మాస్ విశ్వరూపంతో 'సింహాద్రి' పర్వం - Nostalgia

By iDream Post Jul. 09, 2020, 01:52 pm IST
మాస్ విశ్వరూపంతో  'సింహాద్రి' పర్వం - Nostalgia

అసలింతకీ మాస్ సినిమాకి గ్రామర్ తరహాలో ఏదైనా పుస్తకం ఉందా ? లేదు.....

ఫలానా హీరో స్టార్ రేంజ్ కు వెళ్లాలంటే ఎలాంటి కథలు చేయాలి ? ఎవరూ చెప్పలేరు......

నిండా ఇరవై ఏళ్ళు లేని కుర్రోడు తెరమీద గొడ్డలి పట్టుకుని విలన్లను నరికితే జనం ఒప్పుకుంటారా ? ఛాన్సే లేదు.......

బాలయ్య స్థాయి కథానాయకుడు సమరసింహారెడ్డి చేశాడంటే అర్థముంది కానీ మరీ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న పిల్లాడితో అంత హెవీ సబ్జెక్టు రిస్కేమో? అవును నిజమే.......

తొలి అడుగు

2002 సంవత్సరం. జూనియర్ ఎన్టీఆర్. ఊహించని సంచలనం. నందమూరి మూడో తరం ఆశాకిరణంగా బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ రావడానికి ఇంకా చాలా టైం ఉందని అభిమానులు అనుకుంటున్న సమయంలో మెరుపులా వచ్చాడు. తాతయ్య కళని, రక్తంలోని నటనని పెట్టుబడిగా పెట్టి రెండో సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ తోనే స్టామినా చాటాడు. సుబ్బు ఘోరంగా ఫెయిలైనా ఆదితో గట్టి జెండా పాతాడు తారక్. ఆ ఊపులో తొందరపడి ఒప్పుకున్న రెండు కథలు బోల్తా కొట్టాయి. అప్పటికే నిర్మాత దొరస్వామిరాజు గారికి కమిట్ మెంట్ ఇచ్చాడు. పవన్ శ్రీధర్ తో కాలేజీ బ్యాక్ డ్రాప్ లో ఒకటి మొదలుపెట్టారు కానీ కొంత భాగం అయ్యాక ఎవరికీ నచ్చలేదు. డ్రాప్ అయ్యారు. నెక్స్ట్ కలిసుందాం రా ఫేమ్ ఉదయ్ శంకర్ లైన్ లోకొచ్చాడు. కుర్రాడు టైటిల్ తో ఫ్రెష్ గా స్టార్ట్ చేశారు. ఇదీ అంతే. ఆగిపోయింది. అప్పటికే మూడు కోట్లకు పైగా ఖర్చయిపోయింది. ఇలాంటి పరిస్థితిలో ఎవరికైనా ఒత్తిడి కలగడం సహజం. అలుపు లేకుండా జూనియర్ కథలు వింటూనే ఉన్నాడు. ఎవరెవరో వస్తున్నారు. ఏదేదో చెబుతున్నారు. ఏదీ నచ్చడం లేదు. కొన్నిసార్లు తలనెప్పి వల్ల నిద్రకూడా పట్టేది కాదు. అక్కడ దొరస్వామిరాజు గారు అనుభజ్ఞులు కాబట్టి తట్టుకున్నారు కానీ ఇంకో కొత్త నిర్మాత ఎవరైనా అయితే ఈపాటికి తూర్పుకో దండం పెట్టి వెళ్ళిపోయేవారు. కానీ ఇద్దరి సంకల్పం చాలా బలంగా ఉంది.

ఏ నిర్మాతైనా సినిమా మీద కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతున్నాడంటే దానికి కారణం అంతకంతా వెనక్కు రావడంతో పాటు భారీ లాభాలు మూటగట్టుకుని ఇంకో చిత్రం తీసే ధైర్యం ఇవ్వడం కోసం. దానికి మాస్ మసాలా ఫార్ములాని మించిన తిరుగులేని మంత్రం మరొకటి లేదు. సరిగ్గా జపించామా కనక వర్షం కురుస్తుంది. తేడా కొట్టిందా రక్తం వచ్చేలా రాళ్లు(విమర్శలు) పడతాయి. స్వర్గీయ నందమూరి తారకరామారావుకైనా యాభై అడవి రాముళ్లు లేవు. చిరంజీవికి ఎన్ని ఇండస్ట్రీ హిట్లు వచ్చినా ఖైదీదే ఫస్ట్ ర్యాంకు. ఇలా ప్రతి హీరోకు మాస్ ఇచ్చిన బంగారు కిరీటం ఒకటుంటుంది. జూనియర్ ఎన్టీఆర్ కూ మూడు సినిమాలు తిరక్కుండానే ఆది లాంటి వజ్రం వినాయక్ ఇచ్చాడు. దాన్ని మించిన కోహినూర్ మరొకటి కావాలి. అది ఎవరిస్తారు. ఆదితో వచ్చిన స్టార్ డంని టెన్షన్ పెడుతూ 2002 టైంలో వచ్చిన అల్లరి రాముడు, నాగ రెండు ఆశించిన విజయాలు అందుకోలేదు. డేంజర్ బెల్లు మ్రోగింది. ఈసారి ఎట్టి పరిస్థితిలో పొరపాటు చేయకూడదు. ఆలస్యమైనా పర్లేదు బాక్స్ ఆఫీస్ మీద గట్టిదెబ్బ పడాలి. ఆకలి మీదున్న పులి వేట ఎలా ఉంటుందో రుచి చూపించాలి. అప్పుడు కలిసిన వ్యక్తి కె విజయేంద్ర ప్రసాద్.

రెండో కలయిక

నాన్న కబురు పెట్టగానే రాజమౌళి ఎంట్రీ ఇచ్చాడు. అప్పటికే తారక్ తో స్టూడెంట్ నెంబర్ వన్ చేయడంతో మంచి బాండింగ్ ఉంది. కాకపోతే అది గురువుగారు రాఘవేంద్రరావు స్టైల్ లో తీసిన సినిమా కావడంతో తనలో సిసలైన మాస్ డైరెక్టర్ ని బయటికి తీసుకురావాలని ముందే రాసిపెట్టుకున్న సింహాద్రి కథ చెప్పడం మొదలుపెట్టారు. చర్చ జరుగుతున్నప్పుడు మధ్యమధ్యలో డైవర్ట్ అయ్యే అలవాటు ఉన్న జూనియర్ మొదటిసారి ఏదో వేదపాఠం వింటున్న వాడిలా శ్రద్ధగా కూర్చున్నాడు. జక్కన్న నెరేషన్ కి రోమాలు నిక్కబొడుస్తున్నా అదమాయించుకుని చెవులను పూర్తిగా అప్పగించేశాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ విని మతి పోయినంత పనైంది. గునపం తీసుకుని హీరోయిన్ హీరోని పొడవడమనే పాయింట్ ఎలా ఆలోచించాడో అక్కడున్న ఎవరికీ అర్థం కాలేదు. కాసేపు షాక్ తిన్నారందరూ. కానీ రాజమౌళి అవన్నీ పట్టించుకోవడం లేదు. చెప్పుకుంటూ పోతున్నాడు. కేరళ ఫ్లాష్ బ్యాక్ డిస్కషన్లో మంచి నీళ్లు తాగడం కూడా మర్చిపోయారందరూ. ఎదురుచూసింది దొరికేసింది. లోలోపల జూనియర్ ఎన్టీఆర్ మురిసిపోతున్నాడు. ఎప్పటి నుంచి షూటింగో అక్కడిక్కడే డేట్స్ ఫిక్స్ చేశారు. నెల రోజుల్లో స్క్రిప్ట్ సిద్ధం చేయాలి. సంభాషణల రచయిత రత్నంతో పాటు తన టీమ్ ని డే అండ్ నైట్ డ్యూటీకి రెడీ కమ్మని ఫోన్లోనే ఆర్డర్ ఇచ్చేసి రాజమౌళి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరోపక్క కీరవాణి స్వరాలకల్పనలో తన స్టూడియోలో మునిగి తేలుతున్నాడు

2002 డిసెంబర్ లో షూటింగ్ మొదలుపెట్టి మే నెలకంతా పూర్తి చేశారు. 8 కోట్ల దాకా ఖర్చయ్యింది.ప్రీ రిలీజ్ పోస్టర్లు, ఆడియో రెస్పాన్స్, వర్కింగ్ స్టిల్స్ తో ఎక్కడ లేని క్రేజ్ వచ్చేసింది. బయ్యర్లు ఎగబడి కొన్నారు. టేబుల్ బిజినెస్ సుమారు 13 కోట్లకు పైగానే అయ్యింది. రెండు యావరేజ్ సినిమాల తర్వాత కూడా జూనియర్ మీద ఇంత నమ్మకమాని ఆశ్చర్యపోయిన వాళ్ళే ఎక్కువ. 2003 జులై 9న సగర్వంగా థియేటర్లలో అడుగు పెట్టాడు సింహాద్రి. ఓపెనింగ్స్ అదిరిపోయాయి. అందులో ఎవరికీ ఆశ్చర్యం లేదు. ఎందుకంటే నాగకు కూడా ఇదే స్థాయిలో వసూళ్లు వచ్చాయి. ఇప్పుడు కావాల్సింది వీటిని నిలబెట్టే బలమైన టాక్. అది అభిమానుల దీవెనల్లో కన్నా మాస్ ఆడియన్స్ చేతిలో ఎక్కువగా ఉంది. తెల్లవారుఝామున వేసిన బెనిఫిట్ షోల నుంచి ఫ్యాన్స్ ఉద్వేగంతో బయటికి వచ్చారు. ఇదిరా బొమ్మంటే అని అరుచుకుంటూ గేటు బయటికి వెళ్లకుండా మళ్ళీ టికెట్ కౌంటర్ల వైపు పరుగులు పెట్టారు. డిస్ట్రిబ్యూటర్ల ప్రతినిధులకు సీన్ అర్థమైపోయింది. వాళ్ళు ఉన్న థియేటర్ల ల్యాండ్ లైన్ ఫోన్లు ఆగకుండా మ్రోగుతున్నాయి. అంతకంతా పెరుగుతున్న రద్దీని చూసి కాల్స్ కు బదులు చెప్పాలన్న ధ్యాస కూడా పోయింది. జాతరను తలపించే జన సమూహాలతో సింహాద్రి ఆడుతున్న హాళ్లు కిక్కిరిసి పోతున్నాయి.

రికార్డుల వేట మొదలు

అక్కడ మొదలైన రికార్డుల ఊచకోత వంద రోజుల వరకు ఆపై సిల్వర్ జూబిలీ దాకా అలా కొనసాగుతూనే పోయింది. కనివిని ఎరుగని స్థాయిలో 150 కేంద్రాల్లో శతదినోత్సవం, 52 సెంటర్లలో వజ్రోత్సవం చేసుకోవడం చూసి ఈ సినిమాను కొనడం మిస్ అయిన వాళ్ళకు గుండెపోటు వచ్చింది. ఎక్కడ చూసినా కలెక్షన్ల మోత. ఏ సెంటర్లో విన్నా రికార్డుల ఉప్పుపాతర. దొరస్వామిరాజు గారి ఆనందం గురించి చెప్పేదేముంది. హౌస్ ఫుల్ బోర్డులు ఫెవికాల్ వేసి అతికించినట్టు గేట్లకు అంటుకుపోయి తీసేసే అవసరమే పడలేదు. 175 రోజుల దాకా ఇదే తంతు. అదిలో తారక్ విశ్వరూపాన్ని వినాయక్ A4 పేపర్ లో చూపిస్తే రాజమౌళి ఏకంగా 24 షీట్ ఆయిల్ ప్రింట్ మీద భీభత్సం జరిగేలా ప్రదర్శించాడు. ఆ తర్వాత ఇద్దరూ మళ్ళీ యమదొంగ చేసినా సింహాద్రి స్థానం మాత్రం ఎప్పటికీ చెక్కుచెదరదుమాస్ ఫార్ములాకు డెఫినిషన్

నిజానికి ఇందులో కథ ఎప్పుడూ కననిది కాదు విననిదీ కాదు. హీరో అండర్ డాగ్ తరహాలో అజ్ఞాతంలో ఉంటూ తన గతాన్ని ఎవరికీ తెలియనివ్వకుండా ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతూ టైం వచ్చినప్పుడు పవర్ ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చెయ్యడం చాలాసార్లు వచ్చిందే. రజినీకాంత్ బాషా, బాలకృష్ణ సమరసింహారెడ్డిలు ఇదే ఫార్ములాతో రికార్డులు కొల్లగొట్టినవే. సింహాద్రి కూడా అదే స్టైల్ లో వెళ్తుంది. అచ్చు అలాగే తీస్తే వర్కవుట్ కాదని జక్కన్నకు తెలుసు కాబట్టే మాస్ కు కిక్కిచ్చే అంశాలు కావలసినన్ని జోడించుకున్నాడు. పరమాన్నం తింటే కడుపు నిండే ఆకలికి బిర్యాని పెడితే ఏం జరుగుతుందో రుచి చూపించాలనుకున్నాడు. అందుకే సింహాద్రికి ప్రాణంగా నిలిచిన కేరళ ఎపిసోడ్ ని పూనకంతో ఊగిపోయే రేంజ్ లో రాయించుకున్నాడు. మాములుగానే మనం చుట్టూ ఉండే రౌడీయిజాన్ని వ్యతిరేకించడానికి భయపడతాం. అలాంటిది బాష తెలియని రాష్ట్రంలో అక్కడి అరాచక వ్యవస్థకు రొమ్మువిరిచి ఎదురునిలిచిన హీరోని చూపిస్తే ఇంతకన్నా ఎలివేషన్ మరొకటి ఉంటుందా. ఆ ఆలోచనే సింహాద్రి విజయ రహస్యం. అందరికి తెలిసిన కథ ఇక్కడ మళ్ళీ చెప్పే ఉద్దేశం లేదు కాబట్టి దాని ప్రస్తావన తీసుకురావడం లేదు.

సింహాద్రి వన్ మ్యాన్ షో అనేది అభిమానుల నిశ్చితాభిప్రాయం. ఒక కోణంలో ఇది కరెక్టే. ఎందుకంటే బాలా నాయర్ గ్యాంగ్ ని ఊచకోత కోయడం మొదలుపెట్టి నెత్తుటితో తడిసిన తన దేహానికి పాలాభిషేకం చేయించుకునే దాకా జూనియర్ ఎన్టీఆర్ పలికించిన రౌద్ర రసం మాములుగా పండలేదు. రోమాంచితం అనే అనుభూతికి ప్రేక్షకులు ప్రత్యక్షంగా లోనయ్యారు. తనవాళ్లను చంపిన వాళ్ళ మీద ఒక సామాన్యుడికి ఎంత కసి ఉంటుందో కళ్ళతోనూ హావభావాలతోనూ జూనియర్ చూపించిన తీరుకి బాప్ రే ఏంటీ యాక్టింగ్ అనుకున్నారందరూ. అంతగా తనలో లీనం చేసుకున్నాడు సింగమలై పాత్రను. అయితే మిగిలినవాళ్ల ప్రమేయాన్ని పక్కనపెట్టలేం. భూమిక పాత్ర పరంగా ఒదగగా కేవలం గ్లామర్ షో కోసమే అంకితను వాడుకున్నారు. కాని విలన్లుగా చేసిన రాహుల్ దేవ్, ముఖేష్ ఋషిలు తమ పాత్రలకు ప్రాణం పోశారు. వీళ్ళది ఏ మాత్రం తేడా కొట్టినా సింహాద్రి హీరోయిజం ఈ స్థాయిలో పండేది కాదు. భానుచందర్, సీత, నాజర్, సంగీత, శరత్ సక్సేనా, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు ఇలా అన్ని పాత్రలకు బెస్ట్ తీసుకుని క్యాస్టింగ్ విషయంలో తన మాస్టరీ టాలెంట్ ఇందులో నుంచే చూపించడం మొదలుపెట్టాడు రాజమౌళి. కీరవాణి సంగీతం సింహాద్రిని ఇంకో లెవెల్ కు తీసుకెళ్ళింది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని సైతం హమ్ చేసుకునే రేంజ్ లో కంపోజ్ చేసిన తీరు అద్భుతం. నువ్ విజిలేస్తే ఆంధ్రాసోడా బుడ్డి పాటకు హాల్లోనే గెంతులు వేసిన ఫాన్స్ ఉన్నారు. అమ్మైనా నాన్నైనా మెలోడీని ఇష్టపడని వారు లేరు. బీట్ సాంగ్స్ లో సైతం కీరవాణి తన మార్కు చూపించేశారు. రవీంద్రబాబు ఛాయాగ్రహణం సైతం పోటీ పడింది. ఇలా చెప్పుకుంటే ఒక్కో విభాగానిది ఒక్కో అధ్యాయమే అవుతుంది.

ముగింపుకొద్దాం

గోదావరి పుష్కరాల బ్యాక్ డ్రాప్ లో సీన్ జరుగుతోంది. హటాత్తుగా సింహాద్రి మీద పెద్ద గూండాల బ్యాచ్ దాడి చేసింది. తన శక్తిమేరా పోరాడుతూ ఒక్కొక్కడిని మట్టి కరిపిస్తున్నాడు. సర్లే ఇది ఎన్ని సినిమాల్లో చూశామో అనుకుంటున్న టైంలో నలువైపులా కమ్ముకున్న రౌడీలతో ఫైట్ చేస్తున్న సింహాద్రిలో నరసింహావతారం మొదలైంది. అప్పుడు జరిగింది అనూహ్య సంఘటన. ఎక్కడో నది మధ్యలో పెద్ద బోటు మీద వస్తున్న తెల్ల పంచె వేసుకున్న శరత్ సక్సేనా గట్టిగా సింగమలై అని అరుస్తూ గొడ్డలి విసరడం, దాన్ని మెరుపు వేగంతో అందుకున్న సింహాద్రి వెంటనే కొబ్బరికాయలు వలిచినట్టు శత్రువులను ఊచకోత మొదలుపెట్టడం చూసి అప్పటిదాకా కుర్చీలో కూర్చుని కుదురుగా కూర్చుని చూస్తున్న అభిమానుల ఒంట్లోకి ఒక్కసారిగా హై వోల్టేజ్ వైబ్రేషన్స్ మొదలయ్యాయి. అది మొదలు ఈరోజుకి 17 ఏళ్ళు దాటినా సింహాద్రి పేరు విన్నప్పుడల్లా రెట్టింపు సౌండ్ తో ఆ ఈలలు కేకలు వాళ్ళ మనసును తాకుతూనే ఉన్నాయి. ఇలాంటి మాస్ విశ్వరూపంతో సింహాద్రి పర్వాన్ని రాసినందుకు రాజమౌళికి థాంక్స్ చెబుతూనే ఉంటాయి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp