అన్నమయ్యను మరిపించిన భక్తి రసం - Nostalgia

By iDream Post Mar. 30, 2021, 05:00 pm IST
అన్నమయ్యను మరిపించిన భక్తి రసం - Nostalgia

సినిమాల్లో అన్ని వర్గాలను మెప్పించేలా తీయడంలో చాలా రిస్క్ అనిపించేది భక్తి రసం. ఎందుకంటే ఇది మతాలకు సంబంధించిన వ్యవహారం కాబట్టి చాలా సున్నితమైన అంశాలు ముడిపడి ఉంటాయి. ఒకప్పుడు వీటికి విపరీతమైన ఆదరణ ఉండేది. పాండురంగ మహత్యం, శ్రీ షిరిడి సాయిబాబా మహత్యం, భక్త తుకారాం, భక్త ప్రహ్లాద లాంటి ఎన్నో ఆణిముత్యాలు అమోఘమైన ఆదరణ దక్కించుకున్నాయి. అయితే మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా క్రమంగా ఇవి తీసేవాళ్ళు తగ్గిపోయారు. 1997లో అన్నమయ్య వచ్చే దాకా వీటి జోలికి వెళ్లిన దర్శకులు చాలా తక్కువ. నాగార్జున లాంటి కమర్షియల్ హీరోతో రాఘవేంద్ర రావు ఆవిష్కరించిన దృశ్యకావ్యం ఆబాలగోపాలాన్ని మైమరిచిపోయేలా చేసి పరవశింపజేసింది.

ఆ స్ఫూర్తితోనే 2005లో శ్రీరామదాసు కథను చెప్పాలని నిర్ణయించుకున్నారు నాగ్ మరియు దర్శకేంద్రులు. నిజానికి కింగ్ ఆ టైంలో శివమణి, మాస్, నేనున్నాను లాంటి హిట్స్ తో మంచి ఊపుమీదన్నారు . మరోవైపు గంగోత్రి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రాఘవేంద్రరావు చేసిన సుభాష్ చంద్ర బోస్, అల్లరి బుల్లోడు దారుణంగా బోల్తా కొట్టాయి. అందుకే మరోసారి ఆధ్యాత్మికతను తట్టిలేపే కథ కోసం జెకె భారవిని సంప్రదించగా శ్రీరామదాసు స్క్రిప్ట్ ని రసరమ్యంగా తీర్చిదిద్ది అందించారు. మరోసారి కీరవాణి స్వరాలు సమకూర్చేందుకు సిద్ధమయ్యారు. కబీర్ దాస్ పాత్ర కోసం అక్కినేని నాగేశ్వరరావు గారు ఒప్పుకోవడం గొప్ప శుభసూచకంగా అనిపించింది. అలా 2002లో షూటింగ్ ప్రారంభించుకున్న శ్రీరామదాసు ఎలాంటి ఆటంకాలు లేకుండా సిద్ధమైపోయింది.


2006 మార్చ్ 30న శ్రీరామదాసు ప్రేక్షకుల తీర్పు కోసం వచ్చాడు. కుతుబ్ షాను ఎదిరించి చెరసాలలోనూ తన భక్తిని చాటుకున్న రామభక్తుడి గాధను చూసి మురిసిపోయారు. అన్నమయ్యను మరిపించేలా నాగార్జున నటన మరోసారి జేజేలు అందుకుంది. బాక్సాఫీస్ లెక్కల్లో ఆ స్థాయి కాకపోయినా మారుతున్న జెనరేషన్ లోనూ అద్భుత వసూళ్లు తెచ్చి నాగ్ రాఘవేంద్రరావు కాంబినేషన్ ని మరోసారి పునీతం చేసింది. ముఖ్యంగా పాటలు మిక్కిలి ఆదరణ పొందాయి. స్నేహ హీరోయిన్ గా సుమన్ శ్రీరాముడి పాత్రలో తమ నటనతో సొబగులు అద్దారు. దర్శకేంద్రుడి మార్కు కమర్షియల్ ట్రిక్కులు ఉన్నప్పటికీ శ్రీరామదాసు సుమారు 67 కేంద్రాల్లో వంద రోజులు ప్రదర్శింపబడటం ఓ విశేషం. తర్వాత ఏ భక్తి సినిమాకూ ఇంత స్పందన దక్కలేదన్నది వాస్తవం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp