మాసు కామెడీతో క్లాసు భోజనం - Nostalgia

By iDream Post Jun. 07, 2021, 08:30 pm IST
మాసు కామెడీతో క్లాసు భోజనం - Nostalgia

స్టార్ హీరోలతో కామెడీ చేయడం అంత సులభం కాదు. వాళ్ళ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని అన్ని బ్యాలన్స్ అయ్యేలా కథాకథనాలు రాసుకోవాలి. కేవలం హాస్యాన్ని మాత్రమే నమ్ముకుంటే కమర్షియల్ గా సేఫ్ అయ్యే అవకాశాలు తగ్గుతాయి. చిరంజీవి చంటబ్బాయిని ఇప్పుడు మనం హిలేరియస్ కల్ట్ క్లాసిక్ అని పిలుచుకోవచ్చు. కానీ అది రిలీజైన టైంలో మెగాస్టార్ స్థాయికి తగ్గట్టు వసూళ్లు రాబట్టుకోలేకపోయింది. అందుకే దర్శక రచయితలు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే స్క్రిప్ట్ ల రూపకల్పన చేసుకుంటారు. దానికి ఉదాహరణగా పద్నాలుగేళ్ల క్రితం రిలీజైన 'దుబాయ్ శీను' గురించి చెప్పుకోవచ్చు.

2007 సంవత్సరం. రవితేజ ఫామ్ మాములుగా లేదు. బ్లాక్ బస్టర్లతో దూసుకుపోతున్న సమయం. మధ్య మధ్యలో ఫ్లాపులు స్పీడ్ బ్రేకుల్లా అడ్డు పడుతున్నప్పటికీ దానికి డబుల్ కిక్ ఇచ్చే సక్సెస్ వెంటనే పలకరిస్తున్న టైం అది. 'నీ కోసం'తో తనకు ఫస్ట్ బ్రేక్ ఇచ్చిన దర్శకుడు శ్రీను వైట్ల అంటే రవితేజకు ముందు నుంచి ప్రత్యేకమైన అభిమానం. అప్పటికి వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'వెంకీ' కామెడీ చిత్రాల్లో ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఏర్పరుచుకుంది. అందుకే హ్యాట్రిక్ హిట్ ఇంకా గట్టిగా పడాలన్న ఉద్దేశంతో రాసుకునే కథే దుబాయ్ శీను. గోపిమోహన్ రచన సహకారంతో చింతపల్లి రమణ సంభాషణలు సమకూర్చగా మణిశర్మను మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంచుకున్నారు. నయనతారను హీరోయిన్ గా ఎంచుకోగా ఇండస్ట్రీలో టాప్ కమెడియన్స్ ని శ్రీను వైట్ల సెట్ చేసుకున్నారు.

అందరూ దుబాయ్ వెళ్ళాడనుకుంటున్న శ్రీనివాస అలియాస్ శీను(రవితేజ)అనే కుర్రాడు కొందరు కేటుగాళ్లు చేతిలో మోసపోయి స్నేహితులతో కలిసి ముంబైలో పావ్ భాజీ సెంటర్ పెట్టుకుంటాడు. ఈ క్రమంలోనే మధుమతి(నయనతార)అనే అమ్మాయి కోసం వెతుకుతూ ఉంటాడు. అతనలా చేయడానికి కారణమైన స్నేహితుడు చక్రి(జెడి)చావు వెనుక ఉన్న జిన్నా భాయ్(సుశాంత్ సింగ్) తారసపడతాడు. అలా కథ సాగుతుంది. దుబాయ్ శీను సక్సెస్ కి ప్రధాన కారణం అందులో పదే పదే నవ్వించే అద్భుతమైన కామెడీ. ముఖ్యంగా బ్రహ్మానందం, వేణు మాధవ్, కృష్ణ భగవాన్, షియాజీ షిండేల ట్రాక్ రిపీట్ ఆడియన్స్ ని తీసుకొచ్చింది. 2007 జూన్ 7న విడుదలైన దుబాయ్ శీను కేవలం వారం గ్యాప్ లో వచ్చిన రజనీకాంత్ శివాజీ పోటీని తట్టుకుని మరీ సూపర్ హిట్ అయ్యింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp