun. 08, 2021, 08:30 pm IST
గుండ‌మ్మ క‌థ‌కి 59 ఏళ్లు - Nostalgia

గుండ‌మ్మ క‌థ‌కి 59 ఏళ్లు. జూన్ 7, 1962లో రిలీజ్ అయింది. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా త‌క్కువే. నేను పుట్ట‌క ముందే వ‌చ్చింది కాబ‌ట్టి , నాకు ఊహ వ‌చ్చేస‌రికి దీని గురించి పెద్ద‌వాళ్లు చెప్పి న‌వ్వుకునే వాళ్లు. మా అవ్వ ద‌గ్గ‌ర సాయంత్రం క‌బుర్లు చెప్పే ఆడ‌వాళ్లు, అక్క‌డ లేనివారి గురించి "అది గుండ‌మ్మ క‌థ‌లో సూర్య‌కాంతం క‌దా" అనేవాళ్లు. రోజూ క‌లిసే ఆరుగురిలో అంద‌రూ ఇంకోరి దృష్టిలో గుండ‌మ్మ‌లే.

రేడియోలో గుండ‌మ్మ క‌థ‌. పాట‌లు రెగ్యుల‌ర్‌గా వ‌చ్చేవి. "అయినా మ‌నిషి మార‌లేదు" అంటే అర్థ‌మ‌య్యేది కాదు. మ‌నిషి అర్థం కావాలంటే చాలా దూరం ప్ర‌యాణించాలి. మ‌నిషి మార‌డం కేవ‌లం క‌వి అత్యాశ‌. నేను నాల్గో త‌ర‌గ‌తిలో వుండ‌గా రాయ‌దుర్గం నూర్ టూరింగ్ టాకీస్‌కి వ‌చ్చింది. అదో టెంట్‌. వాన వ‌స్తే జ‌నాల్ని త‌డిపేది. గాలి వ‌స్తే జ‌డిపించేది. ఫ్యాన్లు తాగుబోతుల్లా ఊగుతూ "కియ్యో కిక్కు" అని అరిచేవి. నేల‌లో దోమ‌లు, చీమ‌లు, బెంచీలో న‌ల్లులు, ప్రేక్ష‌కుల కోసం ఎదురు చూసేవి. కుర్చీలో ఇవేమీ ఉండ‌వు. ప్ర‌త్యేక‌మైన చీల‌లు ర‌హ‌స్యంగా వుండేవి. షో అయిపోగానే ఎవ‌డో ఒక‌డి అంగీ లేదా ప్యాంట్ ప‌ర్రుమ‌ని సౌండ్ వచ్చేది.

గుండ‌మ్మ క‌థ‌ని ఇక్క‌డ చూశాను. NTR వ‌స్తే న‌వ్విన‌వ్వి దొర్లిదొర్లి ఎవ‌డి మీదో ప‌డేవాన్ని. చివ‌ర్లో రాజ‌నాల‌ని తంతూ వుంటే , బెంచి మీద నుంచి ఉత్సాహంతో కింద‌ప‌డ్డాను. ANR , జ‌మున ల‌వ్ ఇవేమీ ఎక్క‌లేదు. NTR, సూర్య‌కాంతం , ర‌మ‌ణారెడ్డి కామెడీ , సావిత్రిని చూస్తే బాధ‌. తెల్లారి స్కూలంతా క‌థ చెబితే, నువ్వు ఇపుడు చూశావా, మేము ఎపుడో చూశాం అని పెద్ద పిల్ల‌లు ఎక్కిరించారు.

చిన్న‌ప్పుడు కామెడీనే అర్థ‌మైంది. కొంచెం పెరిగిన త‌ర్వాత మాన‌వ స్వ‌భావాలు అర్థ‌మ‌య్యాయి. చూసే దృష్టి మారింది. సూర్య‌కాంతాలు మార‌లేదు. ఇంకా బోలెడు మంది ఉన్నారు. తామే సూర్య‌కాంత‌మ‌ని వాళ్ల‌కి తెలియ‌దు. అదే విచిత్రం. సూర్య‌కాంతం గొప్ప‌త‌నం ఏమంటే ఇన్నేళ్ల‌లో నాకు తెలిసిన ఏ ఇంట్లోనూ ఆ పేరు లేదు.

ఆ రోజుల్లో సినిమాలు చూసి సినిమాలు తీసే అవ‌కాశం లేదు. అందుకే సాహిత్యాన్ని బాగా చ‌దివే వాళ్లు. గుండ‌మ్మ క‌థ ఒరిజిన‌ల్ క‌న్న‌డ సినిమా అయినా అది చ‌క్ర‌పాణికి న‌చ్చ‌లేదు. షేక్‌స్పియ‌ర్ నాట‌కం (టేమింగ్ ఆఫ్ ది ష్రూ) ప్రేర‌ణ‌తో స్క్రిప్ట్ మార్చేశాడు. తొలుత అనుకున్న డైరెక్ట‌ర్ పుల్ల‌య్య‌, ఆ త‌ర్వాత క‌మ‌లాక‌ర కామేశ్వ‌ర‌రావు వ‌చ్చాడు.

జ‌మున , ఎల్‌.విజ‌య‌ల‌క్ష్మి త‌ప్ప దీంట్లో న‌టించిన వాళ్లు బ‌తికిలేరు. జ‌మున హైదరాబాద్‌లో ఉన్నారు. ఎల్‌.విజ‌య‌ల‌క్ష్మి కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉన్నారు. ఆమె న‌ట‌న మానిన త‌ర్వాత బాగా చ‌దువుకుని అమెరికాలో పెద్ద ఉద్యోగం చేశారు. అమెరికాలోని మ‌న తెలుగు వాళ్లు విజ‌య‌ల‌క్ష్మిని అప్పుడ‌ప్పుడు క‌లుస్తూ వుంటారు. కానీ సినిమా గురించి మాట్లాడ్డానికి ఆమె ఇష్ట‌ప‌డ‌ర‌ట‌.

గుండ‌మ్మ క‌థ‌కి చాలా ఆటంకాలు వ‌చ్చాయి. అందరూ బిజీ న‌టులు కావ‌డంతో డేట్స్ కుద‌ర‌క షూటింగ్ ఆల‌స్య‌మైంది. ఫ‌స్ట్ కాపీ చూసి కేవీ. రెడ్డి ఇదేం సినిమా, ఆడ‌దు అన్నారు. విజ‌య‌వాడ‌లో వీఐపీల‌కి ప్రివ్యూ వేస్తే పెద‌వి విరిచారు. ఈ విష‌యం చ‌క్ర‌పాణికి ఒక డిస్ట్రిబ్యూట‌ర్ చెబితే "ఫ్రీ పాసుల వాళ్లు మ‌న‌కెందుకు, నేల టికెట్‌లో కూచొని వాళ్లు ఏమంటారో అది చెప్పు" అన్నాడ‌ట‌. నేల క్లాస్ వాళ్లే కాదు, క్లాస్ వాళ్లు కూడా ఇంకా న‌వ్వుతూనే వున్నారు.
దీన్ని రీమేక్ చేయ‌డం ఎవ‌రి వ‌ల్లా కాలేదు. సూర్య‌కాంతం మ‌ళ్లీ పుడితే త‌ప్ప సాధ్యం కాదు.

ఈ సినిమాని చిన్న‌ప్పుడు NTR కోసం చూశాను. పెద్దైన త‌ర్వాత నాకు తెలిసిన వాళ్ల‌ని ఆ పాత్ర‌ల్లో వెతుక్కోవ‌డం కోసం చూ శాను. గుండ‌మ్మ క‌థ‌లాగా జీవితంలో నాట‌కీయ ముగింపులుండ‌వు. గుండ‌మ్మకి బుద్ధి చెప్ప‌డం అసాధ్యం. కంచు గంట‌య్య‌ని (ర‌మ‌ణారెడ్డి) ఎదుర్కోవ‌డం మ‌రీ క‌ష్టం.

ఇన్నేళ్ల త‌ర్వాత కూడా ఈ సినిమా ఎందుకు బావుంటుందంటే మ‌నిషి ఏమీ మార‌లేదు కాబ‌ట్టి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp