ప్రేమ చేసిన కనకాభిషేకం - దాసరి దృశ్యకావ్యం - Nostalgia

By Ravindra Siraj Feb. 18, 2021, 03:46 pm IST
ప్రేమ చేసిన కనకాభిషేకం - దాసరి దృశ్యకావ్యం - Nostalgia

తొలిపునాది

1980 .......

అక్కినేని నాగేశ్వరరావు గారు తన కలలను పేర్చి సంపాదనను ఇటుకలుగా మార్చి ఎంతో ప్రతిష్టాత్మకంగా కట్టిన అన్నపూర్ణ స్టూడియోస్ అప్పటికే నాలుగో వార్షికోత్సవంలో అడుగు పెట్టింది. భార్య పేరు మీద మొదలుపెట్టినది కావడంతో తన స్థాయిని మరింత ఉన్నతంగా పెంచి తెలుగు సినీకళామతల్లి సేవలో తనవంతు బాధ్యతను నెరవేరుస్తూనే ఆదాయాన్ని తెచ్చిపెడుతుందనే నమ్మకంతో ఉంటూ వచ్చారు. ఒకవేళ ఇది తలకెత్తుకోకుండా కేవలం సినిమాల్లో నటించేందుకు మాత్రమే పరిమితమై ఉంటే ఈ టెన్షన్ ఉండేది కాదు. కానీ అక్కడ ఉన్నది ఏఎన్ఆర్. అలా ఆలోచిస్తే మిగిలినవాళ్లకు ఆయనకు తేడా ఏముంటుంది. అందుకే ఆందోళన చెందలేదు.

ఈ నాలుగేళ్ల కాలంలో స్టూడియో మొదలైన తక్కువ సమయంలోనే విబి రాజేంద్రప్రసాద్ తో కలిసి భాగస్వామిగా ఎన్టీఆర్ తను హీరోలుగా 'రామకృష్ణులు' లాంటి మల్టీ స్టారర్ ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. కానీ ఫలితం దక్కలేదు. కళ్యాణి, పిల్ల జమీందార్ లు కూడా నిరాశపరిచాయి. ఇంకో రెండు పెద్దగా ఆడలేదు. ఈ ఆలోచనలతో భవిష్యత్తు గురించి ప్రణాళిక వేసుకుంటుండగా కాశ్మీర్ లో 'శ్రీవారి ముచ్చట్లు' షూటింగ్ లో ఉన్నారు అక్కినేని. దాసరి నారాయణరావు దర్శకులు. ఈ ఇద్దరి కాంబోలో నాలుగు సినిమాలు వచ్చాయి. కానీ ఇండస్ట్రీ హిట్ సాధ్యపడలేదు. అప్పుడే దాసరి మనసులో ప్రేమాభిషేకం కథ తట్టింది. వెంటనే ఏఎన్ఆర్ తో షేర్ చేసుకున్నారు.

సంచలనానికి శ్రీకారం

మాములుగా హీరో హీరోయిన్ ప్రేమకథలకు ఎవరో ఒకరు విలన్ గా అడ్డుపడతారు. అలా కాకుండా అమ్మాయి మనసు గెలుచుకున్నాక కూడా కథానాయకుడు ఒక వ్యాధి వల్ల తన ప్రేమను త్యాగం చేయాల్సి వస్తే అనే పాయింట్ మీద బ్రహ్మాండమైన లైన్ సిద్ధం చేశారు దాసరి. వినగానే అక్కినేని నచ్చేసింది. కొన్ని సందేహాలు వెలిబుచ్చినా అవన్నీ చర్చల దశలోనే క్లియర్ అయ్యాయి. 57 ఏళ్ళ వయసులో తనను లవర్ బాయ్ గా ప్రేక్షకులు చూస్తారా అనే అనుమానం ఏఎన్ఆర్ కు కానీ దాసరికి గాని వీసమెత్తు కూడా రాలేదు. ఎందుకంటే ఆ ఇద్దరూ సబ్జెక్టును నమ్మారు. అన్నపూర్ణమ్మ గారు కూడా ఇది ఆడుతుందనే భరోసా ఇవ్వడంతో మబ్బులు తొలగిపోయాయి. ఆవిడ ఇదే తరహాలో 'ప్రేమనగర్'కు చెప్పిన జోస్యం నిజమై అది రామానాయుడు స్టూడియోస్ ని నిలబెట్టింది.

అలా ఒక చరిత్రకు శ్రీకారం ప్రేమాభిషేకం షూటింగ్ రూపంలో సెప్టెంబర్ 20న ఏఎన్ఆర్ జన్మదినం నాడు చుట్టబడింది. హైదరాబాద్, చెన్నై తదితర లొకేషన్లలో ఎక్కువ జాప్యం లేకుండా ఆర్టిస్టుల సహకారంతో దాసరి చకచకా పూర్తి చేశారు. హీరోయిన్ గా శ్రీదేవిను ముందే ఫిక్స్ చేసుకున్నారు. తక్కువ నిడివే అయినా చాలా కీలకమైన వేశ్య పాత్రను మొహమాటంగానే జయసుధను అడిగితే ఇది దాసరి గారి సినిమా కాబట్టి ఒక్క క్షణం ఆలోచించకుండా ఎస్ చెప్పేశారు. మురళీమోహన్, మోహన్ బాబు, నిర్మలమ్మ, గుమ్మడి, ప్రభాకర్ రెడ్డి, కవిత, పద్మనాభం, ఈశ్వరరావు, రాజా, పుష్పలత, మాడా, ముక్కామల, మాస్టర్ హరీష్ తదితరులు ఇతర తారాగణం.

సంగీత సంచలనం

సంగీత దర్శకులు చక్రవర్తి గారికి దాసరి ఎక్కువ సమయం ఇవ్వలేదు. ఒకరకంగా చెప్పాలంటే విపరీతమైన పని ఒత్తిడిలో ఉన్న ఆయనను బెస్ట్ ఆల్బమ్ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టి మరీ అడ్వాన్స్ ఇప్పించారు. ఓ రోజు అన్నపూర్ణ స్టూడియోస్ ప్రాంగణంలోనే అక్కినేని దంపతుల ఆధ్వర్యంలో రాత్రంతా నైట్ అవుట్ చేసి నాలుగు పాటలు ఓకే చేయించుకున్నారు చక్రవర్తి. మొత్తం 13 పాటలు రికార్డు చేస్తే ఫైనల్ గా 7 ఓకే అయ్యాయి. జీవితాన్ని చూడు రంగు రంగుల అద్దంలో అనే సాంగ్ ఎల్పి రికార్డులు, ఆడియో క్యాసెట్లలో ఉన్నప్పటికీ నిడివి దృష్ట్యా అవసరం లేదనిపించడంతో దాన్ని చిత్రీకరించలేదు. కానీ గ్రామ్ ఫోన్ రికార్డులు, టేప్ రికార్డర్లు ఎక్కడ విన్నా ఇవే పాటలు నెలల తరబడి మారుమ్రోగుతోనే ఉన్నాయి

1981 సంవత్సరం - ఒక చరిత్ర

అప్పటికే సంక్రాంతికి వచ్చిన ఏఎన్ఆర్ మరోసినిమా 'శ్రీవారి ముచ్చట్లు' సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. 'ఆకలి రాజ్యం'ని యూత్ విపరీతంగా చూస్తున్నారు. కృష్ణ 'ఊరికి మొనగాడు' బ్లాక్ బస్టర్ వసూళ్లతో రచ్చ చేస్తోంది. జనవరి ఆఖరున వచ్చిన ఎన్టీఆర్ 'గజదొంగ' వీరవిహారం గురించి మీడియాలో బోల్డు కథనాలు వస్తున్నాయి. ఇవన్నీ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న సమయంలోనే ;ప్రేమాభిషేకం'ని అది కూడా కొంచెం డ్రై అనిపించే ఫిబ్రవరిలో రిలీజ్ ప్రకటించడం ఫాన్స్ ని కొంత టెన్షన్ కి గురి చేసిన మాట వాస్తవం. అప్పటికే దీని పాటలు మారుమ్రోగిపోతున్నాయి. సరైన టైంలో వస్తే అద్భుతాలు చేస్తుందని వాళ్ళ నమ్మకం. అయితే దాసరి ఇవేవి ఆలోచించలేదు. ప్రేమాభిషేకం కోటి రూపాయలు వసూలు చేస్తుందని ముందే చెప్పేశారు.

ఫిబ్రవరి 18

ఆంధ్రప్రదేశ్(అప్పటి ఉమ్మడి రాష్ట్రం)మొత్తం ప్రేమాభిషేకం భారీ ఎత్తున విడుదలయ్యింది. ఓపెనింగ్స్ ముందే ఊహించినట్టు భారీగా వచ్చాయి. భగ్న ప్రేమికుడి పాత్రలో అక్కినేనిని అప్పటికే దేవదాస్, ప్రేమనగర్ లాంటి ఎన్నో సినిమాల్లో చూసిన ఆడియన్స్ కి ఇందులో ఏఎన్ఆర్ సరికొత్తగా కనిపించాడు. చలాకీగా, శ్రీదేవి ప్రేమను గెలుచుకోవడం కోసం అతను పడే అగచాట్లు. వేసే ఎత్తులను విపరీతంగా ఎంజాయ్ చేశారు. తన వ్యాధి గురించి తెలిశాక తన వల్ల శ్రీదేవి జీవితం నాశనం కాకూడదని తపించిపోయే రాజేష్ గా ఆయన నటనకు కన్నీళ్లు పెట్టుకున్నారు. సాధారణంగా పాటల కోసం బయటికి వచ్చే సిగరెట్ రాయుళ్లు కూడా కుర్చీలకు అతుక్కుపోవడంతో క్యాంటీన్ కుర్రాళ్ళు బొమ్మ నడుస్తుండగానే స్నాక్స్, బీడీలు. సోడాలు అమ్మడానికి లోపలికి వచ్చేవాళ్ళు. ఇంటర్వెల్ లో మాత్రమే బయట సందడి కనిపించేది.

రికార్డులతో హోరెత్తిన థియేటర్లు

మొదట ఆట పూర్తి కాగానే రిపోర్ట్ బయటికి వచ్చేసింది. వసూళ్లతో గల్లా పెట్టెలు నిండిపోయి నోట్లను, చిల్లరను లెక్కపెట్టేందుకు అదనంగా మనుషులు అవసరమవుతారని థియేటర్ యజమానులకు అర్థమైపోయింది. హౌస్ ఫుల్ బోర్డు తీసే అవసరం నాలుగైదు నెలల దాకా కనిపించలేదు. రికార్డుల సునామి మొదలయ్యింది. టికెట్లు దొరకడం గగనమైపోయింది. కొన్ని చోట్ల ప్రభుత్వ ఆఫీసుల్లో లంచాలకు బదులు ఉద్యోగుల ఫ్యామిలీకి ప్రేమాభిషేకం టికెట్లను ఇవ్వడం అతిశయోక్తి కాదు. ఏ హాలు చూసినా జనమే జనం. రద్దీ ఎప్పుడు తగ్గుతుందో ఎవరికీ అంతుచిక్కడం లేదు. దీని పుణ్యమాని అప్పటికే పోటీలో ఉన్న పటాలం పాండు, నా మొగుడు బ్రహ్మచారి, తోడుదొంగలు, తొలికోడి కూసింది లాంటి సినిమాలకు కలెక్షన్లు పెరిగాయి.

రికార్డుల గురించి నెలల తరబడి మాట్లాడుకుని పోట్లాడుకున్నారు డిస్ట్రిబ్యూటర్లు. దీని వచ్చిన షేర్లు గ్రాస్ లెక్కల గురించి ఇతర హీరోల ఫ్యాన్స్ తో అక్కినేని అభిమానులు చేసుకున్న వాగ్వాదాలు సవాళ్లు ఎన్నో. 'అడవిరాముడు' రేంజ్ కు వెళ్తుందనుకున్న గజదొంగ ప్రేమాభిషేకం కారణంగానే కొంత తగ్గిందని అప్పట్లో మాట్లాడుకునేవారు. ప్రేమాభిషేకం 32 కేంద్రాల్లో రిలీజ్ చేస్తే రెండు మినహాయించి అన్ని చోట్లా వంద రోజుల ఉత్సవం జరుపుకుంది. 29 కేంద్రాల్లో రజతోత్సవం జరుపుకోవడం చూసి నేషనల్ మీడియా సైతం నోరెళ్ళబెట్టింది. 10 సెంటర్ల 300 రోజులు ఆడుతూనే ఉంది. ఏకంగా 8 కేంద్రాల్లో ఏడాది ఆడటం బట్టి చూస్తే ఈ సినిమాని జనం ఎంత ఎగబడి చూశారో అర్థమవుతుంది. 2 కేంద్రాల్లో షిఫ్టింగ్ కలుపుకుని మార్నింగ్ షోలతో 75 వారాలు ప్లాటినం జూబ్లీ నడవడం ఒక చరిత్ర.

అంత గొప్ప కథా

ప్రేమాభిషేకంలో ఎప్పుడూ చూడని సరికొత్త కథేమీ ఉండదు. ఆ మాటకొస్తే అక్కినేని గత సినిమాల ఛాయలు చాలానే కనిపిస్తాయి. మరి ఎందుకు దీనికి ఇంత బ్రహ్మరథం దక్కిందనే ప్రశ్నకు సులభంగా సమాధానం చెప్పడం కష్టం. అనుభవజ్ఞులైన తారాగణం, ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ చెవులు తహతహలాడే పాటలు, వాటికి తెరమీద కాసులు విసరాలనిపించే స్టెప్పులు వెరసి టైటిల్ లో అభిషేకం డబ్బుల రూపంలో ఇటు నిర్మాతకు అటు బయ్యర్లకు కురిపిస్తూనే ఉంది. దీన్నే తమిళ్ లో కమల్ హాసన్ తో 'వాల్వే మాయం'గా, హిందీలో జితేంద్రతో 'ప్రేమ్ తపస్య'గా రీమేక్ చేస్తే అక్కడ కనీసం యాభై రోజులు కూడా ఆడలేదు. దీన్ని బట్టే ఏఎన్ఆర్ ని దాసరి చూపించిన తీరు, చక్రవర్తి నుంచి రాబట్టుకున్న పాటలు. శ్రీదేవి-జయసుధల కాంబినేషన్ ఎంత గొప్పగా విజయంలో కీలక పాత్ర వహించిందో అర్థం చేసుకోవచ్చు. దీని దెబ్బకే ఇతర దర్శక నిర్మాతలు అక్కినేనితో లవ్ బాయ్ కథలతో ఆయన ఇంటి ముందు క్యూ కట్టారు.

చివరి మాట

1981లో ప్రేమాభిషేకం రిలీజయ్యాక అదే ఏడాది ఎన్నో సూపర్ హిట్లు బాక్సాఫీస్ వద్ద నమోదయ్యాయి. ఇల్లాలు, దీపారాధన, ఎర్రమల్లెలు, రామదండు, న్యాయం కావాలి, విశ్వరూపం, సీతాకోకచిలుక, అమావాస్య చంద్రుడు, ఘరానా గంగులు, ముద్దమందారం, చట్టానికి కళ్ళు లేవు, సిసింద్రీ చిట్టిబాబు, సత్యం శివమ్, కిరాయి రౌడీలు లాంటి చాలా సక్సెస్ ఫుల్ చిత్రాలు వచ్చినప్పటికీ ఏవీ కూడా ప్రేమాభిషేకం రన్ మీద ప్రభావం చూపించలేకపోయాయి. ఏళ్ళ తరబడి రికార్డులు భద్రంగా ఉండిపోయాయి. మళ్ళీ 'మంగమ్మ గారి మనవడు' వచ్చేదాకా ప్రేమాభిషేకం మీద ఉన్న 525 రోజుల రికార్డు రన్ చెక్కుచెదరకుండా ఉండిపోయింది.

ఇంతగా చరిత్రలో నిలిచిపోయిన ఈ సినిమా అన్నపూర్ణమ్మ గారు అన్నట్టుగా స్టూడియోను పూర్తిగా నష్టాల నుంచి బయటపడేసింది. వ్యాపార లావాదేవీలు ఊపందుకున్నాయి. ఏఎన్ఆర్ చరిష్మాలోని మేజిక్ ని మరోసారి ఋజువు చేసిన సినిమాగా అభిమానులకో మర్చిపోలేని జ్ఞాపకంగా మిగిలిపోయింది. విక్రమ్, శివ, నిన్నే పెళ్లాడతా, సత్యం ఇలా అన్నపూర్ణ విజయాల ప్రవాహం అలా దశాబ్దాల తరబడి కొనసాగుతూనే ఉండిపోయింది. అందుకే 40 ఏళ్ళు అవుతున్నా ప్రేమాభిషేకం తాలూకు వైబ్రేషన్స్ ఇంకా టికెట్ కౌంటర్ల దగ్గర వినిపిస్తూనే ఉంటాయి

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp