అవినీతిపై 'ఠాగూర్' ఉక్కుపాదం - Nostalgia

By Ravindra Siraj Sep. 24, 2020, 06:43 pm IST
అవినీతిపై 'ఠాగూర్' ఉక్కుపాదం  - Nostalgia

చరిత్రలో మొదటి పేజీ

కమర్షియల్ సినిమాల్లో సందేశం జొప్పించడం చాలా కష్టం. ఎందుకంటే మాస్ ప్రేక్షకుల అంచనాలను బ్యాలన్స్ చేస్తూ విజయం సాధించడం అంత సులభం కాదు. అందుకే ఇలాంటి రిస్కులు చేసేందుకు సాధారణంగా దర్శక రచయితలు అంతగా ఆసక్తి చూపరు. ఎందుకంటే చెప్పాలనుకున్న మెసేజ్ మోతాదు ఏ మాత్రం ఎక్కువైనా లేదా అది ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దకపోయినా ఫలితంలో చాలా తేడా వచ్చేస్తుంది. అయితే దీన్నో ట్రెండ్ గా మార్చిన వాళ్ళు లేకపోలేదు. 1994లో అర్జున్ జెంటిల్ మెన్ వచ్చినప్పుడు ఆటలు, పాటలు, ఫైట్లతో పాటు సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఓ తీవ్రమైన సమస్యను శంకర్ తీర్చిదిద్దిన తీరుకు ఆడియన్స్ ముగ్దులయ్యారు. ఆనందించారు, ఆలోచించారు.

దాన్ని నిజ జీవితంలో ఆచరించారా లేదా అనేది అప్రస్తుతం. ఓ గొప్ప ప్రయత్నాన్ని మనసారా ఆశీర్వదించారు. దానికి సంతోషించాలి. అలాంటి కథలకు కోట్లాది అభిమానులున్న స్టార్ హీరో తోడైతే ఎలా ఉంటుంది. ఏ స్థాయిలో స్పందన ఉంటుందనే ప్రశ్నకు చక్కని సమాధానం ఠాగూర్. 2002లో తమిళంలో రమణ వచ్చింది. అప్పటికి అజిత్ తో ఓ యావరేజ్ సినిమా తీసిన ఏఆర్ మురుగదాస్ అనే యువకుడు దర్శకుడు. ఆ సమయంలో కాస్త డౌన్ లో ఉన్న విజయకాంత్ మార్కెట్ అమాంతం పైకి లేపి ఆయన కెరీర్ కు మరో ఇన్నింగ్స్ ఇచ్చే స్థాయిలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. లంచగొండితనానికి మరణమే శిక్షగా భావించే ఓ కాలేజీ లెక్చరర్ దానికి బాధ్యులైన ప్రభుత్వ ఉద్యోగులను తన పాత విద్యార్థులతో కలిసి చంపుతూ ఉంటాడు. దానికి బలమైన కారణం ఉంటుంది.

సంఘంలో మార్పు వచ్చే తరుణంలో చట్టానికి లొంగిపోయి తప్పు ఒప్పుకుని ఉరిశిక్షతో తన ప్రాణాలు వదులుతాడు. ఊహించని పాయింట్ తో రూపొందిన ఈ చిత్రానికి అరవనాట బ్రహ్మరథం దక్కింది. పాత రికార్డుల తుప్పు వదిలించింది. వసూళ్లే కాదు రాష్ట్ర పురస్కారాలు కూడా దక్కాయి. దీంతో సహజంగా రీమేక్ హక్కుల కోసం పోటీ మొదలైంది. రాజశేఖర్, వెంకటేష్ ఇంకెవరెవరో రేస్ లో ఉన్నారు కానీ ఒరిజినల్ వర్షన్ నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ తో సాన్నిహిత్యం ఉన్న మధు ఫ్యాన్సి రేట్ ఇచ్చి కొనేసుకున్నారు. హైదరాబాద్ లో చిరంజీవి స్పెషల్ షో చూసి ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా ఓకే చేశారు.

జతకూడిన మహారథులు

పరుచూరి బ్రదర్స్ తమ కలాలతో సిద్ధమయ్యారు. మణిశర్మ స్టూడియోలో మ్యూజిక్ సిట్టింగ్స్ నిరవధికంగా జరుగుతున్నాయి. రీమేక్ అంటే వ్యక్తిగతంగా ఇష్టం లేని వివి వినాయక్ తాను ఎవరిని చూసి స్ఫూర్తి చెంది సినిమాల్లోకి వచ్చానో ఆయన్నే డైరెక్ట్ చేసే అవకాశం వస్తే ఇంకేమి ఆలోచించలేదు. దెబ్బకు అన్నయ్యకు ఎప్పటికి మర్చిపోలేని గిఫ్ట్ ఇవ్వాలి. ప్రతి శాఖకు సంబంధించిన వ్యవహారాలు అన్నీ తనే చూసుకోవడం మొదలుపెట్టాడు. హీరోయిన్ల ఎంపిక పూర్తయ్యింది. ఫ్లాష్ బ్యాక్ కోసం జ్యోతిక, వర్తమానం ఎపిసోడ్ కోసం శ్రియను తీసుకున్నారు. క్లైమాక్స్ గురించి తీవ్ర తర్జనభర్జనలు. ఇంద్ర లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వస్తున్న సినిమా.

ఫ్యాన్స్ కనక చిరంజీవిని ఉరి వేయడం జీర్ణించుకోలేకపోతే దాని దెబ్బకు ప్రొడ్యూసర్ ఫ్యానుకు తాడు బిగించుకోవాల్సి వస్తుంది. చాలా ఆలోచించారు. యాంటీ క్లైమాక్స్ ఉంటే తిరస్కారం తప్పదని గతంలో వచ్చిన కొన్ని సినిమాలు చిరంజీవి కళ్ళముందు మెదిలాయి. న్యాయ నిపుణుల సలహా అడిగారు. ఇన్ని హత్యలకు కారణమైన వారికి ఉరి కాకుండా యావజ్జీవం పడే ఛాన్స్ ఎంతవరకు ఉందనే దాని మీద అభిప్రాయాలు తీసుకున్నారు. పాజిటివ్ ఆన్సర్ వచ్చేసింది. అంతే. ఠాగూర్ ని చివర్లో బ్రతికించాలనే నిర్ణయం తీసుకున్నారు. చిరుతో సహా అందరికీ అదే సబబు అనిపించింది. ఇంద్ర క్రేజ్ ని అతిగా క్యాష్ చేసుకోకుండా మార్కెట్ కు తగ్గట్టు డీసెంట్ బిజినెస్ చేశారు మధు. 600కి పైగా సెంటర్లలో విడుదలకు అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి.

2003 సెప్టెంబర్ 24 - సునామిలోని మొదటి అల

జన సునామి అంటే ఏంటో ఇండస్ట్రీ వర్గాలకు మరోసారి తెలిసివచ్చింది. ఎక్కడ చూసినా ప్రభంజనం. ఏబిసి సెంటర్ల తేడా లేకుండా ప్రతి చోటా హౌస్ ఫుల్ బోర్డులతో విపరీతమైన రద్దీ. జంటనగరాల్లో 29 స్క్రీన్లలో రిలీజ్ చేస్తే చాలా చోట్ల పోలీస్ పహారా పెట్టాల్సి వచ్చింది. క్రాస్ రోడ్స్ సప్తగిరి, కూకట్ పల్లి విశ్వనాథ్ లాంటి థియేటర్ల పరిసరాల్లో ట్రాఫిక్ జామైపోయి ఆ రోజు ఆఫీసులకు లేట్ గా వెళ్లి చివాట్లు తిన్నవారెందరో. సిటీ బస్సులు ఆ రోడ్ల వైపు వెళ్లేందుకు భయపడ్డాయి. మొదటి రోజు అప్పర్ బాల్కనీ టికెట్ 1500 రూపాయలు దాకా పలకడం చిన్న సెన్సేషన్ కాదు. మరుసటి రోజు డిస్ట్రిక్ ఎడిషన్ పేపర్లలో ఇదే హెడ్డింగ్ గా వచ్చింది. ఎక్కడ చూసినా హౌస్ ఫుల్ బోర్డులే. రికార్డుల ఊచకోత మొదలైంది. తర్వాత జరిగింది మిగిలింది ఎప్పటికీ మర్చిపోలేని ఓ చరిత్ర. ఓ రీమేక్ సినిమా ఈ స్థాయిలో సంచలనం రేపడం కొత్తేమి కాకపోయినా ఇంద్ర తర్వాత చిరంజీవి రిస్క్ చేశారేమో అన్న అభిమానుల భయాలను సమూలంగా పోగొట్టడం ఓ తీయని జ్ఞాపకం.

అంత గొప్ప ఏముంది

నిజానికి ఠాగూర్ ఇంతకు ముందు రాని కథ కాదు. 1996లో భారతీయుడులో కమల్ హాసన్ చేసిందే ఇందులో హీరో కూడా ఫాలో అవుతాడు. నిశితంగా గమనిస్తే రెండూ ఒకేలా అనిపించినా ఆశ్చర్యం లేదు. మొదటిదాంట్లో సేనాపతి తన బిడ్డ చావుతో కళ్లుతెరచి ప్రక్షాళన మొదలుపెడతాడు. ఇందులో ఠాగూర్ తన భార్యాబిడ్డ బలయ్యాక అవినీతి సంహారానికి శ్రీకారం చుడతాడు. రెండు కథల్లో ప్రధాన లక్ష్యం లంచగొండులైన గవర్నమెంట్ ఆఫీసర్లే. కానీ అలాంటి సారూప్యతలు ఎక్కువగా కనిపించకుండా మురుగదాస్ తన స్క్రీన్ ప్లే ని ఎమోషన్స్ తో నింపాడు. హాస్పిటల్ ఎపిసోడ్లో చనిపోయిన శవాలకు సైతం ట్రీట్మెంట్ చేసి డబ్బులు గుంజే ప్రైవేట్ ఆసుపత్రుల దందాను చూపించిన తీరు మతులు పోయేలా చేసింది.

తెలుగులో వినాయక్ దాన్నింకా మెరుగ్గా తీర్చిదిద్ది చిత్రీకరించిన విధానం ఫైట్ లేని సన్నివేశాన్ని సైతం ఈలలుతో మోతమ్రోగించింది. ఓ విద్యార్ధి లంచాలకు అలవాటు పడిన తన స్వంత తండ్రిని చంపుకోవాల్సిన సందర్భాన్ని కూడా హృద్యంగా చిత్రీకరించిన తీరుకి కళ్ళు చెమరుస్తాయి. కొత్తగా అనిపించిన షియాజీ షిండే విలనీ, వన్స్ మోర్ అంటూ కేకలు పెట్టించిన మణిశర్మ పాటలు, వాటికి వయసును ఓ 15 ఏళ్ళు వెనక్కు తీసుకెళ్లి మరీ చిరంజీవి వేసిన స్టెప్పులు థియేటర్లను దద్దరిల్లిపోయేలా చేశాయి. ప్రకాష్ రాజ్, పునీత్ ఇస్సార్ పాత్రలు అద్భుతంగా పండాయి. తెలుగులో నాకు నచ్చని పదం క్షమించడం లాంటి డైలాగ్స్ ఊతపదంగా మారిపోయాయి. నేను సైతం గీతం రాసిన సుద్దాల అశోక్ తేజకు జాతీయ పురస్కారం దక్కడం కూడా ఠాగూర్ వల్లే సాధ్యమయ్యింది


ముగింపు లేని పుస్తకం

ఫైనల్ గా 192 కేంద్రాల్లో వంద రోజులు ఆడిన తొలి తెలుగు సినిమాగా ఠాగూర్ అంతకు ముందు ఇంద్రతో సహా అన్ని పాత రికార్డులను తుడిచిపెట్టేసింది. ఇది కదా చిరంజీవి లాంటి స్టార్ చేయాల్సిన చిత్రమని సగటు ప్రేక్షకుడు సైతం ఆనందంతో ఉప్పొంగిపోయాడు. ఇంద్ర స్థాయిలో ఇందులో మాస్ మసాలా అంశాలు లేకపోయినా ఒకపక్క ఆలోచింపజేస్తూనే మరోపక్క నవరసాలను పండించిన వినాయక్ బృందం ఓ రీమేక్ ని ఎలా డీల్ చేయాలో గొప్పగా చెప్పుకోవడానికి ఠాగూర్ ని మంచి ఉదాహరణగా నిలిపింది. ఇప్పటికి 17 ఏళ్ళు అయ్యింది. అయినా టీవీలోనో లేదా ఓటిటి లో చూస్తున్నప్పుడో కట్టిపడేసే సన్నివేశాలు, పాటలు, సంభాషణలు, ఠాగూర్ గా చిరంజీవి విశ్వరూపం రిమోట్ ని పని చేయనివ్వకుండా ఆపేస్తాయి. అందుకే 151 సినిమాల ప్రస్థానంలో ఠాగూర్ కి ఎప్పటికీ ఒక ప్రత్యేక స్థానాన్ని, సింహాసనాన్ని చిరంజీవే కాదు ఆయన అభిమానులూ ఇస్తూనే ఉంటారు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp