కన్నడ పవర్ స్టార్ సినిమా ఏమైంది

By iDream Post Apr. 01, 2021, 04:00 pm IST
కన్నడ పవర్ స్టార్ సినిమా ఏమైంది

ఇటీవలి కాలంలో కన్నడ నిర్మాతలకు అక్కడి హీరోల ఇమేజ్ ఇక్కడ మ్యాచ్ అవుతుందా, వాళ్ళను మన ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారా లేదా అనే లెక్కలతో సంబంధం లేకుండా పాన్ ఇండియా ట్యాగ్ తగిలించేసి డబ్బింగులు చేస్తున్నారు. ఇదే తరహాలో వచ్చిన పొగరు, రాబర్ట్ ఎంతటి దారుణమైన ఫలితాలు అందుకున్నాయో చూశాం. కనీసం పబ్లిసిటీ ఖర్చులు కూడా రాలేదు. అక్కడేమో ఇవి మంచి వసూళ్లు తెచ్చినవే. అయినా పట్టువదలని విక్రమార్కుల్లా శాండల్ వుడ్ ప్రొడ్యూసర్లు ప్రయత్నాలు మాత్రం ఆపడం లేదు. ఆ కోవలో వచ్చిన కొత్త సినిమానే యువరత్న. రేపు పోటీ ఉన్న నేపధ్యంలో ఒక రోజు ముందే వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో రిపోర్ట్ లో చూద్దాం

ఆర్కె కాలేజీ కం యూనివర్సిటీకి డీన్ గా ఉన్న గురుదేవ్(ప్రకాష్ రాజ్)కు పిల్లల్లో విలువలు పెంచడం, విద్యను వ్యాపారంగా కాక ఒక సేవగా భావించడం తన విధిగా పెట్టుకుంటాడు. కానీ విద్యాశాఖ మంత్రి(సాయి కుమార్)మంత్రితో పాటు మరికొన్ని దుష్టశక్తులు కలిసి ఈయన ప్రయత్నానికి అడ్డుపడుతూ కళాశాలకు చెడ్డ పేరు తెచ్చే పనులు చేస్తుంటాయి. అప్పుడు రంగంలో దిగుతాడు అర్జున్(పునీత్ రాజ్ కుమార్). అసలు ఇతను ఎవరు, కాలేజీ వ్యవహారాలకు సంబంధం ఏమిటి, గురుదేవ్ కి ఎందుకు అండగా నిలబడ్డాడు లాంటి ప్రశ్నలకు సమాధానం తెరమీదే చూసి తరించాలి. బోలెడు సమస్యలను హీరో ఎలా పరిష్కరించాడో అదే కథ.

సినిమా చూస్తున్నంత సేపు లెక్కలేనన్ని తెలుగు చిత్రాలు గుర్తుకు వస్తూనే ఉంటాయి. చిరంజీవి మాస్టర్ తో మొదలుపెట్టి నాగ చైతన్య జోష్ దాకా, అమీర్ ఖాన్ 3 ఇడియట్స్ తో స్టార్ చేస్తే విజయ్ మాస్టర్ దాకా ఎన్నో లెక్కబెట్టడం కష్టం. మనకు అసలు పరిచయమే లేని పునీత్ రాజ్ కుమార్ ని ఇంత ఓవర్ మాస్ సబ్జెక్టులో చూడటం చాలా కష్టం. అందులోనూ హీరోయిజంని అతిగా ఎలివేట్ చేసి నమ్మశక్యం కాని విధంగా ఇతనితో చేయించిన ఫీట్లు మనకు కనెక్ట్ కావు సరికదా విపరీతమైన విసుగు తెప్పిస్తాయి. హీరోయిన్ వృధా అయ్యింది. తమన్ సంగీతం కూడా సోసోనే. మొత్తానికి మరో కన్నడ డబ్బింగ్ మన ఓపికను పరీక్షించడానికి తప్ప ఇంకెందుకు ఉపయోగపడలేదు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp