ఫ్యామిలీ సినిమాలో మాస్ హీరోయిజం - Nostalgia

By iDream Post May. 09, 2021, 09:02 pm IST
ఫ్యామిలీ సినిమాలో మాస్ హీరోయిజం - Nostalgia

ఫ్యామిలీ సినిమాలో మాస్ అంశాలను జొప్పించగలమా. అదంత సులభమా. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టం. ఎందుకంటే కుటుంబకథా చిత్రాల్లో వాస్తవికత ఎక్కువగా ఉంటుంది. డ్రామా పండాలి. దానికి తగ్గట్టే సహజసిద్ధమైన నటీనటుల పెర్ఫార్మన్స్ కుదరాలి. అయితే వీటికి మాస్ నుంచి స్పందన ఉంటుంది కానీ అన్ని వర్గాల ఆదరణ దక్కుతుందనే గ్యారెంటీ లేదు.అందులోనూ చిరంజీవి లాంటి మెగాస్టార్ తో ఈ సాహసం చేయడం సాధ్యమా. కానీ దర్శకుడు విజయబాపినీడు దానికి పూనుకోవడం ఒక చరిత్రకు దారి తీసింది. ఆయన మస్తిష్కంలో పుట్టిన ఓ ఆలోచన కనివిని ఎరుగని వసూళ్ల సునామికి దారి తీసింది. అదెలాగో చూద్దాం.

1990. విజయబాపినీడు అప్పటికే చిరంజీవితో మంచి హిట్లు తీసి ఉన్నారు. మగమహారాజు, మగధీరుడు, ఖైదీ నెంబర్ 786, మహానగరంలో మాయగాడు, హీరో ఈ కాంబినేషన్లో వచ్చాయి, వీళ్లిద్దరి మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఉండేది. ఆ కారణంగానే ఏ హీరోకు సాధ్యం కాని రీతిలో చిరంజీవి పేరుతో ఆయిల్ ప్రింట్ మ్యాగజైన్ ని 10 రూపాయల ధరతో విజయబాపినీడు నడిపించినప్పుడు అందరూ షాక్ తిన్నారు. అప్పటికి చాలా డిమాండ్ ఉన్న సినిమా పత్రిక ధర అయిదు రూపాయల లోపే. అయినా కూడా అభిమానులు అంత రేటా అని వెనుకడుగు వేయలేదు. హాట్ కేకుల్లా ఎగబడి ఆ పత్రికను కొనేవారు. ఇతర సంపాదకులు, జర్నలిస్టులు ఇలా చిరంజీవి ప్రత్యేకమైన స్టిల్స్ అన్నీ మీరే వాడుకోవడం బాలేదని అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు ఇతరత్రా సమస్యల కారణంగా 1994లో దాన్ని ఆపేశారు బాపినీడు. మళ్ళీ కొంచెం వెనక్కు వెళదాం.

నాగబాబుని రాక్షసుడు సినిమాలో సైడ్ హీరోగా పరిచయం చేశాక ఇతన్ని ఎలాగైనా సోలోగా సెటిల్ చేయాలని కొందరు దర్శకులు గట్టిగానే ప్రయతించారు. మంచి మాస్ ఇమేజ్ వస్తే తమ్ముడు కూడా ఇండస్ట్రీలో స్థిరపడి పోతాడని చిరు ప్లాన్. కానీ అప్పటిదాకా చేసినవి పెద్దగా గుర్తింపు ఇవ్వలేదు. ఆ టైంలో విజయబాపినీడు గారు అరె ఓ సాంబ పేరుతో ఓ కథను సిద్ధం చేసుకుని నాగబాబు హీరోగా తీయాలని ప్లాన్ చేసుకున్నారు. ఈలోగా చిరంజీవి తన కాల్ షీట్స్ ఉన్నాయని జగదేకవీరుడు అతిలోకసుందరి షూటింగ్ లో ఉన్నప్పుడు బాపినీడు గారికి కబురు పెట్టారు. చేతిలో ఉన్న స్క్రిప్ట్ నాగబాబు కంటే చిరంజీవికే అద్భుతంగా సెట్ అవుతుందని పరుచూరి బ్రదర్స్ అభిప్రాయపడటంతో ఇది కాస్తా మెగాస్టార్ చెంత చేరింది. అలా దీనికి శ్రీకారం చుట్టారు. స్టేట్ రౌడీ లాంటి టెర్రఫిక్ ఆల్బమ్ ఇచ్చిన బప్పీలహరి సంగీత దర్శకుడిగా మ్యూజిక్ సిటింగ్స్ చేశారు.

విజయశాంతిని హీరోయిన్ గా తీసుకుని మెయిల్ విలన్ గా రావు గోపాల్ రావు ఆయన తమ్ముడిగా ఆనంద్ రాజ్ ని ఎంపిక చేసుకున్నారు. ఆర్టిస్టులు రొటీన్ గా కనిపించకూడదన్న ఉద్దేశంతో కీలకమైన పాత్రలకు వల్లభనేని జనార్దన్, శరత్ కుమార్, సుమలతలను ఎంపిక చేసుకోవడం అద్భుత ఫలితాన్ని ఇచ్చింది. చిరంజీవి నిజ జీవిత స్నేహితులు నారాయణరావు, హరిబాబు ఫ్రెండ్స్ గ్యాంగ్ లో చేరారు. చిరంజీవి కాస్ట్యూమ్స్ మీద బాపినీడు ప్రత్యేక శ్రద్ధ వహించారు. అప్పటిదాకా రాని డిఫరెంట్ స్టయిలింగ్ లో కనిపించాలన్న ఆయన ఆలోచనకు తగ్గట్టే చాలా ట్రెండీగా వేసుకున్న మెగాస్టార్ డ్రెస్సులు చాలా కాలం పాటు టెక్స్ టైల్ షో రూమ్స్ లో సేల్స్ పెంచాయి. లహరి ద్వారా విడుదలైన ఆడియో క్యాసెట్లు ముందే సంచలనానికి తెరతీశాయి. ఎక్కడ విన్నా ఇవే పాటలు

1991. మే 9. స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్ డిజాస్టర్ ప్రభావం గ్యాంగ్ లీడర్ బిజినెస్ మీద ఏ మాత్రం పడలేదు. ఎందుకంటే అప్పటికే శిఖరం లాంటి చిరు ఇమేజ్ ముందు బయ్యర్లు దేన్నీ లెక్క చేసే పరిస్థితిలో లేరు. ఏరియాలు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. విడుదల రోజు ఎక్కడ చూసినా జనంతో ఒకటే తొక్కిడి. క్రాస్ రోడ్స్ సుదర్శన్ 70 ఎంఎం థియేటర్ నుంచి బయటికి వచ్చిన అభిమానులు ఆనందం పట్టలేకపోతున్నారు. లెక్కలేనన్నిసార్లు మళ్ళీ మళ్ళీ చూడాలని డిసైడ్ అయిపోయారు. బ్లాక్ టికెట్ రాయుళ్ల పంట పండింది. స్టేట్ మొత్తం ఒకటే రిపోర్ట్. యునానిమస్ బ్లాక్ బస్టర్ అంతే. థియేటర్లు కిక్కిరిసిపోతున్నాయి. మూడో రోజే పైరసీ వీడియో క్యాసెట్ వచ్చినప్పటికీ దాని ప్రభావం సున్నా. ఫ్యామిలీలు హాళ్లకు పోటెత్తాయి.

ఓ మధ్య తరగతి కుటుంబంలో పెద్దగా బాధ్యత లేకుండా తిరిగే ఓ యువకుడు అన్నయ్య, స్నేహితుల హత్యలకు ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు స్వంత మనుషుల్లో రేగిన అపార్థాలను తొలగించే బాధ్యతలు తీసుకుని చివరిగా విజేతగా నిలిచిన తీరు ప్రేక్షకులను కట్టి పారేసింది. ఎక్కువ తక్కువ అంటూ రావు గోపాల్ రావు తో పలికించిన వెరైటీ సంభాషణలు ఓ రేంజ్ లో పేలాయి. ప్రభుదేవా, తార కంపోజ్ చేసిన స్టెప్పులకు కుర్చీలలోనే గెంతులు వేసిన ఫ్యాన్స్ ఎందరో. చిరిగిన చొక్కాలు టికెట్ కౌంటర్ల దగ్గర, సీట్ల మధ్యలో థియేటర్ సిబ్బందికి కనిపించడం రివాజుగా మారింది. అలా మొదలైన ప్రభంజనం డైరెక్ట్ గా డైరెక్ట్, షిఫ్టింగ్, లేట్ రిలీజ్ కలిపి సుమారు 55 కేంద్రాల్లో వంద రోజుల పాటు నిర్విరామంగా కొనసాగింది. థియేట్రికల్ రన్ పూర్తయ్యాక కిరణ్ కంపెనీ రిలీజ్ చేసిన ఒరిజినల్ వీడియో క్యాసెట్లు ఏ రేంజ్ లో అమ్ముడుపోయాయంటే వాటిని అద్దెలకు ఇచ్చి వేల రూపాయలు సంపాదించుకున్న షాపులు ఎన్నో

ఇక గ్యాంగ్ లీడర్ వంద రోజుల వేడుకలు కూడా ఒక చరిత్ర. కనివిని ఎరుగని రీతిలో ఒకేరోజు హెలికాప్టర్ ప్రయాణాన్ని ఉపయోగించి హైదరాబాద్, తిరుపతి, ఏలూరు, విజయవాడలో భారీ ఎత్తున ఫంక్షన్ చేయడం నభూతో నభవిష్యత్ అని చెప్పాలి. దీని షో రీల్ ని ప్రత్యేకంగా అప్పుల అప్పారావులో వాడుకుంటే అది చూసేందుకే ఆ సినిమాకు వెళ్లిన ఫ్యాన్స్ ఎందరో. ఆ ఫోటోలు, వీడియోలు ఇంటర్ నెట్ లేని కాలంలోనే ఒక సెన్సేషన్ గా నిలిచాయి. రీ రిలీజ్ లోనూ గ్యాంగ్ లీడర్ చాలా చోట్ల మొదటి వారం హౌస్ ఫుల్స్ నమోదు చేయడం ట్రేడ్ కు ఇప్పటికీ గుర్తే. దీన్ని మించిన బ్లాక్ బస్టర్లు చిరంజీవి చాలా చేశారు చూశారు కానీ రిపీట్ వేల్యూ ఉన్న పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా గ్యాంగ్ లీడర్ ఎప్పటికీ సింహాసనం మీద కూర్చునే ప్రత్యేక స్థానమే

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp