వందసార్లు చూస్తే ఒక్కసారి చూసినట్టు - Nostalgia

By Ravindra Siraj Apr. 07, 2021, 08:41 pm IST
వందసార్లు చూస్తే ఒక్కసారి చూసినట్టు - Nostalgia

(దశాబ్దాలు దాటుతున్నా ఇప్పటికీ హీరోయిజం డెఫినేషన్ కి మొదటి అర్థంలా కనిపించే బాషా సినిమా గురించి అప్పట్లో తొమ్మిదో తరిగతిలో ఉన్న ఓ అభిమాని జ్ఞాపకాల మాలిక)

టాన్డడ్డడ్డ టాన్ టాన్డడ్డడ్డ టాన్ టాన్డడ్డడ్డ టాన్ టాటాటాన్.........

నేను తొమ్మిదో తరగతి చదువుతున్న రోజుల్లో నన్ను చాలా కాలం పాటు వెంటాడిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇది. హీరో అంటే చిరంజీవి తప్ప ఇంకెవరు కాదనే నా నమ్మకానికి చిల్లు పెడుతూ మొదటిసారి రజనీకాంత్ అనే మేజిక్ ని నాకు పరిచయం చేసిన సినిమా బాషా. స్వతంత్రంగా థియేటర్ కు వెళ్లే ఆర్థిక బలం ప్లస్ నైతిక ధైర్యం లేని రోజుల్లో ఎవరైనా సినిమాకు పిలిస్తే చాలు పొలోమని ఎగురుకుంటూ వెళ్లే వయసు. నూనూగు మీసాలకు దగ్గరవుతున్నా ఎవరో ఒకరు తోడు లేనిదే ఒక్కణ్ణే హాలుకు వెళ్లడమంటే ఏదో దారుణమైన నేరంగా అమ్మానాన్నాలు భావించే టైం. 1995వ సంవత్సరం ఏప్రిల్ నెలలో ఒక రోజు.

పుట్టింది పెరిగింది చదువుకుంది అంతా ఆదోనిలోనే అయినా నా బాల్యం నుంచే కర్నూలుతో విడదీయరాని అనుబంధం. ఇప్పుడు ఉనికే లేక రూపు రేఖలు కోల్పోయి షాపింగ్ కాంప్లెక్సులు, మల్టీ ప్లెక్సులు, ఖాళీ స్ధలాలుగా మారిపోయిన వెరైటీ, నవరంగ్, అలంకార్, సాయిబాబా, నటరాజ్ థియేటర్ల సింగల్ స్క్రీన్లలో నాకు ముడిపడిన జ్ఞాపకాలు ఎన్నో. అటు వైపు వెళ్తున్నప్పుడంతా కొత్త బిల్డింగుల పునాదుల్లో కప్పబడిన కొన్ని లక్షల జ్ఞాపకాలు సజీవంగా కదలాడుతున్నట్టు ఉంటుంది. ఓసారి తవ్వితే ఎన్ని చిరునవ్వులు సినిమాలు చూసిన అనుభూతులను కళ్ళకు కట్టినట్టు వివరిస్తాయో అనిపిస్తుంది. అలాంటిదే నాకూ ఉంది.

తేదీ గుర్తు లేదు. మ్యాట్నీకు టైం అవుతోంది. ఆటోవాడు కృష్ణ స్టెప్పులాగా నెమ్మదిగా ఎగుడుదిగుడుగా వెళ్తున్నాడు. నా గుండె చప్పుడేమో యముడికి మొగుడులో చిరంజీవి డాన్సులాగా ఒకటే పరుగులు పెడుతోంది. చెవిలో జోరీగ లాగా నన్ను తీసుకెళ్తున్న మావయ్య అప్పటికే బాషాని అయిదారు సార్లు చూసేశాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ గురించి పదే పదే చెబుతూ బుర్ర తినేస్తున్నాడు. ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఆత్రం నన్ను సీట్లో కుదురుగా ఉండనివ్వడం లేదు. యాభై రోజులకు పైగా హౌస్ ఫుల్ కలెక్షన్లు వస్తునే ఉన్నాయని చెప్పి మరీ ఊరించడం చూసి ఇక ఆపేయ్ అని చెబుదామనుకున్నా టికెట్ స్పాన్సర్ ఆయనే కాబట్టి ఠాగూర్ లో చిరంజీవిలా మనసులోనే దిగమింగా.

అలా అనుకుంటుండగానే సాయిబాబా థియేటర్ వచ్చేసింది. మరీ కొట్టుకునేంత రష్ లేదు కానీ హాలు నిండేంత జనం అయితే కనిపిస్తున్నారు. ఈయన పలుకుబడికి బాల్కనీ టికెట్లు సులభంగా వచ్చేశాయి.లోపలికి వెళ్ళాం. ఇప్పుడు ఎక్కడా లేవు కానీ ఒకప్పుడు ఈ తరగతి అంటే అదో ప్రెస్టీజి. ఓ అంతస్తుకు పైగా మెట్లు ఎక్కి అక్కడి నుంచి సినిమా స్టార్ట్ కాక ముందు సెకండ్ థర్డ్ క్లాస్ జనాన్ని చూస్తే ఏదో రాజసింహాసనం మీద నుంచి నేను పాలిస్తుండగా కిందున్నవాళ్లంతా సైనికులన్న ఫీలింగ్ కలిగేది. ఇప్పుడు మేమున్న అపార్టుమెంట్ సెల్లార్ నుంచి రెండో అంతస్తు ఎత్తు అంత పైన ఉండేవి ఈ బాల్కనీలు.

షో మొదలు. దానికి ముందు ఘంటసాల గారు ఆలపించిన వెంకటేశ్వర స్వామి స్తోత్రం ప్లే చేశాడు. అప్పట్లో ఇది చాలా థియేటర్లలో కామన్. కొన్ని చోట్ల బయట స్పీకర్ ద్వారా ఓ అరకిలోమీటర్ దాకా వినిపించేలా పెట్టేవారు. దీని వల్ల అప్పటికప్పుడు షో చూడాలి అనుకునేవాళ్లుకు ఇదో బెల్ లాంటిది. టైటిల్స్ మొదలయ్యాయి. రజని సింపుల్ ఇంట్రో, నే ఆటోవాణ్ణి అంటూ మొదటి పాట, కాసేపు హీరోయిన్ ట్రాక్ ఇదంతా రొటీన్ గానే ఉంది కదానే ఆలోచనలు. అప్పుడు వచ్చింది అసలైన ట్విస్ట్. నగ్మా నగను దొంగలించారని మాణిక్యం ఆటోని చింపేయడం దగ్గరి నుంచి నాలో అసలైన మాస్ అభిమాని నిద్ర లేచాడు.

చుట్టూ ఉన్న గ్యాంగ్ ని కనుసైగతోనే కంట్రోల్ చేయడం, అలా అమ్మ కళ్ళలోకి చూసి ఇప్పటికిదే ప్రాప్తం అనేలా ఓ ఎక్స్ ప్రెషన్ ఇవ్వడం అబ్బో నాకైతే స్కూల్లో మా మ్యాథ్స్ టీచర్ నన్ను కొడుతున్నప్పుడు అరె నీకు నా బ్యాక్ గ్రౌండ్ తెలియక రెచ్చిపోతున్నావ్ అని మనసులో అనుకున్న సీన్ గుర్తుకొచ్చింది. ఆపై రజనిని స్థంబానికి కట్టేసి విలన్ ఆనందరాజ్ చితకబాదుతుంటే స్కూల్లో వాచ్ పోగొట్టుకొచ్చినందుకు నాన్న చేసిన బడిత పూజనే ఊహించుకున్నా. ఇలా ప్రతి ఫ్రేమ్ లో ఆటో డ్రైవర్ మాణిక్యంతో పిచ్చిగా కనెక్ట్ అయిపోతున్నా. అప్పుడు వచ్చింది మా మావయ్య ఆస్కార్ రేంజ్ లో ఎలివేషన్లు ఇచ్చిన ఇంటర్వెల్ సీన్.

మాణిక్యం తమ్ముడు అరెస్ట్ చేశాక బెయిల్ మీద వచ్చిన ఇంద్రుడు వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి చెల్లిని అల్లరి చేయడం మొదలుపెడతాడు. ఆ గొడవలో ఆమె వెళ్లి అలా కింద పడిపోతూ ఉండగా అన్నయ్య రజిని వచ్చి పట్టుకుని ఆపుతాడు. కళ్ళలో కలర్ ని మార్చుకుని మీదకొస్తున్న గూండాను ఒక్క గుద్దుతో కరెంట్ స్థంభం నుంచి మెరుపులు వచ్చే రేంజ్ లో గుయ్యిమని ఒక్కటిస్తాడు. అంతే నా మెదడులో ఫ్యూజులు ఎగిరిపోవడం, ఈలలకు థియేటర్ పైకప్పు ఎగిరి ఆకాశంలో కలిసిపోతుందేమో అన్న అనుమానం రావడం ఒకేసారి జరిగాయి. ఇక ఆ ఎపిసోడ్ అంతా నోరు తెరుచుకుని చూస్తూనే ఉండిపోయా. చీకటి కాబట్టి లోపలికి ఈగలు దోమలు చేరవనే ధైర్యం వల్ల చుట్టూ ఏం జరుగుతుందో పట్టించుకోలేదు.

ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్ లో మాణిక్యం బాషల స్నేహం, అసలు విలన్ ఆంటోనీ ఎంట్రీ, అన్యాయాన్ని ఎదిరించినందుకు చరణ్ రాజ్ ని చంపడం, దానికి కారణమైన వాళ్ళను ఒక్కొక్కరిగా మాణిక్యం చంపేసి తన పేరుని మాణిక్ బాషాగా మార్చుకోవడం ఇదంతా ఏదో హిస్టీరియా వచ్చినవాడిలా చూస్తూ పోయా. ఓ డబ్బింగ్ సినిమాను జనం ఇంతగా ఎందుకు ఎగబడి చూస్తున్నారో అర్థమయ్యింది. ఇది ఒక్కసారితో సంతృప్తి పడే రకం కాదని మళ్ళీ ఆదోనికొచ్చాక మెహబూబియా థియేటర్లో మరోసారి, ఓల్గా కంపెనీ రిలీజ్ చేసిన వీడియో క్యాసెట్ లో లెక్కలేనన్ని చూస్తే తప్ప నాలో ఆత్మారాముడు శాంతించలేదు.

నాకు సినిమా వ్యామోహం విపరీతంగా పెరగడంలో చిరంజీవి తర్వాత ఈ బాషా పోషించిన పాత్ర చాలా ఉంది. నేను ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పినట్టే డైలాగుని స్కూల్ ఇంటర్వెల్ లో ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసుకున్నామో. నేను ఒక్క సబ్జెక్టు హోమ్ వర్క్ చేస్తే అన్ని సబ్జెక్టులు చేసినట్టేనని మా క్లాస్ టీచర్ తో చెప్పాలని చాలా ట్రై చేశా. కానీ మరీ ఓవరాక్షన్ చేస్తే అదే బాషా ఆడిన సినిమా థియేటర్లో సమోసాలు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుందేమోనని భయపడి ఆగిపోయా. అలా బాషా ఉరఫ్ మాణిక్యం అలియాస్ మాణిక్ బాషా ఎప్పటికీ మర్చిపోలేని ఓ మాస్ ఎన్సైక్లోపీడియాగా నా ప్రయాణంలో తోడు వస్తూనే ఉంటాడు.

ఈ సినిమా చూశాక కొంతకాలం ప్రతి ఆటో డ్రైవర్ వెనకాల ఓ పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉంటుందేమోనని డౌట్ వచ్చేది. దాని ప్రభావం ఆ స్థాయిలో ఉండిపోయింది మరి. బాషాకు ముందు బాషాకు వెనకాల అనే స్థాయిలో రజని మేనియా తెలుగునాట స్టార్ట్ అయ్యింది. దెబ్బకు అంతకుముందు వచ్చిన దళపతి, రౌడీ జమిందార్, అంతులేని కథ లాంటి సినిమాలన్నీ వీడియో క్యాసెట్ అద్దెకు తెచ్చుకుని మరీ చూడటం గుర్తే. అందుకే ఇప్పటికీ బోర్ కొట్టినప్పుడల్లా హార్డ్ డిస్క్ లో HD వీడియో ఫైల్ ని ప్లే చేసుకుంటూ అలా ఇరవై ఏళ్ళ వెనక్కు వెళ్లి ఇలా గుర్తు చేసుకోవడం ఎంత బాగుంటుందో.

ఏంటి లెన్త్ బాగా ఎక్కువయ్యిందనుకుంటున్నారా. నేను పది పేరాలు రాస్తే ఒక్కటి రాసినట్టు..... అందుకే తప్పలేదు......

సెలవు

ఇట్లుతెలుగు భాష ప్లస్ రజని బాషాభిమాని

రవీంద్రనాథ్ శ్రీరాజ్

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp