డేట్లు లాక్ చేసుకున్న బంగారు జాంబీలు

By iDream Post Jan. 12, 2021, 12:07 pm IST
డేట్లు లాక్ చేసుకున్న బంగారు జాంబీలు

యాభై శాతం సీట్లతోనూ సోలో బ్రతుకే సో బెటరూ, క్రాక్ ఇచ్చిన స్ఫూర్తితో టాలీవుడ్ లో కొత్త సినిమాల విడుదల ప్రవాహం మొదలయ్యింది. ఫుల్ ఆక్యుపెన్సీకి అనుమతులు వచ్చినా రాకపోయినా తమ రిలీజులను ఒక్కొక్కరుగా ప్రకటించేస్తున్నారు. ఇందాక బంగారు బుల్లోడు, జాంబీ రెడ్డి తాలూకు అనౌన్స్ మెంట్లు వచ్చేశాయి. అల్లరి నరేష్ హీరోగా పివి గిరి దర్శకత్వంలో రూపొందిన బంగారు బుల్లోడు జనవరి 23 రాబోతున్నాడు. తేజ సజ్జ చేసిన హారర్ థ్రిల్లర్ జాంబీ రెడ్డి ఫిబ్రవరి 5న కరిచేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ మేరకు రెండు యూనిట్లు అధికారికంగా ప్రకటనలు ఇచ్చేశాయి. మొన్నే యాంకర్ ప్రదీప్ సినిమా జనవరి 29 లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే.

చాలా కాలంగా సోలో హీరోగా హిట్టు లేక ఇబ్బంది పడుతున్న అల్లరి నరేష్ కు బంగారు బుల్లోడు సక్సెస్ చాలా కీలకం. మహర్షిలో క్యారెక్టర్ పేరు తెచ్చినప్పటికీ అది మహేష్ బాబు సినిమా కావడంతో తనకు వచ్చిన ప్రయోజనం పెద్దగా లేదు.పై పెచ్చు సపోర్టింగ్ రోల్స్ ఆఫర్స్ ఎక్కువగా వచ్చాయి. అందుకే కెరీర్ ని మళ్ళీ ట్రాక్ ఎక్కించాలని డిసైడ్ అయిన నరేష్ మరోసారి ఎంటర్ టైన్మెంట్ జానర్ ని ఎంచుకున్నాడు. పూజా ఝవేరి హీరోయిన్ గా నటిస్తోంది. అప్పుడెప్పుడో పాతికేళ్ల క్రితం వచ్చిన బాలకృష్ణ సూపర్ హిట్ మూవీ టైటిల్ కావడంతో బంగారు బుల్లోడు మీద ఆ రకంగానూ ప్రత్యేకమైన అంచనాలు నెలకొన్నాయి.

ఇక జాంబీ రెడ్డి విషయానికి వస్తే అ! ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా మీద మంచి హైపే ఉంది. టాలీవుడ్ మొదటి జాంబీ థ్రిల్లర్ గా చెబుతున్నారు కానీ గతంలో వచ్చిన ఒకటి రెండు ఎవరూ పట్టించుకోనివి కావడంతో ఇది హై లైట్ అవుతోంది. కామెడీ కం హారర్ ని సమంగా మిక్స్ చేస్తూ హాలీవుడ్ లో మాత్రమే ఎక్కువగా వచ్చే జాంబీ కాన్సెప్ట్ ని తీసుకోవడం వెరైటీగా ఉంది. దానికి రాయలసీమ బ్యాక్ డ్రాప్, రెడ్డి టైటిల్ ని పెట్టడం వైరల్ అయ్యేందుకు స్కోప్ ఇచ్చింది. మొత్తానికి రెండు మీడియం బడ్జెట్ సినిమాలు డేట్లను లాక్ చేసుకున్నాయి. రానున్న రోజుల్లో మరికొన్ని ప్రకటనలు రాబోతున్నాయి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp